గీతోపనిషత్తు -163


🌹. గీతోపనిషత్తు -163 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 8

🍀 8 - 5. యోగ కారకములు - 4. సమలోష్టాశ్మకాంచనః : లోహమును, రాయిని, బంగారమును సమానముగ చూచుట ఎరిగినవాడే యోగారూఢుడైన యోగి అని భగవంతుడు చెప్పుచున్నాడు. దీని రహస్య మేమనగ, అన్నిటి యందు అంతర్యామిదైవ మొక్క రీతిగనే యున్నాడు. అంతర్యామి దైవమును దర్శించువాడు యోగి. చైతన్యము యొక్క వికాసమును బట్టి ప్రకాశము, ప్రభావము వేరు వేరుగ నుండును. జీవుల యందు కూడ వారి వారి ప్రకాశమును బట్టి, వారి వారి విలువ లేర్పడుచుండును. ఈ చైతన్య విలాసము వెనుకగల అస్థిత్వమును దర్శించువాడు నిజమగు యోగియని శ్రీకృష్ణుని భావము. 🍀

జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థా విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః || 8


4. సమలోష్టాశ్మకాంచనః :

లోష్ట మనగ లోహము లేక ఇనుప ముక్క. అశ్మము అనగ రాయి (గుండ్రాయి). కాంచన మనగ బంగారము. లోహమును, రాయిని, బంగారమును సమానముగ చూచుట ఎరిగినవాడే యోగారూఢుడైన యోగి అని భగవంతుడు చెప్పుచున్నాడు. రాయి కన్న లోహము, లోహము కన్న బంగారము మానవుల దృష్టిలో విలువైనవి.

అట్లే శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు కూడ హెచ్చుతగ్గులతో పరిగణింపబడు చున్నాడు. అట్లే విద్యావంతుడు, అజ్ఞాని భేద దృష్టితో చూడబడుచున్నాడు. ఇట్లెన్నియో అసంఖ్యాకములైన విషయములు భేదబుద్దితో చూడ బడుచున్నవి. ధనికుడు, దరిద్రుడు, అధికారి, సామాన్యుడు ఇత్యాదివి కూడ నట్లే.

వీటన్నిటిని సమానముగ చూచుట ఎట్లు? అన్నమును, అశుద్ధమును సమానముగ చూడదగునా? ఇది సాధ్యపడు విషయమా? సృష్టియందు దేని విలువ దానికున్నది గదా! గుఱ్ఱము, గాడిద ఒకటి ఎట్లగును? ఉప్పు, కప్పురము ఒక్క పోలిక నున్న వాని రుచులు వేరు కదా! దుర్జనులకు, సజ్జనులకు, సామాన్యులకు భేదము లేదా? ఇత్యాది ప్రశ్నలెన్నియో పుట్టుకొని వచ్చును.

పై తెలిపిన వన్నియు సమానమని చెప్పుట మెట్టవేదాంతమే అగును. అది ఆచరణ యుక్తము కూడ కాదు. మరి భగవంతుడిట్లు చెప్పినాడేమి? దీని రహస్య మేమనగ, అన్నిటి యందు అంతర్యామి దైవ మొక్క రీతిగనే యున్నాడు. అంతర్యామి దైవమును దర్శించువాడు యోగి. పై తెలిపిన అన్ని అంశములు స్థితిగొని యున్నవి గదా. స్థితి విషయమున అన్ని అంశములు ఒక్కటియే. రాజు ఉన్నాడు. పేద ఉన్నాడు. బ్రాహ్మణుడు ఉన్నాడు. అట్లే క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నారు. రాయి ఉన్నది. రాము డున్నాడు.

ఇచ్చట గమనించవలసిన విషయము “ఉండుట" అను విషయము. దీనిని స్థితి అందురు. ఉండుట అన్నిటియందు సమానమే. కాని ఆయా వస్తువుల చైతన్య వికాసమునందు భేదము కలదు. కొన్నిటి యందు చైతన్యము ఎక్కువ వికసించి యుండును. కొన్నిటి యందు తక్కువ వికసించి యుండును.

చైతన్యము యొక్క వికాసమును బట్టి ప్రకాశము, ప్రభావము వేరు వేరుగ నుండును. అశ్మము కన్న లోహమందు ప్రకాశ మెక్కువ. ఇనుము కన్న బంగారమునందు ప్రకాశ మెక్కువ. అట్లే జీవుల యందు కూడ వారి వారి ప్రకాశమును బట్టి, వారి వారి విలువ లేర్పడుచుండును. గ్రామ పాలకునకు, సామ్రాజ్య పాలకునకు వ్యత్యాసము వారి చైతన్య వికాసమును బట్టి యుండును.

చైతన్య విలాసమంతయు యోగి దృష్టియందు ఒక మాయా నాటకము. ఈ జన్మకు రాజైనవాడు పై జన్మకు బంటు కాగలడు. ముందు జన్మయందు కూడ బంటుయే అయి ఉండవచ్చును. ఈ జన్మలో ధనికుడు క్రిందటి జన్మలో పేద కావచ్చును. ఇట్లు జీవులు జన్మకొక పాత్ర పోషణము చేయుచు, వేల జన్మలలో వివిధములగు పాత్రలు పోషించు చుందురు. ఈ చైతన్య విలాసము వెనుకగల అస్థిత్వమును దర్శించువాడు నిజమగు యోగియని శ్రీకృష్ణుని భావము.

యోగి జీవులను, వారియందు వర్తించుచున్న అంతర్యామిని దర్శించి, సమదర్శనుడై నిలుచును. సృష్టియందు ఆ జీవులు పోషించు పాత్ర ననుసరించి వారితో ప్రతిస్పందించును. పాత్ర పోషణమున వైవిధ్య ముండవచ్చును. దానికాధారభూతుడగు జీవుని యందు వసించు అంతర్యామి ఒక్కడే. ఇది తెలిసినవాడు యోగార్హుడగును గాని, కేవలము ప్రకృతి విలువలకే పట్టము కట్టుచు జీవించు మిడిమిడి జ్ఞానము కలవాడు కాదు.

యోగ సాధకుడు అంతర్యామితో అనుసంధానము చెందుట వలన యోగార్హుడై, యోగియై నిలబడును. చైతన్య విలాసములకు ఆకర్షింపబడినచో యోగ భ్రష్టుడగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Mar 2021

No comments:

Post a Comment