శ్రీ శివ మహా పురాణము - 363


🌹 . శ్రీ శివ మహా పురాణము - 363 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

94. అధ్యాయము - 06

🌻. పార్వతి పుట్టుట - 3 🌻

దేవతలిట్లు పలికిరి -


ఓ జగన్మాతా! మహాదేవీ! నీవు సర్వసిద్ధులను ఇచ్చుదానవు. నీవు సర్వదా దేవకార్యములను చక్కబెట్టెదవు. కాన నిన్ను సమస్కరించుచున్నాము (39). హే భక్తవత్సలే! దేవతలకు అన్ని విధములా కల్యాణమును కలిగించుము. మేన యొక్క మనోరథము పరిపూర్ణమైనది. శివుని మనోరథమును గూడ పరిపూర్ణము జేయుము (40).

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు దేవతలు ఆ శివాదేవిని ఇట్లు స్తుతించిరి, ప్రణమిల్లి, ప్రీతులై ఆమె యొక్క ఉత్కృష్టమగు జన్మను ప్రశంసిస్తూ తమ తమ ధామములకు వెళ్లిరి (41).

ఓ నారదా! నల్ల కలువ రేకులవలె ప్రకాశించుచున్న ఆ బాలికను చూచి సుందరియగు మేన అతిశయించిన ఆనందమును పొందెను (42). మేన ఆమె దివ్యరూపమును చూచి, ఆ పిదప జ్ఞానమును పొంది, ఆమె పరమేశ్వరియని గుర్తించి మిక్కిలి ఆనందించి స్తుతించెను (43).

మేన ఇట్లు పలికెను -

ఓ జగదంబా! మహేశ్వరీ! నీవు నాయందు అతిశయించిన దయను చూపితివి. ఏలయన, హే అంబికే! నీవు నీ సుందరరూపముతో నా ఎదుట ప్రత్యక్షమైతివి (44). శక్తులన్నింటికి మూలమగు శక్తివి నీవే. హే శివే! నీవు ముల్లోకములకు తల్లివి. నీవు సర్వదా శివునకు ప్రియురాలవగు దేవివి. దేవతలందరు స్తుతించే పరాశక్తివి నీవే (45). ఓ మహేశ్వరీ! దయను చూపుము. నీవు నా ధ్యానమునందు నిలిచి యుండుము. నీవు ఈ రూపములో ప్రత్యక్షమై, కుమార్తెతో సమానమగు రూపమును స్వీకరించుము (46).

బ్రహ్మ ఇట్లు పలికెను -

హిమవంతునికి ప్రియమగు భార్యయై చక్కని సంతానమును గనిన ఆమేన యొక్క ఈ మాటను విని శివా దేవి ఇట్లు బదులిడెను (47).

దేవి ఇట్లు పలికెను -

ఓ మేనా!పూర్వము నీవు నన్ను శ్రద్ధతో చక్కగా సేవింతివి. నీభక్తిచే నేను మిక్కిలి ప్రసన్నురాలనై, వరము నీయుట కొరకు నీ వద్దకు వచ్చితిని (48). 'వరమును కోరుకొనుము' అని నేను పలుకగా, నీవు విని 'ఓ మహాదేవీ!నీవు నాకు కుమార్తెవై జన్మించి, దేవకార్యమును చక్కబెట్టుము' అని నీవు కోరియుంటివి (49).

నేనపుడు నాకా వరమునిచ్చి నా ధమమునకు వెళ్లితిని. ఇపుడు దానికి సమయము వచ్చినది. ఓ హిమవంతుని ప్రియురాలా! నీకా కుమార్తెనై జన్మించితిని (50). నేనిపుడు దివ్య రూపముతో నీ ఎదుట ప్రత్యక్షమైతిని. అట్లు ప్రత్యక్షమై నీకు నా స్మరణ కల్గునట్లు చేసితిని. అట్లు గానిచో, నీవు నన్ను గుర్చించలేక అజ్ఞానముచే నన్ను ప్రాకృత స్త్రీయని తలపోసి యుండెడి దానవు (51).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి జగన్మాతయగు ఆ శివ మిన్నకుండెను. తల్లి ప్రేమతో చూచుచుండగనే ఆమె వెనువెంటనే తన మాయాశక్తిచే శిశు రూపమును స్వీకరించెను (54).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ జన్మవర్ణనమనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


03 Mar 2021

No comments:

Post a Comment