యథాతథమే మేలు - ఎరుక మీకు స్వేచ్ఛ నిస్తుంది


🌹. యథాతథమే మేలు - ఎరుక మీకు స్వేచ్ఛ నిస్తుంది 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ



ఎందుకంటే, అతనికి ‘‘ఏంచెయ్యాలి, ఎలాచెయ్యాలి, అలా చెయ్యాలా, ఇలా చెయ్యాలా’’ లాంటి ప్రత్యామ్నాయాలు ఏమాత్రముండవు. కచ్చితంగా జరిగే వాటి కోసం అన్ని తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కాబట్టి, ప్రతి క్షణం నిర్ణయాత్మకమవుతుంది.

గతం ప్రభావానికి ఏమాత్రం లోను కాకుండా, సిద్ధంగా ఉన్న నిర్ణయాలను ఎప్పుడూ పాటించని, పూర్వ నిశ్చిత నిర్ణయాలు ఏ మాత్రం లేని స్వేచ్ఛాయుతమైన చైతన్యవంతుడు తాజాగా, మచ్చలేని మనిషిగా, ఏమాత్రం కలుషితం కాకుండా పూర్తి ఎరుకతో ముందుకెళ్తాడు. అలాంటి ఎరుక మీకు కలిగితే అన్నీ మిమ్మల్ని అనుసరిస్తాయి. ఎందుకంటే, అన్నింటికీ ఎరుకే అసలైన కీలకం.

ప్రేమికునిగా, సహనశీలిగా, అహింసాయుతునిగా, శాంతమూర్తిగా- ఇలా ఏదోలా అయేందుకు ఎప్పుడూ ప్రయత్నించకండి. అలా చేస్తే మిమ్మల్నిమీరు బలవంతపెట్టినట్లే. మీరు కపటిగా మారినట్లే. అదే విధంగా మతాలన్నీ పూర్తిగా మోసపూరితంగా మారిపోయాయి. అందుకే మీరు పైకి ఒకలా, లోపల మరొకలా ఉంటారు. పైకి, మీరు చాలా చక్కగా నవ్వుతూ కనిపించినా, మీ అంతరంగంలో చంపాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. మీ అంతరంగం పరమచెత్తతో నిండి దుర్గంధం చిమ్ముతున్నా, పైకి మీరు గులాబీలా పరిమళాలు వెదజల్లుతూ ఉంటారు.

అణచివేత అనేది మనిషి జీవితానికి సంభవించిన ఘోర విపత్తు. కాబట్టి, ఎప్పుడూ దేనినీ అణచకండి. అతి చక్కని కారణాలకోసమే అణచివేత జరిగింది. చాలా నిశ్శబ్దంగా కదలకుండా ఉన్న బుద్ధుణ్ని చూడగానే, అలా అవాలనే దురాశ మీలో కలుగుతుంది. వెంటనే మీరు రాతి విగ్రహంలా ఏమాత్రం కదలకుండా చాలా నిశ్శబ్దంగా ఉండేందుకు ప్రయత్నించడం ప్రారంభిస్తారు. ఒకవేళ కదిలే పరిస్థితి ఎదురైతే వెంటనే మీరు అణచివేతను ఆశ్రయించి, ఎలాగోలా మిమ్మల్ని మీరు నియంత్రించు కుంటారు.

కాబట్టి, ‘నియంత్రణ’ అనేది చాలా అసహ్యమైన పదం.

‘స్వేచ్ఛ’ చాలా అందమైన పదం. దానిని మీరు చాలా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, నా దృష్టిలో అది ‘‘విచ్చలవిడిగా తిరిగేందుకు ఇచ్చిన అనుమతి పత్రం’’ కాదు. కానీ, అందరూ దానిని అలాగే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, నియంత్రించ బడిన మనసు ‘స్వేచ్ఛ’ గురించి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. పరిస్థితులు కూడా దానికి తగినట్లే ఉన్నాయి.

కానీ, నేను చెప్పే ‘స్వేచ్ఛ’అలాంటిది కాదు. ‘నియంత్రణ’ వ్యతిరేక ధృవమే ‘విచ్చలవిడితనం’. సరిగ్గా వాటి మధ్యలో ఉండేదే స్వేచ్ఛ. అంటే, ఎలాంటి నియంత్రణ, విచ్చలవిడితనం లేనిదే నేను చెప్పే స్వేచ్ఛ.

స్వేచ్ఛకు స్వీయ క్రమశిక్షణ ఉంది. అది మీ ఎరుక, ప్రామాణికతల నుంచి పుడుతుందే కానీ, ఏ అధికారి ద్వారానో అమలు చేసేది కాదు. అందువల్ల ‘విచ్చలవిడితనమే స్వేచ్ఛ’అని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోకూడదు. అలాచేస్తే ‘స్వేచ్ఛ’ అసలు అర్థాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు.

ఎరుక మీకు స్వేచ్ఛ నిస్తుంది. అలాంటి స్వేచ్ఛలో ఎలాంటి నియంత్రణల అవసరము ఉండదు కాబట్టి, ఎలాంటి అనుమతి పత్రాలకు చోటుండదు. నిజానికి, అనుమతి పత్రాల కారణంగానే మీరు బలవంతంగా నియంత్రించ బడుతున్నారు. మీరు ఏమాత్రం మారని పక్షంలో విచ్చలవిడి సమాజం మిమ్మల్ని ఎప్పుడూ నియంత్రిస్తూనే ఉంటుంది.

మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలని ఎప్పుడూ బలవంతపెట్టే రాజకీయ నాయకులు, రక్షక భటులు, న్యాయమూర్తులు, న్యాయస్థానాల అస్తిత్వానికి మీ విచ్చలవిడితనమే కారణం. అలా మిమ్మల్నిమీరు నియంత్రించు కోవడంలో, వేడుక చేసుకుంటూ హాయిగా జీవించాలనే అసలు విషయాన్ని మీరు మరచిపోతారు. అయినా, అంతగా నియంత్రణలో చిక్కుకున్న మీరు వేడుక ఎలా చేసుకోగలరు? దాదాపు ప్రతిరోజూ అలాగే జరుగుతుంది.

క్రమశిక్షణలో ఎక్కువగా నియంత్రించ బడిన అనేక మంది నన్ను చూసేందుకు వస్తుంటారు. కానీ, వారు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఎందుకంటే, వారి చుట్టూ బలమైన గోడలుంటాయి. అందువల్ల వారిలో వేడి నశించి రాయిలా గడ్డకట్టి పోతారు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


03 Mar 2021

No comments:

Post a Comment