🌹 14. అశోకత్వము - అవ్యక్తముగ నున్నది వ్యక్తమైనపుడు పుట్టినదనుకొనుట, వ్యక్తమైనది అవ్యక్తమును జేరునపుడు చచ్చినదను కొనుట అజ్ఞానము. 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 30 📚
దేహీ నిత్య మవధ్యో-యం దేహే సర్వస్య భారత | తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి || 30
సృష్టి సమస్తమూ ఒక దిశగా వ్యక్తమగుచుండగా, మరియొక దిశగా అవ్యక్తమును చేరుచూ మరల వ్యక్తమగుచుండును. వ్యక్తము కానపుడు సూత్రప్రాయముగను, వ్యక్తమగునపుడు రూపాత్మకముగను ఒకే తత్త్వము నిలచియున్నది.
చోటులోని కనపని నీరు వర్షమైనప్పుడు వ్యక్తముగను, భూమికి చేరి ప్రవహించునపుడు 'నది' యగును. ఉత్తర దక్షిణ ధృవములందు కఠినమైన మంచుగడ్డ యగును. సూర్యరశ్మిచే మరల క్రమశః చోటును చేరును. మరల అవ్యక్త మగును. కాలక్రమమున మరల వర్షముగ వ్యక్తమగును.
సృష్టిలోని సమస్త వస్తువులూ అట్టివే. వ్యక్తావ్యక్తముగ చక్ర భ్రమణమున అగుపించుచూ అదృశ్యమగుచూ, నిరంతరమూ వుండును.
ఈ ధర్మమును తెలిసినవాడు దేనికిని శోకింపడు. అతనికి జననము - మరణము అనునవి మిథ్యా పదములే. కనుక జీవుల పుట్టుకయందు ఉత్సాహము, మరణము నందు దుఃఖము వానికి కలుగవు.
పుట్టునవి - చచ్చునవి అని ఏమియూ లేవు. శాశ్వత దర్శన మొక్కటే యుండును. దానియందతడు ఉపస్థితుడై యుండును.
ఇట్టి దర్శనము మాత్రమే సమస్త శోకముల నుండి జీవుని తరింప జేయగలదని 'గీతోపనిషత్తు' బోధించు చున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment