నారద భక్తి సూత్రాలు - 78


🌹. నారద భక్తి సూత్రాలు - 78 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము - సూత్రము - 46

🌻 46. _ కస్తరతి కస్తరతి మాయమ్‌ ? యః సంగం త్వజతి, యో మహానుభావం సేవతే, నిర్మమో భవతి ॥ 🌻

భాగము - 2

విష్ణమాయ ఎంత బలీయమంటే ఒకసారి విష్ణుమూర్తి మోహినీ రూపం ధరించినప్పుడు సాక్షాత్తు హరుడే ఆ మోహంలో పడ్డాడు. వారికి ఒక కుమారుడు కూడా కలిగాడు. అతడే హరిహర సుతుడని పిలువబడే అయ్యప్ప స్వామి అని అందరికీ తెలుసు. అందువలన మాయను దాటటం ఎవరి వశం? అందుకే సంసార భ్రాంతి గురించి హెచ్చరిస్తున్నది ఈ సూత్రం.

మహాత్ముల, అనుభవజ్ఞుల సహాయాన్ని తీసుకోమంటున్నారు. రామ కృష్ణావతారాలు, సద్గురువులు, బుషివర్యులు, భాగవతోత్తములు, ఆచార్యులు వీరందరూ మహానుభావుల క్రిందికి వస్తారు. అవతారకాలం కానప్పుడు కూడా ఎవరో ఒక మహానుభావుడు అన్ని కాలాలలో ఉంటూనే ఉంటాడు.

మహానుభావులు లోక కళ్యాణం కోసం క్రతువులు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. దేవాలయ నిర్మాణాలు చేయిస్తూ, భక్తి మతాన్ని కాపాడుతూ ఉంటారు.

అనేక ప్రవచనాలు చేస్తూ ఉంటారు. అనేక ఆధ్యాత్మిక మార్గాలను ప్రచారం చెస్తూ ఉంటారు. కొందరికి ప్రేరణ ఇస్తూ పై చెప్పిన కార్యాలు జరిపిస్తూ కూడా ఉంటారు. శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ వివేకానంద స్వామికి స్ఫూర్తినిచ్చి అతని వలన లోకోపకారం జరిపించారు. మహానుభావుల కృప అట్టది.

మహాత్ములు దొరకడమే అరుదు. మనకు సాధన మార్గమందు శ్రద్ధ కలిగి పురోగమిస్తూ ఉంటే, మహాత్ములు అప్రయత్నంగా దొరుకుతారు.

సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్ధం వందనం మోక్ష సాధనం అని మహాత్ముల మహిమ గురించి పెద్దలు చెప్పేవారు. అట్టి వారిని సేవించడాన్ని అదృష్టంగా భావించాలి.

హఫీజ్‌ గురువుల విషయంలో ఈ విధంగా చెప్పాడు.

(1) ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు లేకుండా, అదృష్టవంతుడగు బానిసవలె మహాత్ముని ఆజ్ఞను పాటించాలి.

(2) ఆయన నుండి విన్న దానిని ఎన్నడూ తప్పు అనకు. ఎల అనగా ఆయనను అర్ధం చెసుకోలెని అసమర్ధత, లోపం మనలోనే ఉన్నది.

(3౩) అహంకార మమకారాలతో కూడిన గౌణభక్తి నుండి మనలను విడుదల చెసి ముఖ్యభక్తిలోనికి ప్రవేశపెట్టిన మహానుభావునికి ఏమిచ్చి బుణం తీర్చుకొనగలం?

(4) ఆయన ఏమి చేసినా మనకందరికీ అత్యంత ప్రయోజనకారి అవుతుంది.

(5) “దొరకునా ఇటువంటి సేవ” అని శుశ్రూష (సేవ) చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

27 Aug 2020

No comments:

Post a Comment