🌹. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 43 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయలవరకు చరిత్ర అంతమవుతుంది. తరువాత కాలంలో ఈ ఖండం మహ్మదీయుల పరమవుతుంది. శ్వేతముఖులు (తెల్లవాళ్ళు) భారత రాజ్యాన్ని ఏలతారు.
పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొగలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమయిన రీతిగా, జనాన్ని నశింపచేస్తుంది.
వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు, వివాహాలు చేసుకుని కాపురాలు చేస్తారు. గురువులు ఆడంబరంగా బతుకుతారు.
కుటుంబంలో సఖ్యత వుండదు. తల్లీ, తండ్రీ, పిల్లల మధ్య వాత్సల్యాలు వుండవు. ఒకరిమీద మరొకరికి నమ్మకం నశిస్తుంది. నా రాకకు ముందుగా, నా భక్తులు వారి శక్త్యానుసారము నా ధర్మ పరిపాలనకు అంకురార్పణలు చేస్తారు’’ అని సిద్ధయ్యకు వివిరించారు బ్రహ్మేంద్రస్వామి.
🌻. కర్నూలు నవాబుకు స్వామివారు కాలజ్ఞానము బోధించుట 🌻
క్రోధ నామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి, సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీర భోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన ఒక గొప్ప నక్షత్రం ఉద్భవించి, అందరికీ కనిపిస్తుంది.
చండి పర్వతం, ఆలంపూర్ మొదలైన స్థాలములలో ఉత్పాతాలు పుడతాయి. ఈ ప్రాంతంలో పాలెగాళ్ళు, తమలో తాము ఘర్ఘణ పడి, చెడి అడవుల పాలై భ్రష్టులై పోతారు. నలు దిక్కుల యందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
అమావాస్య రోజున పూర్ణచంద్రుని చూసి జనులు నశిస్తారు. కార్తీకం నిజమని నా మహిమను తలచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
తూర్పున శిరస్సు, పడమర తోకగా, తోక వెడల్పుగా ఇరువది బారల పొడవుగల నల్లని ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజులకు అందరికీ కన్పిస్తుంది. ఆకాశం ఎర్రబడి, ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి.
ఈశ్వరమ్మను. రంగరాజునకిచ్చి వివాహం చేసేనాటికి కందిమల్లయ్య పల్లె నవరత్న మండపాలతో పన్నెండు ఆమడల పట్నమవుతుంది. నా భక్తులు యావన్మంది యిక్కడకు వచ్చి కళ్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం’’
ఈ కాల జ్ఞానం విన్న తరువాత నవాబు, స్వామివారికి అనేక బహుమతులను అందజేశాడు. ఆ బహుమతులను బ్రహ్మగారి మఠంలోనే వుంచారు.
కొన్ని రోజుల తరువాత కొంతమంది దొంగలు ఈ వస్తువులను ఏ విధంగా అయినా దోచుకోవాలని అక్కడికి వచ్చారు. ఆ రాత్రి మఠంలో ప్రవేశించి ఆ వస్తువులను పట్టుకున్నారు. అంతే! వారికి కండరములు స్వాధీనంలో లేకుండా అయిపోయాయి. ఎంత ప్రయత్నించినా మాట కూడా మాట్లాడలేకపోయారు. భయంతో అలాగే నిలబడి చూడటం తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు.
వారిని పట్టుకున్నారు ఆశ్రమవాసులు. ఇది తెలిసి అక్కడికి వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. వారిని చూసినా, ఆయన కోపం తెచ్చుకోలేదు. పైగా వారికి తగిన బోధ చేయాలని నిర్ణయించుకుని, వారికీ సైతం కాలజ్ఞానాన్ని ఉపదేశించారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం
27 Aug 2020
No comments:
Post a Comment