భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 94




🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 94  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 13 🌻

72. ఓకసారి బ్రహ్మ, మైత్రేయాది మహర్షులు పరాశరుని, “జీవబ్రహ్మాంశ” లక్షణములను గురించి వివరంగా చెప్పమన్నారు. 

73. ఆయన జ్యోతిషశాస్త్రం చెప్పాడు. మనుష్యుల్లో కలిగిన జీవబ్రహ్మాంశ భేదములు జ్యోతిషశాస్త్రంద్వారా తెలుసుకోవాలి. జీవుడికి – అంటే కర్మచేత ఈ శరీరాన్ని పొందినటువంటి జీవత్వానికి – శుభాశుభములు దగ్గరలోనే ఉంటాయి. ఈ కర్మలన్నిటికీ అతీతంగా స్వతంత్రంగా ప్రకాశించే వస్తువులో బ్రహ్మయే ఉంది. 

74. అది అంతర్యామిగా. జీవుడియొక్క పరిణామదశలయందు భావనచేసి, మనో బుద్ధి చిత్తాహంకారములతో దేహాత్మభావన కలిగిన మనుష్యులు ఏయే సమయాల్లో ఆత్మదర్శన హేతువయినటువంటి ధర్మార్థాలను ఆచరించాలో; కామాన్ని వదిలిపెట్టి, నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని ఎలాచేరాలో ఆ మార్గాన్ని బోధించటమే జ్యోతిషశాస్త్రబోధలో పరాశరమహర్షి ఉద్దేశ్యం. 

75. జీవబ్రహ్మాంశ భేదములెలా తెలుసుకోవాలి? అంటే దానికి సమాధానంగా జ్యోతిషశాస్త్రం చెప్పాడు. అంతే కాని, భౌతికజీవనంలోని క్షణికమైన శుభాశుభాలు తెలుసుకోవటానికి చెప్పలేదు. దీనివల్ల జీవబ్రహ్మాంశభేదం తెలుస్తుంది. దానివల్ల శుభాశుభములు కూడా కలుగుతాయి. 

76. ఇప్పుడీ అర్థంలో జీవాంశ ఏది, బ్రహ్మాంశ ఏది, ఈ జాతకుడిలో? బ్రహ్మాంశ అంటే జ్ఞానాంశ. తరుణోపాయం వెతుక్కునేటటువంటి మార్గంలో ఈతడి ప్రస్తుతస్థితి ఎటువంటిదనే విచారణలో ఉన్నటువంటిది బ్రహ్మాంశ. 

77. జీవాంశ అంటే, దానికి ఇతడు చేయవలసిన తపస్సు. తపస్సా! యోగమా! భక్తా! ఇతడికి ఏది ఉత్తమమో, ఇతడి కులాచారం, సంస్కారాలనుబట్టి ఎటువంటిదయితే బాగుంటుంది? ఏ దైవాన్ని ఆరాధించాలి? ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలి? ఇతడికి యోగ్యమైనటువంటి మోక్షోపాయం ఏది? అని, ఆ బ్రహ్మాంశను గురించి ఈ స్థితిని తెలుసుకున్న జ్యోతిష్యుడు ఈ జీవాంశకు కర్తవ్యబోధ చెయ్యాలి. ఆ పరిణామదశలు తెలుసుకోవడం కోసమే జ్యోతిషశాస్త్రమని పరాశరుడి ఉద్దేశ్యం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


27 Aug 2020


No comments:

Post a Comment