✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 6
🍀 6. స్వభావ - మిత్రత్వము - “నీ మాట వినని స్వభావము నీకు శత్రువే. నీ మాట విను స్వభావము నీకు ఆప్తబంధువే.” తన చిత్త ప్రవృత్తులను తాను నియమించుకొను సామర్థ్యము కలవానికి తన స్వభావము తనకు బంధువై యుండును. లేనిచో తన స్వభావమే తనకు శత్రువై పనిచేయును. చిత్తము ప్రజ్ఞయొక్క నాలుగవ స్థితి. ప్రజ్ఞ యన్నను, చైతన్య మన్నను ఒకటియే. చైతన్యమనగ మనలోని ఎరుక. ఈ ఎరుక లేనిచో మన మున్నామని కూడ మనకు తెలియదు. ఈ ఎరుక లేక చైతన్యము మనయందలి దైవము. అది మనయందు అహం కారముగను, బుద్ధిగను, చిత్తముగను అవతరించు చున్నది. 🍀
బంధు రాత్మా 22 త్మన స్తస్య యేనాత్మైవాత్మనా జితః |
అనాత్మనసు శత్రుత్వే వస్తే తాత్మైవ శత్రువత్ || 6
తన చిత్త ప్రవృత్తులను తాను నియమించుకొను సామర్థ్యము కలవానికి తన స్వభావము తనకు బంధువై యుండును. లేనిచో తన స్వభావమే తనకు శత్రువై పనిచేయును.
చిత్తము ప్రజ్ఞయొక్క నాలుగవ స్థితి. ప్రజ్ఞ యన్నను, చైతన్య మన్నను ఒకటియే. చైతన్యమనగ మనలోని ఎరుక. ఈ ఎరుక లేనిచో మన మున్నామని కూడ మనకు తెలియదు. ఈ ఎరుక లేక చైతన్యము మనయందలి దైవము. అది మనయందు అహం కారముగను, బుద్ధిగను, చిత్తముగను అవతరించు చున్నది.
మన యందలి చైతన్యమునకు చిత్తము తోక వంటిది. దైవము తల వంటిది. ఈ నాలుగును కలిపి ఒక దండమువలె భావించవచ్చును. దీనిని యోగదండమని కూడ పిలువ వచ్చును. చిత్తము బాహ్య ప్రపంచములో ప్రవర్తించుటకు దేహముతో సాంగత్యము చేయుచున్నది.
ప్రపంచమున వ్యవహరించు చున్నప్పుడు స్వభావ మేర్పడుచున్నది. స్వభావ మనగా తనదైన అనుభవము నుండి పుట్టిన ఒక అవగాహన. ఈ అవగాహనయందు అభిప్రాయములు, సిద్ధాంతములు యుండును. అవియన్నియు స్వభావమునకు సంబంధించినవియే.
చిత్తమునకు సంబంధించినవి కావు. తాను, తన స్వభావము మిళితముకాక యున్నపుడు చిత్తము బంధింపబడదు. మిళితమైనపుడు బంధింపబడును.
తన స్వభావమునకు తాను లోబడకుండుట తాను చేయవలసిన సాధన. తన స్వభావము తాను కాదని, తాను చైతన్యమని ప్రతి నిత్యము గుర్తుచేసుకొనుట ప్రథమ కర్తవ్యము. దీనికి పరిశీలనము అవసరము. దీనినే ఆత్మపరిశీలన మందురు. తాను వెలుగని, ఆ వెలుగులో ప్రపంచము గోచరించు చున్నదని తెలియవలెను.
చీకటి గదిలో దీప మున్నపుడు అన్నియు గోచరించును. దీపము లేనిచో గదిలో వస్తువు లున్నను, తనకు గోచరించవు. తాను ప్రపంచమును చూచుచున్నపుడు, తన వెలుగే ప్రపంచము నావిష్కరించు చున్నది. దానిని గూర్చిన అభిప్రాయములు గూడ ఏర్పడు చున్నవి. తన అభిప్రాయములు కేవలము తనకే పరిమితము. అట్లే యితరులకు కూడ వారి అభిప్రాయము లుండును.
ఈ విధముగ అందరి యందలి చిత్తము ఒకే వెలుగైనప్పటికి అనుభవమునుబట్టి అవగాహన, అభిప్రాయములు ఏర్పడుచుండును. ఈ అభిప్రాయము లన్నియు కలిసి సమష్టిగ ఒక స్వభావ మేర్పడు చున్నది. తనకన్న తన స్వభావము గొప్పది కాదు.
తన నుండి పుట్టినది తనను శాసించరాదు. అట్లు తన స్వభావము తనను శాసించుట జరుగరాదు. కాని అట్లే జరుగు చుండును. తినకూడదని తెలిసి తినుట, వినకూడదని తెలిసి వినుట, చూడకూడదని తెలిసి చూచుట, ఊరక తిరగకూడదని తెలిసి తిరుగుట, అధిక ప్రసంగములు చేయకూడదని తెలిసి చేయుట సామాన్యముగ జరుగు చున్నదియే గదా.
చేయవలసినవి మరచి చేయదగనివి చేయుచు బ్రతుకుచున్న స్థితి గమనించుచునే యున్నాము గదా! అనగా తన స్వభావము తనను పరిపూర్ణముగ బంధించినదనియే అర్థము. దీనికి పరిష్కారము నిత్య ఆత్మపరిశీలనమే.
తానొంటరిగ కూర్చొని తన భావములను, స్వభావమును పరిశీలించుకొనుట. ಇಟ್ಟು పరిశీలించుకొనుటలో తన స్వభావము, తన దేహమునుండి తనను తాను వేరుగ గుర్తించవలెను. లేనిచో తన స్వభావమే తాముగా నుండిపోవుదురు. తమ దేహమే తాముగ భావించి మరణింతురు. అందువలన ఈ శ్లోకమున దైవము ఒక హెచ్చరిక చేయుచున్నాడు.
“నీ మాట వినని స్వభావము నీకు శత్రువే. నీ మాట విను స్వభావము నీకు ఆప్తబంధువే.”
ఉదయముననే నిద్రలేచినచో బాగుండును, అని అనిపించి నను లేవలేకపోవుట స్వభావము చేతిలో ఓటమి. ఇట్లెన్నియో ఉదాహరణలు చెప్పవచ్చును. తెలియుట వేరు, ఆచరణ వేరు.తనకు శ్రేయస్కరమని తెలిసిన కూడ, తా నాచరింపలేని స్థితి యున్నచో తన స్వభావమే తన శత్రువని తెలియవలెను.
తెలిసినది ఆచరింప గలిగినచో తన స్వభావము తనకు సహకరించు చున్నదని తెలియ వలెను. తన స్వభావము తనతో మిత్రత్వము వహించుట ప్రధాన మని గీతాచార్యుడు హెచ్చరిక చేయుచున్నాడు. అట్టి సహకారము లభించుటకు దైవము నాశ్రయించుటయే పరిష్కారము. ఆరాధన మార్గమున దైవము నాశ్రయింప వచ్చును.
నిష్కామ కర్మ నిర్వహణ మార్గమున మరింత బలము చేకూర్చును. పరహిత జీవనము ఆ బలమును యినుమడింప జేయును. ముందు అధ్యాయములలో తెలుపబడిన సూత్రముల ననుసరించినచో తనకు, తన స్వభావమునకు మైత్రి ఏర్పడి, యోగమునకు అనుకూల పరిస్థితి ఏర్పడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Feb 2021
No comments:
Post a Comment