రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
92. అధ్యాయము - 04
🌻. దేవి దేవతలనోదార్చుట - 2 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు మొదలగు దేవతలందరు ఇట్లు పలికి ప్రేమ నిండిన హృదయములు కలవారగుటచే ఆ పైన మాటలాడ లేక మౌనముగా నున్న వారై, భక్తితో శిరసు వంచి నమస్కరిస్తూ నిలబడి యుండిరి (20).
ఆ దేవతల స్తోత్రమును వినిన ఉమాదేవియూ మిక్కిలి ప్రసన్నురాలై, వారి స్తోత్రమునకు గల హేతువును మనస్సులో తేలుసుకొని, తన ప్రభువుగు శివుని స్మరించెను (21). అపుడు ఉమాదేవి చిరునవ్వు నవ్వెను. దయామూర్తి, భక్తవత్సల అగు ఆమె విష్ణువు మొదలగు దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను (22).
ఉమ ఇట్లు పలికెను -
హే విష్ణో!బ్రహ్మా!దేవతలారా!మునులారా!మీరు భయమును వీడి అందరు నా మాటను వినుడు. నేను ప్రసన్నురాలనైతిని. సందేహము లేదు (23).నా చరిత్ర ముల్లోకములలో అంతటా ప్రాణులకు సుఖముల నీయగలదు. దక్షుని మోహము ఇత్యాది సర్వమును నేనే కలుగు నట్లు చేసితిని (24).
నేను భూమిపై పూర్ణాంశతో అవతరించగలను. సందేహము లేదు. అట్లు అవతరించుటకు అనేక కారణములు గలవు. నేను వాటిని శ్రద్ధతో మీకు వివరించెదను (25). దేవతలారా! సతీ రూపములో నున్న పుత్రికగా పొందుటకై దక్షుడు, వీరిణి తపస్సును చేసిరి గదా! అదే తీరున పూర్వము హిమవంతుడు, మరియు మేన మిక్కిలి భక్తితో నన్ను ఆరాధించిరి (26).
ఇప్పటి నుండియూ మీరు నిత్యము దృఢమగు భక్తితో నన్ను సేవించుడు. మేన కూడా నన్ను విశేషముగా ఆరాధించు గాక! నేనామె కుమార్తెగా జన్మించగలను. ఈ విషయములో సందేహము లేదు (27). రుద్రుడే గాక మీరు కూడా నేను హిమవంతుని గృహములో అవతరించవలెనని కోరుచుండవచ్చును. నేను అటులనే అవతరించ గలను. అపుడు సర్వుల దుఃఖము తొలగి పోగలదు (28).
మీరందరు మీమీ స్థానములకు వెళ్లుడు. మీరు చిరకాలము సుఖములను పొందగలరు. నేను మేనా దేవి యందు కుమార్తెగా జన్మించి, ఆమెకు పరమానందము నీయగలను (29). నేను శివునకు పత్నిని కాగలను. నా యందీ కోరిక రహస్యముగా దాగి యున్నది. శివుని లీల అద్భుతము. ఆ లీల జ్ఞానులనైననూ మోహింపజేయును (30).
నేను నా తండ్రి యగు దక్షుని యజ్ఞమునకు వెళ్లి అచట నా స్వామికి నా తండ్రి చేసిన అనాదరమును చూచి, దక్షుని వలన కలిగిన నా దేహమును త్యజించితిని. ఓ దేవతలారా! ఆనాటి నుండియు (31), కాలాగ్ని యను పేరుగల ఆ రుద్ర స్వామి నా యందలి చింత యందు నిమగ్నుడై దిగంబరుడైనాడు (32).
సతి తండ్రి చేయు యజ్ఞమునకు వెళ్లి, అచట నాకు జరిగిన అవమానమును గాంచి కోపమును పొంది ఆమె నిశ్శంకగా దేహమును త్యజించినది. ఆమె ధర్మజ్ఞురాలు. శివుడిట్లు తలపోసి (33), గృహమును వీడి అలౌకిక మగు వేషమును ధరించి యోగి అయినాడు. మహేశ్వరుడు నా అవతారమైన సతీ దేవి యొక్క విరహమును సహించలేక పోయినాడు (34).
ఆయన ఆనాటి నుండియు నా వియోగముచే మహా దుఃఖమును పొందిన వాడై, మలిన వేషమును ధరించి, సర్వములైన ఉత్తమసుఖములను పరిత్యజింతచెను (35). హే విష్ణో!బ్రహ్మా!మునులారా!దేవతలారా! మరియొక మాటను వినుడు. మహా ప్రభుడగు మహేశ్వరుని లోకరక్షకమగు లీలను చెప్పెదను (36).
విరహవ్యథతో గూడిన ఆ శివుడు జ్ఞానియే అయినా ఏకాకి యగుటచే ఏ స్థానము నందైననూ శాంతిని పొందలేకున్నాడు.ఆయన నా అస్థికలతో మాలను చేసి దానిని మిక్కిలి ప్రీతితో ధరించు చున్నాడు (37). ఆ ప్రభుడు ప్రాకృతజనుని వలె అన్నిచోట్లా అన్నివేళలా ఇటునటు తిరుగుచూ బిగ్గరగా నేడ్చెను. ఆయన దుఃఖవశుడై యోగ్యా యోగ్యములను తెలియకుండెను (38).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
23 Feb 2021
No comments:
Post a Comment