🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
అంతా మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. అందుకే మనం ఆ వైపునుంచే చూస్తాం. తరువాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. దానిని ఊహకు వదిలేశాం. అందుకే స్వర్గం, నరకం లాంటి అనేక రకాల పిచ్చి ఊహలు పుట్టుకొచ్చాయి. అతడు చనిపోతున్నాడని మనం భావిస్తాం. కానీ, అతడు మళ్ళీ జన్మిస్తాడు. అది అతనికి మాత్రమే తెలుసు. కానీ, మరణించిన అతడు మళ్ళీ వెనక్కి వచ్చి ‘‘బాధపడకండి. నేను చనిపోవట్లేదు. మళ్ళీ పుట్టబోతున్నాను. వెళ్ళొస్తా’’ అని మీతో చెప్పలేడు.
అలాగే ఒకసారి తల్లి గర్భంనుంచి బయటపడిన తరువాత చివరి చూపుగా అతడు మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించి అందరికీ వీడ్కోలు చెప్పలేడు.
హిందువుల పునర్జన్మ భావనలో కూడా సాధారణ జన్మ వివరణే ఉంటుంది. ఒకవేళ తల్లి గర్భం ఆలోచించగలిగితే, దాని దృష్టిలో శిశువు మరణించినట్లే. అలాగే శిశువు దృష్టిలో తను మరణిస్తున్నట్లు. కానీ, నిజానికి అది మరణం కాదు, జననం. అలాగే మరణం విషయంలో కూడా హిందువులు అదే విషయాన్ని చెప్పారు.
ఒక వైపు నుంచి చూస్తే అది మరణం, మరొక వైపునుంచి చూస్తే అది మన ఊహకు ప్రతిరూపం కాబట్టి, దానిని మనకు నచ్చినట్లు చెప్పొచ్చు. అందుకే ప్రతి మతం ఆ మరొక వైపును తనకు నచ్చినట్లుగా చేసుకుంది. ఎందుకంటే, సమాజాలు, సంస్కృతులు వివిధ భౌగోళిక, చారిత్రక విషయాలపై ఆధారపడి ఉంటాయి.
ఉదాహరణకు, టిబెట్ వాసులు చలిని ఊహించేందుకే భయపడతారు. అందుకే వారి మరో ప్రపంచం వెచ్చగా ఉంటుంది. మరణించిన మనిషి వారి దృష్టిలో వెచ్చగా ఉంటాడు. అలాగే భారతీయుడు వేడిని ఏమాత్రం ఊహంచుకోలేడు. ఎందుకంటే, నాలుగు నెలల వేసవి కాలం వేడి వాడికి చాలా ఎక్కువ. అదే వేడి సంవత్సరమంతా ఉంటే వాడు వేగి వేపుడైనట్లే.
అందుకే హిందుల స్వర్గం ఎప్పుడూ వికసించిన పూలతో, విరజిమ్మే సువాసనలతో, పక్షుల కిలకిలలతో ఎటుచూసినా జీవం తొణికిసలాడే నిత్యవసంత సోయగాల శోభలతో నిండి సమశీతోష్ణస్థితిలో ఉంటుందే కానీ, వేడిగా ఉండదు. చల్లగా ఉండదు. అందుకే అది మన మనసుకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. లేకపోతే, స్వర్గం అన్ని రకాలుగా ఎందుకుంటుంది? మహమ్మదీయుల స్వర్గం ఎప్పుడూ ఎడారిగా ఉండదు. ఎందుకంటే, వారు అరేబియా ఎడారితో విసిగిపోయారు.
అందుకే వారి స్వర్గమంతా- ఎడారిలో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులతో మాత్రమే కాదు, మొత్తమంతా- ఒయాసిస్సులతో నిండి ఉంటుంది. మన స్వర్గాల సినిమాలు అలా ఉంటే, మరణించే మనిషి సినిమా మరోలా ఉంటుంది. మరణించే మనిషి కోమాలోకి వెళ్ళకుండా సచేతనమైన ఎరుకతో ఉన్నట్లైతే.
అతడు పుట్టినప్పడి నుంచి మరణించే వరకు జరిగిన జీవిత చక్రమంతా ఒక సినిమాలా అతనికి కొన్ని క్షణాలు మెరుపులా కనిపించి, అతడు ఎక్కడ ఎలా మరణించి జన్మించాడో అక్కడే ఆ సినిమా ఆగిపోతుంది. అందుకే పునర్జన్మ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, మీరు పుట్టిన వెంటనే మీలో కలిగిన భయమే మీ దేవుడు. ఆ భయమే మీరు మరణించే వరకు మరింత పెద్దదవుతూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.
యవ్వనంలో ఉన్న వ్యక్తి నాస్తికుడుగా ఉండవచ్చేమో కానీ, వయసు పెరుగుతున్నప్పుడు అతడు అలా ఉండలేడు. మరణించే మనిషిని మీరు నాస్తికులా అని అడిగితే, కేవలం భయంవల్ల అతడు ‘‘కానేమో’’ అంటాడు. ఎందుకంటే, అతని ప్రపంచం అదృశ్యమవుతోంది.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
23 Feb 2021
No comments:
Post a Comment