రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
92. అధ్యాయము - 04
🌻. దేవి దేవతలనోదార్చుట - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
భయంకరమగు విపత్తులను నశింపజేసే జగన్మాతయగు దుర్గాదేవి దేవతలచే ఈ విధముగా స్తుతించబడినదై వారి యెదుట సాక్షాత్కరించెను(1) రత్న నిర్మితము, దివ్యము, పరమాద్భుతము, చిరుగంటల తోరణములతో కూడి యున్నది. మెత్తని పరుపులు అమర్చబడినది అగు శ్రేష్టరథములో ఆమె కూర్చుండి యండెను(2)
ఆమె అవయువములు కోటి సూర్యుల కంటె అధికమగు కాంతితో విలసిల్లెను. ఆమె తన నుండి ఉద్భూతమైన కాంతిపుంజము మధ్యలో కూర్చుండి యుండెను. దివ్యమగు రూపము గల ఆమె సౌందర్యమునకు సాటిలేదు(3) సదాశివుని పత్నియై శివలోకములో నివసించు ఆ మహామాయ త్రిగుణాత్మిక, మరియు నిర్గుణస్వరూపిణి. ఆమె నిత్యురాలు (4)
ఆ చండి ముల్లోలకములకు తల్లి. కష్టముల నన్నిటినీ తొలగించి మంగళముల నిచ్చునది. ఆమె సర్వప్రాణులకు తల్లి. ఆమె మాయా స్వరూపిణియై జీవులను అజ్ఞాన పశులను చేయును. కాని ఆమె తన భక్తుల నందరినీ సంసారము నుండి తరింపజేయును(5) తేజో రాశి రూపములో నున్న ఆ ఉమాదేవిని చూచిన దేవతలు ఆమెను మరల స్పష్టముగా దర్శించుట కొరకై ఆమెను ప్రార్థించిరి (6).
ఆమెను దర్శించు కోరిక గల విష్ణవు మొదలగు దేవతలందరు ఆమె కరుణను పొంది ఆ జగన్మాతను దర్శించిరి(7). ఆమె దర్శనముచే దేవలందరికీ పట్టరాని ఆనందము కలిగెను. వారామెకు అనేక పర్యాయములు నమస్కరించి, విశేషముగా స్తుతించిరి (8).
దేవతలిట్లు పలికిరి-
హే శివే! శర్వుని రాణీ! కల్యాణ స్వరూపురాలా! జగన్మాతా! మహేశ్వరి! సర్వాపదలను గట్టెక్కించే నిన్ను దేవతలమగు మేము సర్వవిధముగా నమస్కరించు చున్నాము(9).
హే దేవేశీ! వేదశాస్త్రములు నీ స్వరూపమును సమగ్రముగా తెలుపజాలవు. నీ మహిమ వాక్కులకు అందదు. హే శివే! నీ మహిమను మనస్సు ధ్యానింపజాలదు(10) శ్రుతి కూడ భయపడుతూ నీ స్వరుపమును సాక్షాత్తుగా గాక 'నేతి నేతి' వాక్యములచే నిషేధముఖముగా మాత్రమే చెప్ప గల్గును. అట్టిచో, ఇతరుల గురించి చెప్పున దేమున్నది?(11).
కాని నీ కృప పొందిని భక్తులు ఎందరో భక్తిప్రభావముచే నిన్ను నెరుంగుదురు. నిన్ను శరణు జొచ్చిన భక్తులకు ఎచ్చటనైననూ భయము మొదలగునవి లేవు(12) ఓ అంబికా! నీవు ప్రీతురాలవై మా విన్నపమును వినుము. ఓ దేవీ! మహాదేవీ! నీకు మేము సదా దాసులము నీ మహిమను మేము కొద్దిగా మాత్రమే వర్ణించగల్గుదుము(13)
పూర్వము నీవు దక్షుని కుమార్తెగా జన్మించి హరునకు ప్రియురాలవైతివి. ఆ సమయములో నీవు బ్రహ్మకు, మరియు ఇతరులకు మహా దుఃఖమును నివారించి యుంటివి (14). నీవు తండ్రి వలన అనాదరమును పొంది ప్రతిజ్ఞ ప్రకారముగా దేహమును త్యజించి నీ లోకమును చేరితివి. శివుడు ఆ విషయములో ఎంతయూ దుఃఖించెను గదా! (15).
ఓ మహేశ్వరీ! ఆదేవ కార్యము పూర్తి కానే లేదు. మహర్షులతో కూడిన దేవతలము మేము దుఃఖితులమై నిన్ను శరణు జొచ్చినాము. (16). ఓ మహాశ్వరీ! దేవతల కోర్కెను పూర్తి చేయుము. హే శివే! సనత్కుమారుని వచనము సఫలమగునట్లు చేయుము (17).
నీవు మరల భూమి యందు అవతరించి రుద్రుని భార్యవు కమ్ము. ఓ దేవీ! నీవు యథోచితముగా లీలలను ప్రదర్శించుటచే దేవతలు సుఖమును పొందెదరు (18). ఓ దేవీ! కైలాస పర్వతమునందున్న రుద్రుడు కూడ నీ అవతారముచే సుఖి కాగలడు. అందురు సుఖమును పొందెదరు. దుఃఖము పూర్ణముగా తొలగి పోవును (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment