రధసప్తమి, నర్మదా జయంతి శుభాకాంక్షలు - Good Wishes on Ratha Saptami, Narmada Jayanti


🌹. రధసప్తమి, నర్మదా జయంతి శుభాకాంక్షలు అందరికి - Ratha Saptami, Narmada Jayanti, Good Wishes to all 🌹

ప్రసాద్ భరద్వాజ


☀️. రథసప్తమి విశిష్టత ☀️

సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా
సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి

ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. అని పిలువబడతారు."

రధసప్తమి ఒక్కటేకాక, కల్యాణ సప్తమి, కమలసప్తమి, శర్కరాసప్తమి, అచలాసప్తమి, రధాంకసప్తమి, మహసప్తమి, జయాసప్తమి, విజయాసప్తమి, నందాసప్తమి, సిద్ధార్ధికాది సప్తమి, సాక్షుభార్యా సప్తమి, సర్షపసప్తమి, మార్తాండసప్తమి, సూర్యవ్రతసప్తమి, సప్తసప్తి సప్తమి, అర్కసంపుటసప్తమి, నింబసప్తమి, మరీచసప్తమి, ఫలసప్తమి - మున్నగు అనేక సప్తమీ వ్రతాలను గురించి గ్రంధాలు పేర్కొన్నాయి. ఇవ్వన్నీ సూర్యుణ్ణి గుర్తించిన వ్రతాలే! ఇందులో కొన్ని రధసప్తమినాడు ఆచరించేవి పంచాంగకర్తలు రధసప్తమిని ' సూర్యజయంతి ' అన్నారు.

జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసస్తికే,
సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే.

"సస్తాశ్వాలుండే ఓ సప్తమీ! నీవు సకల లోకాలకూ తల్లివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం"- అని చెప్తూ, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.


సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.


1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'

2. వైశాఖంలో అర్యముడు,

3. జ్యేష్టం - మిత్రుడు,

4. ఆషాఢం - వరుణుడు,

5. శ్రావణంలో ఇంద్రుడు,

6. భాద్రపదం - వివస్వంతుడు,

7. ఆశ్వయుజం - త్వష్ణ,

8. కార్తీకం - విష్ణువు,

9. మార్గశిరం - అంశుమంతుడు,

10. పుష్యం - భగుడు,

11. మాఘం - పూషుడు,

12. ఫాల్గుణం - పర్జజన్యుడు.


ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.


ఆ ఏడు గుర్రాల పేర్లు

1. గాయత్రి, 2. త్రిష్ణుప్పు, 3. అనుష్టుప్పు, 4. జగతి, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.



🌻. సూర్య స్తోత్రం 🌻

ధ్యాయేత్సూర్య మనంత కోటి కిరణం తేజోమయం భాస్కరం

భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్

ఆదిత్యం జగదీశ మచ్యుతమజం త్రైలోక్య చూడామణిం

భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్




☘️ ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకం ☘️

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః !

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే !!

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు !

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ !!

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్ !

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః !!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే !

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ !!



💧నర్మదా నది జయంతి విశిష్టత 💧

శ్రీ నర్మదే సకల దుఃఖహరే పవిత్రే ఈశాన నందిని కృపాకరి దేవి ధన్యే

రేవే గిరీన్ద్ర తనయాతనయే వదాన్యే ధర్మానురాగ రసికే సతతం నమస్తే

నర్మదా జయంతి ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి నాడు జరుపుకుంటారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న అమర్‌కంటక్, నర్మదా నదికి మూలం. ఇక్కడ నర్మదా జయంతిని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. మాఘ శుక్ల పక్షం సప్తమి తిథి నాడు నర్మదా నది ఉనికిలోకి వచ్చిందని నమ్ముతారు. నర్మదా నదిని పూజించిన భక్తుల జీవితాల్లో శాంతి, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అమృతం కోసం సముద్ర మధనం జరిగినప్పుడు వెలువడిన గరళం స్వీకరించిన మహాశివుని చెమట బిందువు నుండి నర్మదానది ఆవిర్భవించిందని అంటారు. భక్తుడు తన పాపాల నుండి విముక్తి పొందుతాడు అనే నమ్మకం నర్మదా జయంతి యొక్క ప్రాముఖ్యత. నర్మదానది భవ్య ఫలదాయిని- దివ్య శుభకారిణి. గంగానదిని జ్ఞాన తరంగిణిగా వ్యవహరిస్తే నర్మదను తపోవాహినిగా పేర్కొంటారు.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment