గీతోపనిషత్తు - 41 : చేయుట - నేర్చుట - ఆవశ్యకత - జీవితమున ప్రశాంతత, సుఖశాంతులు, తృప్తి, మంచితనము, ఆనందము ముఖ్యము.




🌹.   గీతోపనిషత్తు - 41  🌹

🍀 చేయుట - నేర్చుట - ఆవశ్యకత - జీవితమున ప్రశాంతత, సుఖశాంతులు, తృప్తి, మంచితనము, ఆనందము ముఖ్యము. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - కర్మయోగము - 01 📚

1. ప్రాథమిక కర్మ సూత్రములు (1 నుండి 6శ్లో|| )

“పనులు చేయుచు నేర్చుకొనవలెనా? నేర్చుకొనుచు చేయవలెనా?" రెండునూ ఒకటే. సామాన్య జీవితమున జీవుడు లేచినది మొదలు ఏదియో ఒకటి చేయుట తప్పనిసరి. దంతధావనము, స్నానము, వస్త్రధారణము, భోజనము, సంఘమున ఏదియో ఒక పని, విలాసము, విశ్రాంతి తప్పనిసరి పనులు. చేయుట తప్పనిసరి యైనప్పుడు చేయుచు నేర్చుకొనవచ్చును.

అర్జున ఉవాచ :

1. జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధి ర్జనార్ధన |

తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ||

2. వ్యామిశ్రేణీవ వాక్యేన బుద్దిం మోహయసీవ మే |

తదేకం వద నిశ్చత్య యేన శ్రేయో హ మాప్నుయామ్ ||

3. శ్రీ భగవా నువాచ :

లోకే2 స్మిన్ ద్వివిధా నిష్ణా పురా ప్రోక్తా మయా నఘ |

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ||

4. న కర్మణా మనారంభా నైష్కర్మ్యం పురుషో2 శ్నుతే |

న చ సన్న్యసనా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||

5. న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్ |

కార్య తే హ్యవశః కర్మ సర్వ: ప్రకృతిజైరుణైః ||

6. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |

ఇంద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే |


🌷.చేయుట - నేర్చుట : 🌷

నేర్చుకొనుటకు చేయుటను ఆపనక్కరలేదు. ఇది కృష్ణుని మతము. చేయుచు నేర్చుకొనుట తెలివి. చేయుచు నేర్చుకొనుట అనినను, నేర్చుకొనుచు చేయుట అనినను ఒకటే. నేర్చుకొనని వాని చేతలలో నిపుణత పెరగదు. కౌశలము పెరగదు. కావున పనులు కుశలముగా జరుగవు. అడ్డంకులు వచ్చును. లోపల, బయట ఘర్షణము పెరుగును. పనులు చేయుట యందు నిపుణత పెరగవలెనన్నచో ఎట్లు చేయవలెనో కూడ నేర్చుకొను చుండవలెను. నేర్చుకొనకుండ చేయువాడు దుఃఖపడును. నేర్చుకొనుచు చేయువాడు సుఖపడును.

ఒక పనినిగాని, ఒక వృత్తినిగాని, వ్యాపారమునుగాని, ఉద్యోగముగాని, సంఘ సేవ గాని, స్వాధ్యాయముగాని, తపస్సు గాని చేయువాడు ప్రతిదినము ముందు రోజు కన్న బాగుగ చేయుటకు పూనుకొనవలెను.

ప్రతి పని పెద్దది కాని, చిన్నది కాని నిన్నటి కన్న ఈ రోజు ఇంకొంచెము బాగుగ చేయుటకు నేర్పుకావలెను. చేయుట వలన కూడ నేర్చుకొన వచ్చును. నేర్చుకొనుచు చేయవచ్చును. చేయుచు, ఎట్లు నేర్వవలెనో భగవంతుడు తెలిపిన విషయమును కర్మయోగ మనిరి.

చేయక ఊరక నేర్చుకొనుట, చేయుచు నేర్చుకొనకుండుట నిష్ప్రయోజనము. చాలమంది ఈ ఉపాయము తెలియక నేర్చు కొనుటకు చేయుట నాపుదురు. చేయనివాని జ్ఞానము అనుభవైక జ్ఞానము కాదు కదా!

అట్టివారు మిథ్యాచారులుగ, మూర్ఖులుగ దిగజారుదురు. శరీరమును, యింద్రియములను, మనసును నియోగించుటకే దైవమందించినాడు. వానిని వినియోగింపక పోవుట ఎవని తరము కాదు. వానిని నియమించి సద్వినియోగము చేయుట కర్తవ్యము. అందువలన వాటిని అరికట్టక, దమింపక నియమించి వినియోగించుట నిజమైన యోగము. ఎట్లు నియమించి వినియోగించవలెనో ఈ అధ్యాయమున(కర్మ యోగమున) దైవము తెలుపుచున్నాడు.


🌷.ఆవశ్యకత: 🌷

కర్మల నెట్లు ఆచరించవలెనో, ఎట్లాచరించినచో చేయు కర్మల నుండి బంధము లేర్పడవో భగవానుడు కర్మయోగమున తెలియపరచు చున్నాడు. తాను తెలిపిన విధముగ సృష్టిలో కర్మల నాచరించుచు ముక్తసంగులై జీవించుచున్న వారిని కూడ కర్మయోగమున దైవము పేర్కొనినాడు. కర్మ స్వరూప స్వభావములను ఎరుగక తెలిసినవారు కూడ పొరపాట్లు చేయుట జరుగుచున్నది.

కర్మ నిర్వర్తించు విధానము విద్యాభ్యాస కాలముననే తెలుసుకుని అట్లాచరించుటకు యుద్యుక్తుడైన వాడు జీవితమను రంగస్థలమున ప్రవేశించుటకు, కౌశలముగ వర్తించుటకు, తదనుభూతిని నిత్యమును అనుభవించుటకు అర్హత కల్గి యుండును.

ఈ విద్య మృగ్యమగుటచే ఆధునిక మానవుడు ఎన్ని సౌకర్యములు కలిగి యున్నప్పటికిన్ని దుఃఖము చెందుచునే యున్నాడు. ఘర్షణ పడుచునే యున్నాడు. తీవ్రమైన విరోధములకు, రోగములకు గురియగు చున్నాడు.

జీవితమున ప్రశాంతత, సుఖశాంతులు, తృప్తి, మంచితనము, ఆనందము ముఖ్యము. వీటికి పదవులతోగాని, సంపదతో గాని, గొప్పదనముతో గాని, అధికారముతో గాని సంబంధము లేదు. అవి కలిగినచో కర్మయోగి వైభవము కలిగిన వాడగుచున్నాడు గాని వాని కొఱకై ప్రత్యేక ప్రయత్నముండదు.

కర్మయోగ మనగా కర్మ లెట్లు నిర్వర్తించవలెనో అను విధానముతో అనుసంధానము చెంది జీవించుట. ఆ విధానమును భగవంతుడు చక్కగ విశద పరచినాడు.

ప్రాథమికమగు కర్మయోగ సూత్రములను అనుసరించనివారు జీవితమున నేల విడచి సాము చేసిన వారగుదురు. వారు చతికిల పడక తప్పదు. మిథ్యాచారులై తమను తాము మోసము చేసుకొనుచు, ప్రపంచమును దూషించుచు గమ్యము లేక అందినదల్ల సంగ్రహించుచు జీవింతురు.

కర్మయోగ సూత్రములను పునాదిగా నేర్పరచుకొనని జీవనము పునాదిలేని ఇల్లువలె స్థిరత్వము లేక, ఎపుడు కూలునో యను భయముతో జీవించుట యుండును.

ఆలస్యమైనది అని తలపక దీక్షతో ఈ సూత్రములను పాటించుటకు ప్రయత్నించు వాడు ప్రశాంత జీవనమునకు, భక్తి జ్ఞాన వైరాగ్యములకు అర్హత పొందును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


30 Sep 2020

No comments:

Post a Comment