నారద భక్తి సూత్రాలు - 110




🌹.   నారద భక్తి సూత్రాలు - 110   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 80

🌻 80. స కీర్తనీయః (కీర్త్యమానః) శీఘ్రమేవావిర్భవ

త్యనుభావయతి (చ) భక్తాన్ || 🌻

భగవంతుడిని భజిస్తే, భజన తీవ్రతను బట్టి ఆ భగవంతుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. భక్తుని తనలో మమేకం చేసుకోవడానికి అవసరమైన తత్త్వానుభూతిని అనుగ్రహిస్తాడు. నిశ్చింత భజన వలన భావ సమాధి ప్రాప్తిస్తుంది.

భావ సమాధి ఫలమేమంటే భక్తుడు భగవంతుని ఏ రూపంలో భజిస్తాడో, అదే రూపంలో ఆయన భక్తుల అంతర్దృష్టికి గోచరిస్తాడు. ఇది భావమాత్రం కాదు, ముఖా ముఖిగా ఉంటుంది. దీనిని సాలోక్య ముక్తి అంటారు. సాలోక్య ముక్తిలో భక్తుడు భగవంతునితో నిరంతరం ఉంటూ, ప్రపంచంలో జరిగేవన్నీ భగవంతుని విలాసంగా గ్రహిస్తాడు.

భగవద్విలాసంగా చూస్తూ ఉండడాన్ని సామీప్య ముక్తి అంటారు. భగవంతునితో ఉంటూ, దైవీ విలాసాన్ని చూస్తూ ఉండడంలో భక్తుడు తన్మయమవుతాడు. ఫలితంగా భక్తుడిలో భగవద్వృత్తికి దారి తీస్తుంది. ఇది సారూప్య ముక్తి అనబడుతుంది. భక్తిశాస్త్రం సారూప్య ముక్తిని చరమ ఫలంగా నిర్ణయిస్తుంది. అద్వైతమతం సాయుజ్య ముక్తినే భగవదైక్యంగా చెప్పి దీనిని చరమ ఫలంగా చెప్తుంది.

విశిష్టాద్వైత మతం ప్రకారం, భక్తుడు సాయుజ్యాన్ని కోరడు. భగవంతుని సేవిస్తూ తద్రూపాన్ని అనుభవిస్తూ ఉండిపోవడమే భక్తుడి కోరిక. కాని భక్తుడు కోరకపోయినా, భగవంతుడు సాలోక్యాది పదవులే గాక, సాయుజ్య ముక్తిని కూడా అనుగ్రహిస్తాడు. ముఖ్యభక్తి యొక్క పరమావధినే సాయుజ్య ముక్తి అంటారు.

దీనినే ఏకాంత భక్తి అని కూడా అంటారు. ఏకాంత భక్తిని పరాభక్తి లేక పరమప్రేమ అని కూడా అంటారు. మధ్వ మతంలో అనగా ద్వైతమతంలో

1) హరిసర్వోత్తముడు

2) జీవులు అస్వతంత్రులు, పరమాత్మకు సేవకులు

3) మోక్షమంటే పరమాత్మ పదకమలాల జేరి, స్వస్వరూప ఆనందానుభూతిని పొందటం.

4) పరమాత్మునియందు అచంచల భక్తే మోక్ష సాధనం.

విశిష్టాద్వైత మతం ప్రకారం జీవుని స్వరూపాన్ని అయిదు దశలుగా చెప్తారు. 1) నిత్యులు (2) ముక్తులు (3) కేవలులు (4) బద్దులు (5) ముముక్షువులు.

1 నిత్యులు : జనన మరణాది అవస్థలెరుగనివారు. స్వయం ప్రకాశమానులు. నిరంతర భగవదనుభవపరులు. వీరిని నిత్య సూరులు అంటారు. అనగా గరుడ, అనంత, విష్వక్సేనులు మొదలగువారు. వీరు విష్ణు లోకంలో ఉంటూ, విశ్వ పోషణకు విష్ణు మూర్తికి సహాయపడుతూ ఉంటారు. ముక్తి పొందినవారు ఇక్కడికి చేరుతారు. వీరందరూ శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉంటారు.

2. ముక్తులు : భగవద్భక్తులై, దేహ త్యాగానంతరం పరమపదం జేరి నిత్య సూరులతో కలసి ఆనందిస్తూ ఉంటారు.

3. కేవలులు : జ్ఞాన, యోగ సాధనలచే బంధ విముక్తులై పైన చెప్పిన ముక్త స్థితికి ఆవలివారై కైవల్యం పొంది అనుభవమే తామైన వారుగా ఉంటారు. దీనినే సాయుజ్య ముక్తి అంటారు.

4. బద్ధులు : తమ స్వరూపాన్ని మరచి దేహమే సత్యమని, ఇంద్రియ లోలురై కష్టపడుతూ ఉంటారు. కష్టపడటంలోనే సుఖమున్నదను భ్రాంతి పొందుచు, చివరకు దుఃఖపడుతూ ఉంటారు.

5. ముముక్షువులు : ప్రపంచం విష్ణు మాయ అని, సంసారం బంధమని తెలిసి, భగవద్భాగవతాచార్య కైంకర్యపరులై ఉండువారు. ఈ మతంలో భక్తులు సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులనే కోరు కుంటారు. వీరు ఆనంద పరవశాన్ని. భగవత్సేవను మాత్రమే కోరు కుంటారు. సాయుజ్య ముక్తిలో అవి ఉండవు. లడ్డూగా ఉండడం సాయుజ్య మైతే, తీపిననుభవించడం సాలోక్యాది త్రయముక్తులు. వీరు లడ్డూగా ఉంటే ఏ ఆనందం ఉండదు గనుక, ఆ లడ్డూలోని తీపి దనాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండడం ఉత్తమ మంటారు. పైగా భక్తుడూ, భగవంతుడూ ఒక్కటేననే దాన్ని అపచారంగా భావిస్తారు.

సాయుజ్య ముక్తి పొందిన వారెలా ఉంటారంటే నవ యౌవన సుందర కోమలాంగి సర్వాలంకార భూషితయై భర్తను వీడిన వనిత వంటివారు అని అంటారు. ఇట్టి సాయుజ్యాన్ని వారు కోరరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


30 Sep 2020

No comments:

Post a Comment