శ్రీ శివ మహా పురాణము - 235


🌹 .   శ్రీ శివ మహా పురాణము - 235   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

51. అధ్యాయము - 6

🌻. సంధ్య తపస్సును చేయుట - 5 🌻


తపసా తవ మర్యాదా జగతి స్థాపితా మయి | 
ఉత్పన్నమాత్రా న యథా సకామాస్స్యుశ్శరీరిణః || 43

త్వం చ లోకే సతీభావం తాదృశం సమవాప్నుహి | 
త్రిషు లోకేషు నాన్యస్యా యాదృశం సంభవిష్యతి || 44

యః పశ్యతి సకామస్త్వాం పాణి గ్రాహమృతే తవ | 
స సద్య ః క్లీబతాం ప్రాప్య దుర్బలత్వం గమిష్యతి || 45

పతిస్తవ మహాభాగస్తపోరూపసమన్వితః | 
సప్త కల్పాంత జీవీ చ భవిష్యతి సహ త్వయా || 46


ప్రాణులు పుట్టుక తోడనే కామభావన గలవారు కాకుండుగాక! అను మర్యాదను నేను నీ తపస్సునకు మెచ్చి, లోకములో స్థాపించుచున్నాను (43).

ముల్లోకములలో ఇతర స్త్రీల కెవ్వరికీ లేని పాతివ్రత్య భావమును నీవు పొందుము (44).

నిన్ను చేపట్టిన నీ భర్త తక్క , ఇతరులెవరైననూ నిన్ను కామముతో చూచినచో, అట్టి వ్యక్తి వెంటనే నపుంసకుడై దుర్బలుడగును (45).

నీ భర్త మహాత్ముడు, తపశ్శాలి, రూపము గలవాడు అగును. నీభర్త నీతో గూడి ఏడు కల్పములు పూర్తి యగు వరకు జీవించును (46).


ఇతి తే యే వరా మత్తః ప్రార్థితాస్తే కృతా మయా | 
అన్యచ్చ తే వదిష్యామి పూర్వజన్మని సంస్థితమ్‌ || 47

అగ్నౌ శరీరత్యాగస్తే పూర్వమేవ ప్రతిశ్రుతః | 
తదుపాయం వదామి త్వాం తత్కురుష్వ న సంశయః || 48

స చ మేధాతిథిర్యజ్ఞే మునిః ద్వా దశవార్షికే |
కృత్స్న ప్రజ్వలితే వహ్నా వచిరాత్‌ క్రియతాం త్వయా || 49

ఏత చ్ఛైలోపత్యకాయాం చంద్ర భాగానదీ తటే | 
మేధాతిథిర్మహాయజ్ఞం కురుతే తాపసాశ్రమే || 50


ఈ తీరున నేను నీవు కోరిన వరములనన్నిటినీ ఇచ్చితిని. పూర్వజన్మలో జరిగిన వృత్తాంతము నొకదానిని నీకిప్పుడు చెప్పెదను (47).

నీవు అగ్నిలో శరీరమును విడువవలెననని పూర్వమే ప్రతిజ్ఞను చేసితివి. నేను ఆవిషయములో ఒక ఉపాయమును చెప్పెదను. నీవు దానిని తప్పక అమలు చేయుము (48) .

మేధాతిథియను మహర్షి పన్నెండు సంవత్సరముల యజ్ఞమును చేయుచున్నాడు . నీవు తొందరలో అచట చక్కగా ప్రజ్వరిల్లిన అగ్నియందు దేహమును వీడుము (49).

ఈ పర్వత సమీప భూమియందు చంద్ర భాగానదీ తీరములోని ఒక తాపసాశ్రమములో మేధాతిథి ఆ మహా యజ్ఞమును చేయుచున్నాడు (50).


తత్ర గత్వా స్వయం ఛందం మునిభిర్నో పలక్షితా | 
మత్ర్పసాదాద్వహ్ని జాతా తస్య పుత్రీ భవిష్యసి || 51

యస్తే వరో వాంఛనీయ స్స్వామీ మనసి కశ్చన | 
తం నిధాయ నిజస్వాంతే త్యజ వహ్నౌ వపుస్స్వకమ్‌ || 52

యదా త్వం దారుణం సంధ్యే తపశ్చరసి పర్వతే |
యావచ్చతుర్యుగం తస్య వ్యతీతే తు కృతే యుగే || 53

త్రేతాయాః ప్రథమే భాగే జాతా దక్షస్య కన్యకాః | 
వాక్పాశ్శీల సమాపన్నా యథా యోగ్యం వివాహితాః || 54


నీవు నీ ఇచ్ఛననుసరించి అచటకు వెళ్లుము. నా అనుగ్రహముచే నీవు మునులకు కానరావు. నీవు అగ్ని హోత్రమునుండి జన్మించి, అతని పుత్రివి కాగలవు (51).

నీ మనస్సు లో నీకు నచ్చిన ప్రియుని స్మరించుచూ నీ దేహమును అగ్ని యందు వీడుము (52).

ఓ సంధ్యా! నీవీ పర్వతమునందు ఒక మహా యుగ కాలము ఘోరతపస్సును చేసితివి. ఆ సమయములో కృతయుగము గడచెను (53).

అపుడు త్రేతాయుగములోని మొదటి పాదములో దక్షునకు అనేక కన్యలు జన్మించిరి. వారు మిత భాషిణులు. మరియు శీలము గలవారు. దక్షుడు వారికి యథోచితముగా వివాహములను చేసెను (54).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


30 Sep 2020

No comments:

Post a Comment