కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 65



🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 65   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మ విచారణ పద్ధతి - 29 🌻

ఈ ఓంకారము పరబ్రహ్మ ప్రాప్తికి మిక్కిలి శ్రేష్ఠమైన సాధనము. ఈ సాధనము నెరిగినవారు బ్రహ్మలోకమున పూజింపబడుదురు. బ్రహ్మమున సుఖింతురు. బ్రహ్మను తెలిసికొనుటకు ప్రయత్నించువారికి బ్రహ్మానందమున నుభవింపగోరు వారికి చిత్తైకాగ్రత మిక్కిలి యవసరము.

అట్టి చిత్తైకాగ్రతకు ఓంకారరూపజపమే మిక్కిలి శ్రేష్ఠమైనది. వాచికమైన ఈ ఓంకారము వాచ్యమైన పరబ్రహ్మమునే స్ఫురింపజేయును. మరియు ఓంకారము అకార ఉకార మకార అమాత్రలను నాల్గుమాత్రలు కలది.

స్థూలసూక్ష్మ కారణ మహాకారణములను శరీరములను, జాగ్రత, స్వప్న, సుషుప్తి, తురీయములను నాలుగవస్థలు కలది. ఈ మాత్రలు శరీరములు, అవస్థలు, వాచికములు. వాచ్యమైన పరబ్రహ్మమే లక్షార్ధము. ఈ విధమైన ధ్యానము చేయుట చేత, పరబ్రహ్మమునే పొందింప జేయుట చేత, ఓంకారాలంబనమే అన్నిటికంటే శ్రేష్ఠమైనది.

రెండవ భాగాన్ని ఎత్తుకుంటున్నారు. ఈ ఓంకారానికి ప్రాప్తి - పరబ్రహ్మప్రాప్తి - ఇదిచాలా ముఖ్యమండి ఈ శబ్దం. పరబ్రహ్మను తమ ప్రాప్తిని కనగలదే గానీ సాధన తో కనుగొనడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇది ప్రతిఒక్కరూ గ్రహించాలి.

ఏ సాధనతో కూడా ఎవ్వరూ కూడా పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలిసికొనజాలరు. ఏ కర్మ, భక్తి, యోగ మార్గమందలి, జ్ఞాన మార్గమందలి సాధనలు కూడా ఈ పరబ్రహ్మమును నిర్ణయముగా పొందుటకు తెలిసికొనజాలరు. కారణమేమిటీ అంటే సాధనలకెల్లా అవతలిది. పరమైనటువంటిది.

“ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు” అనేటటువంటి పద్ధతిగా ఎవరైతే అవాఙ్మానస గోచరమైనటువంటి స్థితిని తెలిసికొనగలిగి అనుభూతి చెందగలిగేటటువంటి స్థితికి చేరగలుగుతున్నారో, ఆ నిర్ణయాత్మక స్థితికి చేరగలుగుతున్నారో వారు మాత్రమే పొందగలిగేటటువంటి నిర్ణయ విధానం ఈ పరబ్రహ్మం. కాబట్టి దాని ప్రాప్తిని కనవలయు - అన్నారు పెద్దలు. పెద్దలెప్పుడూ కూడా మాటకు మాట - నూటికి మాట ఒక్కటియే సరి అనేపద్ధతిగా సూచిస్తారనమాట.

కాబట్టి ఆ సూచించే విధానం ఏమిటీ అంటే దాని ప్రాప్తిని కనవలయు అన్నారు. అట్లాగే ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు. ఈ ఓంకారము పరబ్రహ్మ ప్రాప్తికి మిక్కిలి శ్రేష్ఠమైన సాధనము.

అయితే ఏమిటటా? మరి ఆ స్థాయికి మనం చేరాలి అంటే ఏదో ఒక మార్గం వుండాలి కదా, ఏదో ఒక ఉపాసన వుండాలి కదా, ఏదో ఒక ఆధారం వుండాలి కదా, ఏదో ఒక ఆలంబనం వుందాలి కదా, ఏదో ఒక ఆశ్రయం వుండాలి కదా అనేటటువంటి ధ్యానంలో ఈ ఓంకార ఉపాసనని, ఓంకార తత్వము గురించి తెలియజేస్తున్నారు.

ఓంకార సాధన ఎవరైతే తెలుసుకున్నారో వారందరికీ ఒక విశిష్టత కలుగుతుంది. ఏమిటంటే ఎవరైతే ఆజీవనపర్యంతము ఓంకారోపాసన చేస్తారో వారు బ్రహ్మలోకమున పూజించబడతారు. ఎందుకనిటా? ఓంకారము స్వయముగా బ్రహ్మ స్వరూపమే అయివున్నది.

“ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ” అక్షర స్వరూపమైనటువంటిది. నాశము లేనటువంటిది. బ్రహ్మస్వరూపమైనటువంటిది. కాబట్టి బ్రహ్మమునెరిగినవారందరూ బ్రహ్మమే అగుదురు. “బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి” అనేటటువంటి సూత్రముననుసరించి బ్రహ్మమునెరిగినవారందరూ అట్టి బ్రహ్మానంద సుఖమునే అనుభవింతురు.

బ్రహ్మమును తెలుసుకొన ప్రయత్నించేవారందరూ కూడా బ్రహ్మవిదుడు బ్రహ్మవిద్వరీయుడు బ్రహ్మవిద్వరిష్ఠుడు అనే త్రివిధ బేధములతో జీవన్ముక్తులందరూ వుంటారనమాట. జీవన్ముక్తులందు బ్రహ్మవిదుడు బ్రహ్మవిద్వరీయుడు బ్రహ్మవిద్వరిష్ఠుడు అనేటటువంటి మూడు విధములైనటువంటి బ్రహ్మవిదులు వుంటారనమాట. ఆ బ్రహ్మవిదులు బ్రహ్మమునే పొందుతున్నారు. అట్టి స్థితిలో బ్రహ్మానందానుభవమునే పొందుతున్నారు.

అయితే ఈ బ్రహ్మానందానుభవములో ఏం జరుగుతోందీ అంటే మానవ పద్ధతిగా వున్నటువంటి చిత్తము సచ్చిదానందములో వున్నటువంటి చిత్ స్వరూపముగా మారిపోతున్నది. ఇది చాలా ముఖ్యం. దీన్నే చిత్తైకాగ్రత అంటారు. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


30 Sep 2020

No comments:

Post a Comment