మంత్రపుష్పం అంటే ఏమిటి ? దాని విశిష్టత ఏమిటి ? (What is Mantra Pushpam & its significance)


🌹. మంత్రపుష్పం అంటే ఏమిటి ? దాని విశిష్టత ఏమిటి ? 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

సాధారణంగా పుష్పం అనేదానిని పూజలో ఉపయోగించినప్పుడు ఈశ్వరుడు మనకు చెవులు ఇచ్చినందుకు ఆయనకు మనం చెప్పే కృతజ్ఞతకు సాధనంగా వాడతాం. కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుక ఇచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. స్పర్శ ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. పంచేంద్రియములు ఒక్కొక్క డానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. వాసన చూసే అధికారం ఇచ్చాడు ముక్కుతో. ధూపం వేస్తాం. చెవులు ఇచ్చాడు. ఎన్నో ఉపకారాలు పొందుతున్నావు. అందుకని పువ్వులతో పూజ చేస్తున్నావు.

వినడానికి పువ్వుకు సంబంధం ఏమిటి అంటే తుమ్మెదల యొక్క ధ్వనులన్నీ పువ్వుల కోసం. పువ్వు దగ్గరికి వెళ్ళి తేనే తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోయాయి. కాబట్టి ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి డానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత.

అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు. చిట్టచివర చేతిలో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం. అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్రపుష్పం అంటారు.

అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో. లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేటట్లు చేయమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు. అది మంత్రపుష్పం.

మంత్రపుష్పంలో ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం – ‘ నాన్యః పంథాయనాయ విద్యతే’ – ఈశ్వరుడిని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటివరకూ ఎవరిని పూజ చేశావో అసలు వాడు ఎక్కడ ఉంటాడో నువ్వు తెలుసుకుంటే అది ఒక్కటే వాడిని తెలుసుకొనే మార్గం.

ఎక్కడ ఉన్నాడు అంటే ‘హృదయం చాప్యధోముఖం’ – యోగవిద్యను కలిగిన వాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ‘నాభ్యాం ఉపతిష్టతి’ – చిటికెన వ్రేలు బొడ్డులో పెట్టుకుని బొటనవ్రేలు పైకి పెడితే బొటనవ్రేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందువు ఉంటుంది. ‘నీవార పీతాభా స్వస్త్యణూపమా’ ‘తస్య మధ్యే – మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ‘ఊర్ధ్వ మూల మధశ్శాయీ’ – దానికాంతి పైకి కొడుతోంది, క్రిందకి కొడుతోంది, ప్రక్కకు కొడుతోంది. ఆ కాంతి ఏదో అది జీవుడు.

‘స బ్రహ్మః స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్’ – ఏ పేరు పెట్టి పిలు అభ్యంతరం లేదు. కానీ ఆ వెలుగు ఉన్నదే అది పరమాత్మ. అది ఎక్కడ ఉంది? – అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’. కాబట్టి నిజంగా ఈశ్వరుడిని చూడాలంటే కళ్ళు తెరిస్తే కనబడడం కాదు. కళ్ళు మూతలుపడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది. వాడు ఈశ్వరుడు.

వాడు సమస్త ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. కాబట్టే ఆ తొడుగుకు ఆకలి వేస్తోంది, నిద్రవస్తోంది. అది లేనినాడు ఆ తొడుగు శవం. అది ఉన్ననాడు ఆ తొడుగు శివం. ఆకలి దానివల్లనే వస్తోంది, ఆకలి తీరింది అని దానివల్లే తెలుసుకుంటోంది. జ్ఞాని ఎలా చూస్తాడంటే తనలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు తప్ప ఆయనకు నామరూపాలు కాదు. లోపల ఉన్నది అన్నింటిలో నేనే. తెలిసో తెలియకో ఎక్కడ ఉన్నాడు అని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు ‘నేను’ అని.

అంటే ఎవరు ఆ నేను? – భగవంతుడు. ఆ ‘నేను’ అక్కడా ఉంది. ‘నేను’ ‘నువ్వు’ – ఈ ‘నేను’కి, ‘నువ్వు’కి మధ్య స్వార్థం అంతా వస్తుంది. ‘నువ్వు’ పాడైపోయినా పర్లేదు, ‘నేను’బాగుండాలి. కానీ ఇందులో ‘నేను’ అందులో ‘నేను’ ఒక్కటే – జ్ఞానం. ఇక తరతమాలు లేవు, బేధాలు లేవు, అంతటా ఉన్నది పరబ్రహ్మమే.

అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నది ఒక్కటే అది ఎరుకలోకి వచ్చింది. అద్వితీయం – రెండవది లేదు. అద్వైతం – రెండు కానిది. ఒక్కటే. ఒక్కటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని అంటారేమో అని రెండు కానిది అన్నారు. ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇది ఒక్కటే సాధనం. అందుకు అది మంత్రపుష్పం.

అది మననాత్ త్రాయతే’ ఎంత ఆలోచించి సాధనలోకి తెచ్చుకుంటావో అంత గొప్పగా అద్వైతానుభూతిలో నిన్ను పెట్టగలదు. అందుకని పూజయందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పం అయింది. ఇది నా అంత నేను నిలబడితే రాదు, భగవంతుని అనుగ్రహం ఉంటే వస్తుంది.

కాబట్టి ఆ వికసనాన్ని - ఇవ్వు అని విన్నదానిని పట్టుకుని ప్రయత్నం కోసం, అనుగ్రహం కోసం అడగడం ఆ భగవంతునికే సమర్పించి నమస్కరించడం. అందుకే పూజ చివరలో మంత్రపుష్పం. పూజ అంతర్భాగంలో పుష్పార్చన...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మంత్రపుష్పం

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

25 Sep 2020

No comments:

Post a Comment