కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 61




🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 61  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మ విచారణ పద్ధతి - 25 🌻

యముడు అతని ప్రార్ధనను మన్నించి పరమాత్మ తత్వ విశిష్టత్వము నిట్లు చెప్పుచున్నాడు. వేదములన్నియు ఏ వస్తువు పొందదగినదని చెప్పుచున్నవో, ఏ వస్తువును పొందుటకు సర్వ తపస్సులు చేయబడుచున్నవో, ఏ వస్తువును పొందగోరి గురుకుల వాస రూపమగు బ్రహ్మచర్యం నాచరించుచున్నారో నీవు ఏ వస్తువును తెలియగోరుచున్నావో ఆ వస్తువును సంగ్రముగ చెప్పుచున్నాను. ఆ తత్వము 'ఓం' అని చెప్పబడుచున్నది.

చదివేటప్పుడు భావ స్ఫురణతో, వినేవాళ్ళకి ఏ భావం అందుకోవలసి వుందో ఆ భావాన్ని అందించేటటువంటి పద్ధతిలో చదవగలగడం రావాలి. అలాగే గ్రంధము ఏ రీతిగా అయితే బోధిస్తున్నారో ఆ బోధించేటటువంటి విధానాన్ని కూడా అందిపుచ్చుకునేటటువంటి విధానంలో చదువుకోవడం నేర్చుకోవాలి. అర్ధవంతంగా చదవాలి. భావయుక్తంగా చదవాలి. బుద్ధి పరిధిలో వుండి చదవాలి.

సత్వగుణంతో వుండి చదవాలి. అలాగే ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం అందుకోగలుగుతాం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ వారు వారు చదువుకునేటప్పుడు కూడా, వ్యక్తిగతంగా చదువుకునేటప్పుడు కూడా ఈ నియమాన్ని పాటిస్తే సులభంగా అందుకోగలుగుతారు.

ఇప్పుడేమంటున్నారు అంటే ఓంకార తత్వ విచారణ ప్రారంభిస్తున్నారు. ఈ ఓంకార తత్వ విచారణని ప్రారంభించే ముందు దాని యొక్క విశిష్టతని చెప్తున్నారు.

ఋషులు దేనికొరకైతే తపస్సు చెస్తున్నారో, దేనిని పొందటం కోసమైతే అన్ని తపస్సులు నిర్దేశించబడినాయో, దేనిని తెలుసుకోవడం కోసమైతే అన్ని సాధనలు ఏర్పాటు చేయబడ్డాయో, దేనిని తెలుసుకోవడం కోసమైతే గురుకులవాసం, బ్రహ్మచర్యం వంటి నియమాలు ఏర్పరచబడ్డాయో,

దేనిని తెలుసుకోవడం కోసం వేదములన్నియు కూడా దేనిని గురించి స్తుతిస్తున్నాయో, దేనిని ఆశ్రయించి సర్వసృష్టి ఏర్పరచబడిందో, దేనిని తెలుసుకున్నట్లయితే పరమాత్మ తత్వము యొక్క విశిష్టతని తెలుసుకోగలుగుతామో దాని యొక్క తత్వమే ఓంకార తత్వమనేటటువంటి పద్ధతిలో నచికేతునియొక్క ప్రార్ధనను మన్నించి యమధర్మరాజు బోధించడానికి ప్రారంభిస్తున్నాడు.

ఇన్ని విశేషణాలతో కూడుకున్నటువంటి ఓంకార తత్వమును మనందరం తెలుసుకోవలసినటువంటి అవసరం వుంది. ఈ ఓంకారోపాసన చాలా ముఖ్యమైనటువంటిది.

ఎందుకనంటే ఈ ఓంకారోపసనను మించిన ఉపాసన మరియొకటి లేదు. మించిన సాధన కూడా లేదు. మించిన తపస్సు కూడా లేదు. మించిన నియమం లేదు. మించిన ధర్మం లేదు. మించినటువంటి తత్వం లేదు. ఈ రకంగా అన్నీ ఈ ఓంకారం తోనే ముడిపడి వున్నాయి. అన్ని మంత్రములు ఓంకారంతోనే ముడిపడి వున్నాయి. అన్ని బీజాక్షరముల యొక్క సంపుటీకరణము కూడా ఈ ఓంకారముతోనే చేయబడుతున్నది. కారణం ఏమిటంటే ‘ఆది ప్రణవ నాదం’.

ఆదియందు ఏర్పడినటువంటి నాదం ఉద్భవించినటువంటి స్థానంలో ఈ ఓంకారం అనేటటువంటి నాదం ఉద్భవించింది. ఈ మధ్యకాలంలో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు సోలార్ ఎనర్జీ [Solar Energy] ని అంటే సూర్యుడు నుండి వచ్చేటటువంటి శక్తిని పరిణామం చెందించి సోనోగ్రాఫ్ [Sonograph] అనేదాని మీద గనక మనం చూసినట్లయితే, అది ఓంకార శబ్దాన్ని విడుదల చేస్తున్నట్లుగా గుర్తించారు. కాబట్టి ఇలాంటి పరిశోధనలు ఈ మధ్య కాలంలో చాలా వైజ్ఞానిక పరమైన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

25 Sep 2020

No comments:

Post a Comment