🌹. గీతోపనిషత్తు - 62 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 23. స్వధర్మము - - భగవంతుడు స్వధర్మమే శ్రేయస్సు, అందు మరణించినను శుభమే. అధర్మము నిన్ను నశింపజేయును అని తెలిపినాడు. భగవద్గీత యందు తెలుపబడిన అత్యంత ప్రధానమైన సూత్రములలో స్వధర్మము ఒకటి. యుక్త వయస్సు నందు స్వధర్మము తెలిసి, వృత్తి నెంచుకున్నవాడు ధన్యుడు. 🍀
📚. కర్మయోగము - 35 📚
35. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా త్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || 35
ప్రతి మానవునకు తనదైన స్వభావము ఒకటి యుండును. తదనుగుణమైన కార్యమునందు నిమగ్నమైనచో శ్రేయస్సు కలుగును. లేనిచో భయము కలుగును. కొందరికి ఉపాధ్యాయ వృత్తి నచ్చును. కొందరికి పదిమందిని రక్షించుట నచ్చును. కొందరికి వ్యాపారము నచ్చును. మరికొందరికి శరీర శ్రమ నచ్చును.
తనకు తానుగ పరిశీలించుకొని చూచినచో తన ప్రవృత్తి కేమి నచ్చునో తనకు తెలియగలదు. దానినే శ్రద్ధతో నిర్వర్తించినచో శ్రేయస్సు కలుగును. ఆనందము కలుగును. తృప్తి కలుగును. అట్లు కానిచో ఘర్షణలు, భయము కలుగును.
ఆధునిక యుగమున మానవుడు స్వభావమును బట్టి కార్యక్రమము నేర్పరచు కొనుట మరచినాడు. డబ్బును బట్టి పని యెన్నుకొను చున్నాడు. ఏది యెక్కువ డబ్బునిచ్చునో అది చేయవలెనని తల్లిదండ్రులు కూడ ప్రోత్సహింతురు. ప్రవృత్తిని బట్టి వృత్తి నిర్ణయము జరుగుటలేదు. ధనార్జనము, సంఘము నందు కీర్తి, గొప్పదనము కలిగించునవి చేయుటకే ప్రవర్తించు చున్నాడు. ఘర్షణమున కిదియే మూలము.
ఇష్టములేక డబ్బు కొరకు ఉద్యోగము చేయువారు, యిష్టము లేకపోయినను ఉపాధ్యాయ వృత్తియందున్న వారు, అట్లే వ్యాపారులు, రక్షణాధికారు లున్నారు. ఎవరిని ప్రశ్నించినను వారు చేయు పనులయందు వారికి తృప్తి లేదు. ఆనందము లేదు. మీదు మిక్కిలి భయముండును. కుశలమా అని ప్రశ్నించినచో త్రికరణశుద్ధిగ ఎవ్వరును కుశలమని చెప్పలేరు.
తన శ్రేయస్సు తనకు గల ధనముపై యాధారపడి యున్నదని భ్రమపడి అట్టి ధనార్జనకు వీలుగనుండు వృత్తితో ముడిపడి అది తన ప్రవృత్తికి విరుద్ధమగుట వలన ఘర్షణము చెందుచు, భయపడుచు, రోగములు తెచ్చుకొనుచు నశించుచున్నారు.
ధనార్జన ప్రధానమగుట ఒక కారణము కాగ, తన పనికన్న పొరుగువాని పని బాగున్నదని మరియొక భ్రమ యగుచున్నది. కోతి పని కోతి చేయవలెను, వడ్రంగిపని వడ్రంగి చేయవలెను అను సూత్రము ప్రధానము. కుక్క పని కుక్క చేయవలెను, గాడిద పని గాడిద చేయవలెను. తన పనికన్న కుక్కపని బాగున్నదని గాడిద కుక్కపని చేసి భంగపడినది. గొప్పకు ఒక కోతి వడ్రంగి పనిచేసి, ప్రాణసంకటము తెచ్చుకున్నది. ప్రస్తుతము మానవుల ప్రవర్తనము యింతకన్న ఉత్తమముగ నున్నదని చెప్పలేము కదా!
ప్రవృత్తిచే అర్జునుడు యోధుడు. ధర్మరక్షకుడు. వీరుడు. ధర్మరక్షణము చేయక మరియేమి చేసినను అతడపహాస్యము పాలగును. అపహాస్యమగుట మహావీరునకు మరణము కన్న దుర్భరము.
యుద్ధభూమి నుండి పారిపోయినాడని నలుగురూ నవ్వినచో అర్జునుడు బ్రతుకలేడు. పిరికివాడని హేళన చేసినచో భరించలేడు.
ధర్మరక్షణ చేయని పాపి అనిపించు కొనినచో బ్రతుకడు. అతనికి స్వాభిమానము మెండు. అట్టివాడు నేను యుద్ధము చేయను, తపస్సునకు పోయెదను అని పలుకుట మోహము వలన కలిగినది. భగవంతుడు స్వధర్మమే శ్రేయస్సు, అందు మరణించినను శుభమే. అధర్మము నిన్ను నశింపజేయును అని తెలిపినాడు.
భగవద్గీత యందు తెలుపబడిన అత్యంత ప్రధానమైన సూత్రములలో స్వధర్మము ఒకటి. యుక్త వయస్సు నందు స్వధర్మము తెలిసి, వృత్తి నెంచుకున్నవాడు ధన్యుడు. (3-35)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
28 Oct 2020
No comments:
Post a Comment