కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 87



🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 87 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -17
🌻

మానవుడు తన బుద్ధి యందు ఎక్కడైతే శరీర, ప్రాణ, మనోబుద్ధుల వ్యవహారము లుప్తమైపోతున్నాయో, తాను మేల్కొని ఉంటున్నాడో, అట్టి స్థితిని అనుభూతమొనర్చుకుంటే దానికి నిర్వాణమని పేరు. ఈ నిర్వాణ స్థితిని పొందినటువంటి వారికి మాత్రమే, ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం సాధ్యమౌతుంది.

ఏ అగ్ని యజ్ఞము చేయగోరు వారికి (స్వర్గలోక ప్రాప్తికి) సేతువుగా (వంతెన) నున్నదో అట్టి నాచికేతాగ్నిని తెలుసుకొనుటకు, చయనమొనర్చుటకు సమర్థులమైతిమి. భయరహితమైన సంసార సముద్రము యొక్క అవతలి ఒడ్డున చేరగోరు బ్రహ్మవేత్తలకు ఆశ్రయభూతమైన అక్షరమైన సూక్ష్మమైన ఏ పరబ్రహ్మకలదో, ఆ పరబ్రహ్మను కూడా తెలిసికొన గలిగితిమి.

ఇప్పటి వరకూ చెప్పినటువంటి వాటిని ఈ నాలుగు వాక్యాలలో సమీక్షిస్తున్నారన్నమాట. నచికేతాగ్ని చయనం ఎలా చేయాలి అనేటటువంటి, నచికేతాగ్ని సంచయన విద్యను ప్రసాదించారు. ఆ సంచయన విద్య ద్వారా అది తెలుసుకొనుటకు, ఆ సంచయనం చేయుటకు, ఆ చయన మొనర్చుటకు, సమర్థునిగా ఈ నచికేతుని తయారు చేశారు. ఇంకేమి చేశారు? భయరహితమైనటువంటి సంసార సముద్రము యొక్క అవతలి ఒడ్డు చేరగోరు బ్రహ్మవేత్తలకు, ఆశ్రయభూతమైన ఇది చాలా ముఖ్యం. మనం ఇవతలి ఒడ్డు మీద ఉన్నపుడు జీవాత్మలు. అవతలి ఒడ్డుమీదకు వెళ్తే బ్రహ్మవేత్త. ఈ సత్యాన్ని గ్రహించాలి కాబట్టి, అందుకే దీనికి తరణము అని పేరు. తరించుట అని పేరు.

కాబట్టి, సాంఖ్య తారక అమనస్క పద్ధతిగా ఈ తరణాన్ని ఎవరైతే పూర్తి చేసి, “బ్రహ్మైవాహ మిదం జగఛ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైవ దవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం” - అనేటటువంటి బ్రహ్మవేత్త యొక్క వాక్యాన్ని ఆశ్రయంగా స్వీకరించి, అక్షరమైన అంటే నశించనటువంటి, సూక్ష్మమైన అసలు సూక్ష్మం అంటే బ్రహ్మమే సూక్ష్మం, మిగిలినవేవీ సూక్ష్మం అని చెప్పడానికి వీలుకానటువంటివి.

అట్టి బ్రహ్మీభూత స్థితిని, బ్రహ్మానుభవమును, బ్రహ్మానందానుభూతిని ఎవరైతే పొందగలుగుతున్నారో, వారు మాత్రమే పరబ్రహ్మనిర్ణయాన్ని పొందగలుగుతున్నారు. అక్షర స్వరూపాన్ని ఎరగకుండా పురుషోత్తమ స్థితిని తెలుసుకోవడం సాధ్యం అయ్యేది కాదు. అట్టి పురుషోత్తమ ప్రాప్తి, పరబ్రహ్మ ప్రాప్తి నిర్ణయం చాలా ముఖ్యమైనటువంటివి. అట్లా తెలుసుకోగలిగినవారు మాత్రమే యథార్థతగా మానవ జన్మను ధన్యత చెందించుకొన్న వారు అవుతున్నారు.

(ఎవరైనా తన గమస్థానము చేరుటకు రధము మొదలగు వాహనముల నుపయోగించుచున్నారో అటులనే పరమాత్మను పొందగోరు వారు శరీర రూప రధమునెట్లు నుపయోగించు కొనవలయునో యమధర్మరాజు నచికేతునకు చెప్పుచున్నాడు. మరియు జీవాత్మ శరీర రూప రధమును మోక్షమున వైపుకు, సంసారము వైపునకు కూడా నడుప గలడు. మోక్ష మార్గము వైపు ఎట్లు నడుపవలెనో చెప్పబడుచున్నది.)

ఇది భగవద్గీతలో కూడా చెప్పబడినది. “ఆత్మానం రధమేవచ” ఈ శరీరం రధము. ఆత్మయే రధికుడు. అంటే అర్థం ఏమిటంటే, ఒక కారు మీరు నడుపుతున్నారు అనుకోండి, కారు మీరు అయ్యే అవకాశం లేదు కదా! కాబట్టి, ఎవరైతే తన గమ్యస్థానం చేరడానికి రధాన్ని ఉపయోగించుకున్నాడు, కారుని ఉపయోగించుకున్నాడు, వాహనాన్ని ఉపయోగించుకున్నాడు.

అంతేకానీ వాహనం తాను అవ్వడం లేదు కదా! అట్లే, నీవు కూడా ఈ శరీరం అనేటటువంటి రధమును, ఆత్మానుభూతికోరకై వినియోగించుకొనుచున్నావు. అంతేకానీ, శరీర ఇంద్రియ సుఖ దుఃఖ సంఘాతము కొరకు, భోక్తృత్వ భావము కొరకు, కేవల సుఖ పిపాస కొరకే ఈ జీవతం అనేటటువంటి జీవాత్మ పద్ధతిగా నడుపరాదు. కాబట్టి జీవుడికి రెండు ముఖాలు ఉన్నాయి. ఒక ముఖమేమో జగత్తు వైపు, ఇంద్రియ సుఖముల వైపు నడిచేటటువంటి పద్ధతి. మరొక ముఖమేమో మోక్షము వైపు నడిచేటటువంటి అవకాశం ఉంది.

కాబట్టి, సంసార భ్రాంతితో సుఖపిపాసతో, జగత్తు వైపు నడిచేటటువంటి జీవుడు, తనను తాను ఉద్ధరించుకొని, తనును తాను మోక్ష పథములో, తనను తాను మోక్ష మార్గములో నడుపుకోవడం ఎట్లాగో, ఈ శరీరమనే రధాన్ని ఈ పరబ్రహ్మనిర్ణయాన్ని పొందడానికి, బ్రహ్మనిష్ఠను పొందడానికి, ఆత్మానుభూతి పొందడానికి, ఇదే రధాన్ని ఎట్లా వినియోగించుకోవాలో అనేది ఇప్పుడు బోధించబడుతుంది.- విద్యా సాగర్ స్వామి

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




28 Oct 2020




No comments:

Post a Comment