శ్రీ శివ మహా పురాణము - 258



🌹 . శ్రీ శివ మహా పురాణము - 258 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

60. అధ్యాయము - 15

🌻. నందావ్రతము - శివస్తుతి - 3 🌻


రూపము లేనివాడు, పెద్ద రూపము గలవాడు, అనంతశక్తి గలవాడు, ముల్లోకములకు ప్రభువు. సర్వసాక్షి, సర్వమును పొందియున్నవాడు (45), ఆత్మరూపుడుగా నుండి సర్వమును ప్రకాశింప జేయువాడు, మోక్షస్వరూపుడు, ఆనందఘనుడు, జ్ఞానఘనుడు, సర్వవ్యాపకుడు, సర్వమునకు ప్రభువు (46), సర్వకర్మ సన్న్యాస యోగముచే తేలికగా లభించువాడు, మోక్షమునిచ్చు ప్రభువు, పురుష స్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వమునిచ్చువాడు (47), దేహమునందుండే సాక్షి, ఆత్మ రూపుడు, మనోవృత్తులన్నింటికీ కారణమైనవాడు, సర్వమునకు అధ్యక్షుడు, సమష్టి బుధ్ధి స్వరూపుడు, మూల ప్రకృతి స్వరూపుడు అగు పరమాత్మకు నమస్కారము (48).

మూడు నేత్రములు గలవాడు, శిరస్సు వెనుక బాణములను ధరించినవాడు, సద్ఘనుడు, చిద్ఘనుడు, ఇంద్రియ గుణములన్నింటికి సాక్షి, కారణము లేనివాడు (49), ముల్లోకములకు కారణమైనవాడు, మోక్షస్వరూపుడు, శీఘ్రముగ మోక్షము నిచ్చువాడు, శరణు పొందిన వారిని రక్షించువాడు (50), సర్వవేద శాస్త్రములకు పెన్నిధి, పరమేష్ఠి స్వరూపుడు, భక్తులకు పొందదగిన సర్వశ్రేష్ఠమగు స్థానము అయినవాడు, సర్వసద్గుణ నిధి (51), సత్త్వరజస్తమోగుణములు అనే అరణిచే దాచియుంచబడిన చిద్ఘనుడు, మహేశ్వరుడు, మూఢులచే పొంద శక్యము కాని రూపము గలవాడు, జ్ఞానుల హృదయములో నిత్య నివాసి అగు శివునకు నమస్కారము.(52).

జీవుల బంధమును పోగొట్టువాడు, భక్తులకు సద్రూపమగు ముక్తిని ఇచ్చువాడు, స్వప్రకాశస్వరూపుడు, నిత్యుడు, నాశములేనివాడు, జ్ఞానఘనుడ (53), ప్రత్యగాత్మ రూపుడుగా నుండి సర్వమును చూచువాడు, కాని వికారములు లేనివాడు, పరమేశ్వర్యమును ధరించియున్నవాడు అగు పరమాత్మకు నమస్కారము. నిన్ను సేవించువారికి ధర్మార్ధకామమోక్షములు మరియు అభిలషితమగు సద్గతి లభించును (54).

అట్టి నీవు మా యందు దయను వీడితివి. మాపై ప్రసన్నుడవు కమ్ము. నీకు మనస్కారము. నీ ఏకాంత భక్తులు ఏ వస్తువునైననూ కోరరు (55). వారు పరమ మంగళకరమగు నీ చరిత్రను మాత్రమే గానము చేసెదరు. అక్షర పరబ్రహ్మ, అవ్యక్త స్వరూపుడు, సర్వవ్యాపి (56), అధ్యాత్మయోగముచే పొందబడువాడు, పరిపూర్ణుడు, ఇంద్రియములకు గోచరము కానివాడు, ఆధారములేనివాడు, సర్వమునకు ఆధారమైన వాడు, కారణము లేని వాడు అగు నిన్ను మేము స్తుతించుచున్నాము (57). అనంతుడు, ఆద్యుడు, ఇంద్రియాగోచరుడు, సర్వేశ్వరుడు అగు నీకు ప్రణమల్లు చున్నాము.

విష్ణువు మొదలగు సమస్త దేవతలను, లోకములను, చరాచర జగత్తును నీవు నామరూపభేదము కలుగునట్లుగా అల్పప్రయత్నముచే నిర్మించితివి (58). అగ్ని నుండి విస్ఫు లింగములు వలె, సూర్యుని నుండి కిరణములు వలె ఈ త్రిగుణ ప్రవాహ రూపమైన జగత్తు నీ నుండి ఉద్భవించి మరల నీలో లీనమగుచున్నది (59).

హే ప్రభో! నీ వు దేవతవు కాదు, రాక్షసుడవు కాదు, మానవుడు కాదు, పశువు కాదు , పక్షివి కాదు (60). నీవు స్త్రీ కాదు, నపుంసకుడవు కాదు, పురుషుడవు కాదు, సత్‌ కాదు, అసత్‌ కాదు, ద్రవ్యము కాదు సర్వమును నిషేధించగా మిగిలే అద్వయతత్త్వమే నీవు. విశ్వమును నిర్మించి, పాలించి (61), లయమును చేయు విశ్వ స్వరూపుడవు నీవే. సర్వేశ్వరుడవగు నీకు ప్రణమిల్లుచున్నాము.

యోగులు, యోగముచే శుద్ధమైన కర్మలు గలవారై, యోగముచే నిర్మిలమైన చిత్తము నందు యోగేశ్వరుడవగు నిన్ను దర్శించెదరు. అట్టి నిన్ను మేము నమస్కరించుచున్నాము (62). నీ వేగము సహింపరానిది. ఇచ్ఛా శక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తులు, ఋగ్యజుస్సామ వేదములు నీ స్వరూపమే (63).

శరణు జొచ్చిన వారిని రక్షించువాడు, అనంత శక్తి మంతుడు అగు నీకు నమస్కారము. ఉమాపతీ!ఇంద్రియ నిగ్రహములేని వారికి పొంద శక్యము కాని జ్ఞానమార్గము నీది (64). భక్తులనుద్ధరించుట యందు ప్రీతి గల నీకు నమస్కారము. నీ ప్రకాశము నిగూఢముగ నుండును. నీ మాయా శక్తిచే నేను మోహమును పొంది, మూర్ఖుడనై నీ మహిమను, నా అసమర్థతను తెలుసుకొన లేకపోతిని (65). నీ మహిమ అపారము. మహాప్రభువగు నిన్ను మేము నమస్కరించుచున్నాము.

విష్ణ్వాది దేవతలందరు మహా దేవుని ఈ విధముగా స్తుంతిచి (66), ఆ ప్రభువు యెదుట మంచి భక్తితో సాష్ణాంగ ప్రణామమును చేసి, మిన్నకుండిరి (67).

శ్రీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో నందా వ్రత విధానము, శివస్తుతి అనే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


28 Oct 2020

No comments:

Post a Comment