🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 146 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 20 🌻
143. “ఈ వ్యవహారానికంతటికీకూడా హేతువు, కారణభూతుడైన విష్ణువు సాక్షిమాత్రుడిగా ఉండి, బ్రహ్మకిమాత్రం సృష్టిభావాన్ని ప్రసాదించాడు. ఆయన సృష్టిస్తూఉంటే, అతడు సృష్టించే జీవకోటి, భూతములన్నిటికీ సృష్టి స్థితి లయములనే మూడు అవస్థలు సంప్రాప్తిస్తూంటే, అదంతా చూస్తూ తానుగా మాత్రమే ఉంటాడు విష్ణువు. కారణకారణమాతడు.
144. రాత్రి సమయం కాగానే ఈ బ్రహ్మచేసిన సృష్టిలో ఆధిభౌతిక, ఆధిదైవికములైన సమస్త విషయములు, బుద్ధీంద్రియములు, ప్రపంచము అంతాకూడా విష్ణువునందు లయమౌతుంది. కాబట్టి ఆ మనసు, బుద్ధి, ఇంద్రియములు అనబడే వాటిని విష్ణువు ముందు తీసేసుకుంటాడు ఆ బ్రహ్మలోంచి అహం పోగానే ఈ జగత్తుకు హేతువుండదు.
145. అందువలన మనోబుద్ధులను ఎప్పుదయితే ఆయన సమాకర్షించి తనలో లయంచేసుకున్నాడో, సృష్టిదానంతట అదే అంతర్థానమై నశించిపోతుంది. మనోబుద్ధులు ఉన్నంతసేపూ జగత్తుంటుంది. ఎందుకంటే అనుభవించేది మనసు. భోక్త లేకపోతే భోజనం ఉండదుకదా! తినేవారికోసమే అది ఉంటుంది. అట్లాగే, ఎవరో మనోబుద్ధులు కలిగినవారియొక్క అనుభవం కొరకు జగత్తు సృష్తించబడింది.
146. ఆ భోక్తను ఎప్పుడయితే తాను సమాకర్షణశక్తితో లయంచేసుకుంటాడో, ఈ జగత్తంతా విలయమైపోతుంది.
అలా తాను సృష్టించిన సృష్టికోసమని తనను తానే విభాగం చేసుకుంటాడు. తనను తానే బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడిగా విభజించుకుంటాడు. తన సంకల్పంలో ఈ సృష్టిలోఉండే అహంకారాన్ని తనలో లయంచేసుకోవటానికి రుద్రుడిగా తనను తాను నియోగించుకుంటాడు.
147. ఆ రుద్రుడు లోకంలో మనోబుద్ధి చిత్త అహంకారములను నాలుగింటినీ ఉప సంహరించుకున్న తరువాత, ఈ జగత్తంతా విలయం పొందుతుంది. అంటే రుద్రుడు దానిని నాశనం చెయ్యడు, జగత్తును విలయం-లయం-చేస్తాడు. నాశనంచేసేవి భూతములు. ఏ సృష్టయినా నాశనము అంటే, రూపాంతరం పొందటమే! దానికే నాశనము అనిపేరు.
148. సాధారణంగా, ‘నీకేదికావాలి?’ అని అడిగితే, ఎవరూకూడా వెంటనే సమాధానం చెప్పరు! ‘ఏది వద్దు?’ అని అడిగితే చాలా చెప్తారు. ఈశ్వరుడు కనబడి, వెంటనే నీకేంకావాలో ఒక్కకోరిక ఒక్క క్షణంలో కోరుకో అంటే, వెంటనే చెప్పగలిగ్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వ్యవధి అడుగుతారు.
149. ఏది కావాలో తెలియకపోవటమే ఈ ప్రపంచంలో అందరికీ ఉండేటటువంటి ‘జీవలక్షణం!’ జీవుడుకి తాత్కాలికంగా అనుక్షణమూ ఏదో ఒకటి కావాలి. ఇప్పుడేది కావాలి అంటే ఏదో ఒకటి చెబుతాడు కాని, శాశ్వతంగా నీకేది కావాలి అంటే ఏ ఒక్కటీ ఖఛ్ఛితంగా చెప్పలేడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
28 Oct 2020
No comments:
Post a Comment