రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 09
🌻. పార్వతి స్వప్నము - 2 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆ మాటను విన్న వెంటనే మేనక భర్తను అచటకు పిలచి కుమర్తె చూచిన స్వప్నమును సమగ్రముగా తెలుపుడు జేసెను (19). అపుడా హిమవంతుడు కుమారై యొక్క స్వప్నమును మేనక చెప్పగా విని మిక్కిలి సంతసించి, ప్రియురాలగు మేనకను సంబోధించి ఇట్లు పలికెను(20).
హిమవంతుడిట్లు పలికెను-
హే ప్రియే ! నేను కూడా తెల్లవారు జామున ఒక స్వప్నమును చూచితిని. నేను దానిని గురించి శ్రద్ధగా చెప్పెదను. నీవు గొప్ప ప్రీతితో దానిని వినుమ (21). నారదుడు వర్ణించిన తీరున శ్రేష్ఠమగు అవయవములు గల ఒక గొప్ప తపశ్శాలి తపస్సును చేయుటకొరకై ఆనందముతో మన నగర సమీపమునకు విచ్చేసినాడు (22). నేను కూడ మిక్కిలి సంతసించి మన అమ్మయిని వెంటనిడుకొని అచటకు వెళ్లితిని. నారదుడు చెప్పిన వరుడగు శంభుప్రభుడు ఆతడేనని నాకు తెలిసినది (23).
నేను అమ్యాయికి ఆ తపశ్శాలిని సేవించుమని ఉపదేశించి అమె సేవను స్వీకరించుమని ఆయనును వేడుకొనగా, ఆయన అప్పుడు అంగీకరించలేదు (24). అపుడు సాంఖ్యులు, వేదాంతులు మెచ్చు కొనదగిన గొప్ప వివాదము చెలరేగెను. తరువాత అయన అనుమతిని పొంది మన అమ్మాయి అచటనే ఉండెను (25). అమె శివుని భర్తగా పొందవలెననే కోరికను మనసులో నిడుకొని భక్తితో ఆయనను సేవించెను. ఓ సుందరీ! నేను చూసిన స్వప్నము ఇది. నీకు వివరించి చెప్పితిని (26). ఓ ప్రియురాలా! మేనా! కావున ఆ స్వప్నము యొక్క ఫలమును మనము కొంతకాలము వరకు వేచి యుండి పరీక్షించవలెను. ఈ విషయములో ఇదియే యోగ్యమైన కర్తవ్యమని నా అభిప్రాయము. నివీ విషయమును నిశ్చయముగా తెలియము(27).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓమహర్షీ! ఇట్లు పలికి ఆ పర్వతరాజు, మరియు మేనా దేవి శుద్ధమగు మనస్సు గలవారై ఆ స్వప్న ఫలమును పరీక్షించుచూ నుండిరి(28). ఇట్లు కొద్ది రోజులు గడిచెను. ఇంతలో సత్పురుషులకు శరణ్యుడు, సర్వసృష్టికి కారణుడు అగు పరమేశ్వరుడు సతీ వియోగముచే మిక్కిలి దుఃఖితుడై అంతటా తిరుగాడు చుండెను(29). సతి యందలి ప్రేమతో, విరహ దుఃఖముతో కల్లోలితమగు మనస్సు గల ఆ ప్రభువు కొద్ది గణములతో గూడి ప్రీతితో తపస్సును చేయుట కొరకై అచటకు విచ్చేసెను (30). అయన అచట తన దారిన తాను తపస్సు చేసుకొను చుండెను. అపుడు ఆయన అనుగ్రహమును కోరు పార్వతి ఇద్దరు సఖురాండ్రతో గూడి నిత్యము ఆయనను సేవించుట యందు నిమగ్నురాలయ్యెను. (31).
దేవతలచే ఆయనను మోహింపజేయుట కొరకై పంపబడిన మన్మథునిచే బాణములతో కొట్టబడిననూ ఆ శంభుప్రభుడు వికారమును పొందలేదు (32). అయన అచటనే తన కంటినుండి బయల్వెడలిన మంటలతొ ఆ మన్మథుని దగ్ధము చేసెను. ఆయన నా మాటలను స్మరించి కోపించినవాడై అచట నుండి అంతర్హితుడాయెను(33). తరువాత చాల కాలము పిదప, పార్వతీ దేవి యొక్క గర్వము నడంచిన ఆ మహేశ్వరుడు ఆమె యొక్క ఘోర తపస్సునకు ప్రసన్నుడాయెను (34).
తరువాత విష్ణువుచే ప్రార్థింపబడిన రుద్రుడు లోకాచారము ననుసరించి కాలికా దేవిని వివాహమాడెను. అపుడు అనేక మంగళములు సంపన్నమాయెను (35). వత్సా! నీకుఆ శంకరవిభుని గొప్ప దివ్య చరితమును సంగ్రహముగా చెప్పి యుంటిని. మరల ఏమి వినగోరుచున్నావు?
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో స్వప్న వర్ణన మను తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
14 Mar 2021
No comments:
Post a Comment