గీతోపనిషత్తు -170


🌹. గీతోపనిషత్తు -170 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 13


🍀 13. ధారణ - స్థిరము, సుఖము అగు ఆసనము కుదిరిన పిదప నాసికాగ్రమున దృష్టి నుంచవలెను. నాసికాగ్రమనగ భ్రూమధ్యము. భ్రూమధ్యమున దృష్టి సారించుట మానసికమే గాని భౌతికము కాదు. ఇట్లు భ్రూమధ్యమున ప్రజ్ఞను ధారణ చేయవలెను. ప్రజ్ఞ సహజమగు వెలుగు కనుక భ్రూమధ్యమున వెలుగును తానుగ దర్శించుట నిర్దేశింపబడినది. దిక్కులకు మనస్సు చెదరినను, మరల భ్రూమధ్యముననే లగ్నము చేసి వెలుగును దర్శింపవచ్చును. దీనిని 'ధారణ' అందురు. ధారణ నిలుచుటకు జ్యోతిని చూచి కనులు మూసుకొనుట ఒక సంప్రదాయము. 🍀

సమం కాయ శిరో గ్రీవం ధారయ న్న చలం స్థిరః |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకయన్ || 13

కాయము, శిరస్సు, కంఠము తిన్నగ నిలిపి కదలిక లేక స్థిరముగ కూర్చుండి చిత్తమును దిక్కులకు పయనింపనీయక నాసికాగ్రమును వీక్షించుచు ఉండవలెనని ఈ శ్లోకము నిర్దేశించు చున్నది. 11, 12, 13, 14, 15 శ్లోకములలో ఆత్మసంయమమునకు నిత్యము చేయవలసిన అభ్యాసము వివరింపబడినది.

ఆసనమున కూర్చుండు సాధకుడు ధ్యానమున కుపక్రమించు సమయమున శిరస్సును, కంఠమును, మొండెమును నిట్టనిలువుగ నుంచుటకు ప్రయత్నింప వలెను. శిరస్సు పైకెత్తుటగాని, క్రిందికి దించుటగాని చేయరాదు.

వెన్నెముకను బాణము వలె వంచక, దండమువలె నిట్టనిలువుగ నుంచవలెను. ఇట్టి ఆసనము సిద్ధించుట చాల ముఖ్యము. ఇట్టి ఆసనము మాత్రమే ప్రజా ప్రసారమునకు సహకరించును. అవరోధములు కలుగవు. ఇట్లు కూర్చుండుటలో సుఖము కలుగవలెను. స్థిరము కలుగవలెను. అభ్యాసవశమున అది జరుగగలదు.

ఆసనము విషయమున అప్రమత్తత సాధకునకు తప్పని సరి. మనస్సు, ఇంద్రియములు, దేహము సహకరింపనిదే స్థిరము, సుఖము అగు ఆసనము కుదరదు. స్థిరము, సుఖము అగు ఆసనము కుదిరిన పిదప నాసికాగ్రమున దృష్టి నుంచవలెను. నాసికాగ్రమనగ భ్రూమధ్యము. భ్రూమధ్యమున దృష్టి సారించుట మానసికమే గాని భౌతికము కాదు.

ఇట్లు భ్రూమధ్యమున ప్రజ్ఞను ధారణ చేయవలెను. ప్రజ్ఞ సహజమగు వెలుగు కనుక భ్రూమధ్యమున వెలుగును తానుగ దర్శించుట నిర్దేశింపబడినది. దిక్కులకు మనస్సు చెదరినను, మరల భ్రూమధ్యముననే లగ్నము చేసి వెలుగును దర్శింపవచ్చును. దీనిని 'ధారణ' అందురు. ధారణ నిలుచుటకు జ్యోతిని చూచి కనులు మూసుకొనుట ఒక సంప్రదాయము.

గురువు లేక దైవముయొక్క ప్రసన్న వదన మును ధారణ చేయుట మరియొక ఉపాయము. ఉదయించు చున్న సూర్యబింబమును అంతర్ముఖముగ ధారణ చేయుట మరియొక ఉపాయము. సూర్యుని కాంతిచే వికసించుచున్న తెల్లని పద్మము ధారణ చేయుటకూడ ఒక ఉపాయమే.

అట్లే తాను, నేను అను తన వెలుగును ధారణ చేయుట గీతాచార్యుడు తెలిపిన ఉపాయము. చిత్తము ధారణచేయు వస్తువునందు లగ్నమై అచల స్థితి చెందవలెను. అప్పుడది క్రమముగ స్థిరమగు వెలుగుగ గోచరించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Mar 2021

No comments:

Post a Comment