🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కాశ్యప మహర్షి - 1 🌻
1. కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన వాడే కాశ్యపుడు. ఆయనకు ఒకసారి సిద్ధుడు కనబడ్డాడు. ఆ సిద్ధుడు త్రికాలవేది, విజ్ఞానసాగరం, లోకతత్త్వం బాగా తెలిసినవాడు. ఆ సిద్ధుడు, ఆయన శిష్యులు అలా ఆకాశమార్గాన వెళ్ళుతుంటే వాళ్ళ దివ్యతేజస్సులు చూచి ఆ సిద్ధుడికి నమస్కరించి “నిన్ను నేను గురువుగా భావిస్తున్నాను, నువ్వెవరు? నాకు మార్గం చూపించు, తనకు మార్గోపదేశం చేయమంటే, ఆ సిద్ధుడు బోధ చేసాడు.
2. “ఈ శరీరము ధర్మశాసనం కోసమే పుట్టింది. ధర్మపరిజ్ఞానంవల్ల లోకంలో ఏది ధర్మమో తెలుస్తుంది. ఆత్మహితంకోరి ధర్మాచరణకోసమని శరీరాన్ని కాపాడుకోవాలితప్ప, దానియందు మోహబుద్ధి ఉండకూడదు అని బోధించి, ఆహారము, ఉపవాసము ఇవన్నీ ఎంతవరకు ఉండాలో, ఎంతకు మించి ఉండకూడదో చెప్పాడు.
3. ధర్మాన్ని బాగా ఆచరించినవాళ్ళు, ధర్మమార్గంలో ఉన్నవాళ్ళు పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది.స్వర్గసుఖాలు సమాప్తమైన తరువాత వాళ్ళు సూర్యచంద్ర నక్షత్రలోకాల్లో ఎప్పుడు ఉంటారా? అక్కడినుంచీ పతనమై, మళ్ళీ భూమిపై పుడుతుంటారు. ఈ శరీరగతమైన ఆత్మకు సుఖదు@ఖాలు తప్పవు. మన కర్తవ్యము ఒక్కటే. సుఖదుఃఖములకు అతీతమైన మోక్షమార్గమునే మనం అన్వేషించాలి. దానికి యోగమే మార్గము.
4. సుఖదుఃఖాలను ఏకకాలంలో వదిలిపెట్టాలి. సంకల్పం అనేదాని విసర్జించాలి. ఇక ధర్మమేమో జీవనవిధానంగా ఉండాలి, మోక్షమేమో ప్రధానం కావాలి. ధర్మం ప్రధానం కాదు, అప్రధానం, మోక్షమే ఆత్యంతికమైన విషయం.
5. అధర్మం మనకు దోషాన్నిస్తుంది. కాబట్టి తపస్సును భంగంచేస్తుంది. కనుక జీవన విధానంలో ధర్మంలో ఉండాలి. ధర్మం ఎందుకు ఆచరిస్తున్నామంటే, మోక్షం కోసమని చెప్పాలి. కాబట్టి ప్రధానమైనటువంటి పురుషార్థం ఇదే! అని బోధించాడు కాశ్యపుడికి.
6. “యోగమార్గాలున్నాయి కదా! తపస్సుచేసి ఆత్మదర్శనం చేయమని అంటారుకదా మాహాత్మా! ఆ విధివిధానం ఎలాగో బోధించమని అడిగాడు కాశ్యపుడు.
7. అందుకు బదులుగా సిద్ధుడు, “జిహ్వ, కుత్తుక, తాలువు, కంఠనాళము, హృదయము వీటిలో మనసు ఎక్కడ నిలబడుతుందో అక్కడే ఉంటుంది. ఉదాహరణకు పళ్ళమీద మనసు నిలబడిందనుకో, మనసుని అక్కడే నిలబెట్టు. దానిని మరెక్కడోనిలబేట్టే ప్రయత్నం చేయవద్దు.
8. అది ఎక్కడ సుస్థిరంగా దాని ప్రాంతంలో నిలబడిందో అక్కడే ఉంచెయ్యి. అట్లా కదల్చకుండా మనస్సును ఎక్కడయితే పెడతావో, దానికి అప్పుడు అన్వేషణను గురించి చెప్పు. ఆత్మ ఎక్కడ ఉందో తెలుసుకునేటటువంటి దృష్టిని మనసుతో చెప్పు. ఆ ఆత్మను వెతుకుతూ ఆ మనసు దానిని పొందలేక, తానే లయం పొందుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
14 Mar 2021
No comments:
Post a Comment