గీతోపనిషత్తు -180
🌹. గీతోపనిషత్తు -180 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 21
🍀 21-2. హృదయ కేంద్రము - బుద్ధి కేంద్రము హృదయమున నుండును. మనస్సును శ్వాసపై లగ్నము చేసినచో హృదయమును చేరవచ్చును. చిత్తము హృదయము నందుంచుట నేర్చినచో బుద్ధియందుండుట వీలుపడును. హృదయము నందుండుట అనినను, బుద్ధి యందుండుట అనినను, అంతరంగ మందుండుట అనినను ఒకటియే. మనస్సు బాహ్య రంగమునందు ప్రవేశించుటకు ఆధారము. బుద్ధి అంతరంగమును శోధించుటకు ఆధారము. బుద్ధి యందు స్థిరముగ నుండి, “నేను” అను వెలుగును భావించుచు, దర్శించుచు నుండువాడు 'యోగి' అని తెలియవలెను. అతడు అవసరమును బట్టి మనస్సును ప్రవేశించునుగాని, సహజముగ బుద్ధియందే యుండును. 🍀
సుఖ మత్యంతికం యత్త ద్బుద్ధిగ్రాహ్య మతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థిత శ్చలతి తత్త్వతః || 21
ఉత్తమోత్తమమైన మోక్ష సాధనకు కూడ దేహము ప్రధానమైనది గనుక, దేహ నిర్వహణకు మనసేంద్రియములు అవసరము కనుక, మనసేంద్రియములను తూలనాడరాదు. అశ్రద్ధ చేయ రాదు. హింసింపరాదు. వానిచే బంధింప బడకుండ, వానిని నిర్వర్తించు సామర్థ్యమును పొందవలెను.
చిత్తము బాహ్యమున నిర్వర్తించవలసిన కార్యము లేవియు లేనపుడు మనస్సున కూర్చుండ నవసరము లేదు. మనస్సు కార్యాలయము వంటిది. బాహ్యసంబంధిత కార్యములను నిర్వర్తించుటకే కదా మనము కార్యాలయమున కేగునది. బాహ్య కార్యములు లేనపుడు ప్రత్యేకించి సెలవుదినమున కార్యాలమున కేగము. అట్లే బాహ్యమగు కార్యములు లేనపుడు జీవుడు మనస్సున కూర్చుండ నవసరమే లేదు.
అతడు బుద్ధిలోనికి చనుట మేలు. బుద్ధి కేంద్రము హృదయమున నుండును. మనస్సును శ్వాసపై లగ్నము చేసినచో హృదయమును చేరవచ్చును. చిత్తము హృదయము నందుంచుట నేర్చినచో బుద్ధియందుండుట వీలుపడును. హృదయము నందుండుట అనినను, బుద్ధి యందుండుట అనినను, అంతరంగ మందుండుట అనినను ఒకటియే. మనస్సు బాహ్య రంగమునందు ప్రవేశించుటకు ఆధారము.
బుద్ధి అంతరంగమును శోధించుటకు ఆధారము. ఈ శ్లోకమందు ఆత్మ బుద్ధి గ్రాహ్యమని, మన సేంద్రియ గ్రాహ్యము కాదని చెప్పబడినది. బుద్ధి అను వెలుగున చేరి, నేనను వెలుగును భావించుచు, దర్శించుచు నుండుట చెప్పబడినది.
అట్లు చేయు వానికి ఆద్యంతములు లేని సుఖముండునని భగవంతుడు చెప్పుచున్నాడు. పై విధముగ బుద్ధియందు స్థిరముగ నుండి, “నేను” అను వెలుగును భావించుచు, దర్శించుచు నుండువాడు 'యోగి' అని తెలియవలెను. అతడు అవసరమును బట్టి మనస్సును ప్రవేశించునుగాని, సహజముగ బుద్ధియందే యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment