శ్రీ శివ మహా పురాణము - 380


🌹 . శ్రీ శివ మహా పురాణము - 380 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 13

🌻. పార్వతీ పరమేశ్వర సంవాదము - 3 🌻


ఓ మహర్షీ! ఇట్లు ఆ శివాదేవి ధ్యాననిమగ్నుడైన శంకరుని సేవించుచుండగా చాల కాలము గడిచిపోయెను (44). ఒకప్పుడు ఆ కాళి సఖురాండ్రిద్దరితో గూడి శంకరుని ఆశ్రమములో కామ వర్ధకము, మంచి తాళము గలది అగు మధురమైన పాటను పాడెను (45). మరియొకప్పుడు ఆమె దర్భలను, పుష్పములను, సమిధలను స్వయముగా తెచ్చెడిది. ఆమె అక్కడ స్థలము నంతనూ సఖురాండ్రతో గూడి శుభ్రము చేయుచుండెడిది (46).

ఒకప్పుడామె అనురాగముతో కూడినదై చంద్రశేఖరుని కుటీరములో ఆయన సమీపములో గూర్చుండి ఆయనను ఆశ్చర్యముతో చూచుచుండెడిది (47). భూతపతియగు ఆ శివుడు విషయాసంగములేనిదై తన సమీపములోనున్న ఆమెను చూచి, పూర్వము సతీరూపములో నున్న దేవియే ఈమె యని తపః ప్రభావముచే మనస్సుతో దర్శించెను (48).

శివుడు తన సమీపమునందున్నట్టియు, మహాలావణ్యదనిధియైనట్టియు, మహర్షులకు కూడ మోహమును కలిగించగల ఆ కాళీ దేవిని వెంటనే భార్యగా స్వీకరించలేదు (49). ఇంద్రియ జయము కలిగి నిత్యము నిష్ఠతో తనను సేవించుచున్న ఆమెను అనేక పర్యాయములు చూచిన పిదప మహాదేవునకు దయ కలిగి ఇట్లు తలపోసెను (50).

ఈ కాళి ఎప్పుడైతే తపస్సును తీవ్రముగా చేయునో, అప్పుడు ఆమెలోని గర్వము యొక్క బీజము తొలగిపోవును. అపుడామెను నేను స్వీకరించగలను (51).

బ్రహ్మ ఇట్లు పలికెను-

భూపతి, మహాయోగిశ్రేష్టుడు, గొప్ప లీలలను ప్రదర్శించువాడునగు ఆ ప్రభువు ఇట్లు తలపోసి వెంటనే ధ్యాననిమగ్నుడయ్యెను. (52). ధ్యానమునందు నిమగ్నుడైన ఆ శివపరమాత్మ యొక్క హృదయములో మరియొక తలంపు లేకుండెను. ఓమహర్షీ! (53) కాళీదేవి సర్వకాలములయందు ఆ మహాత్ముని రూపమును స్మరింస్తూ, ప్రతి దినము ఆ శంభుని మంచి భక్తితో చక్కగా సేవించెను(54). శివుడు నిత్యము ఆ సుందరిని చూచుచూ, పూర్వమందలి దుఃఖమును మరచిపోయెను. ధ్యాన నిమగ్నుడైన ఆ శివుడు ఆమెను చూచుచున్ననూ చూడని వాడు వలెనే యుండెను. (55). ఇంతలో ఇంద్రుడు మొదలగు దేవతలు, మరియు మునులు బ్రహ్మ యొక్కఆజ్ఞను ఆదరముతో స్వీకరింతి మన్మథుడు అచటకు పంపింరి(56).

మహాబలవంతుడగు తారకాసురునిచే మిక్కిలి పీడించబడిన దేవతలు రుద్రుడు కాళిని ప్రేమించి వివాహమాడునట్లు చేయుటకై మన్మథుని పంపిరి(57). మన్మథుడు అచటకు వెళ్లి తన ఉపాయములనన్నిచినీ ప్రయోగించెను. శివుడు లేశ##మైననూ చలించలేదు. పైగా అతనిని బూడిదగా చేసెను.(58) ఓ మహర్షి! పార్వతి కూడా తన గర్వమును విడనాడెను. ఆ సతి శివుని ఆదేశముచే గొప్ప తపస్సును చేసి శివుని భర్తగా పొందెను. (59) ఆ పార్వతీ పరమేశ్వరులు మిక్కిలి ఆనందించిరి. ఇతరులకు ఉపకరించుటలో ప్రీతి గల ఆ దంపతులు దేవ కార్యమును నెరవేర్చిరి(60).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ పరమేశ్వ సంవాద వర్ణన మనే పదమూడవ అధ్యాయము ముగిసినది(13).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


04 Apr 2021

No comments:

Post a Comment