గీతోపనిషత్తు -183


🌹. గీతోపనిషత్తు -183 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 24

🍀 24. ఆరోహణ మార్గము - జీవితమును కోరికలకై వెచ్చింపక, కర్తవ్యమునకై మళ్ళించుట మొదటిమెట్టు. కర్తవ్య నిర్వహణమే కర్మ నిర్వహణము. సంకల్ప ప్రభావము చేత కలిగెడి కోరిక లన్నింటిని పరిపూర్ణముగ విడిచి పెట్టి, మనసేంద్రియములు వినిమయము కలిగి మెల్ల మెల్లగ ధృతి, బుద్ధియందు విశ్రాంతి చెందును. అట్టి ధృతిని బుద్ధి మూలము నందు లగ్నము చేయగ ధ్యానమగును. అంతరంగ ధ్యానమున నిలచిన స్థితి మనో బుద్ధ్యాత్మ స్థితి. అట్టి ధ్యానము ఆత్మయోగమును కల్పించును. అపుడు ఇతర విషయములు లేని కేవలస్థితి కలుగును. దానినే కైవల్యమందురు. 🍀

సంకల్ప ప్రభవాన్ కామాం స్త్యక్యా సర్వా నశేషతః |
మనసై వేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః || 24


సంకల్ప ప్రభావము చేత కలిగెడి కోరిక లన్నింటిని పరిపూర్ణముగ విడిచి పెట్టి, మనసేంద్రియములు వినిమయము కలిగి మెల్ల మెల్లగ ధృతి, బుద్ధియందు విశ్రాంతి చెందును. అట్టి ధృతిని బుద్ధి మూలము నందు లగ్నము చేయగ ధ్యానమగును. అట్టి ధ్యానము ఆత్మయోగమును కల్పించును. అపుడు ఇతర విషయములు లేని కేవలస్థితి కలుగును. దానినే కైవల్యమందురు.

కోరికలు గలవానికి యోగము లేదని కర్మయోగమున తెలుప బడినది. కోరికలు గలవారు కర్మయోగమున కూడ చెందలేరు. కోరికలు ఇంద్రియముల రూపమున ప్రజ్ఞను బాహ్యములోనికి ప్రసరింప చేయును. ఎన్ని కోరికలున్న అంతగ బహిః ప్రవాహ మేర్పడి జీవుడు నీరసించును. కోరికలకు గాని, ఆలోచనలకు గాని, యోగమునకు గాని పెట్టుబడి జీవచైతన్యమే! దానినెట్లు వినియోగింప వలెనో కృష్ణ పరమాత్మ కర్మయోగమున సూచించినాడు.

జీవితమును కోరికలకై వెచ్చింపక, కర్తవ్యమునకై మళ్ళించుట మొదటిమెట్టు. కర్తవ్య నిర్వహణమే కర్మ నిర్వహణము. అది కాలము, దేశము రూపమున ప్రతి వ్యక్తిని సమీపించును. వాటి నిర్వహణమున ఫలాసక్తి లేకుండుట, వక్రతలు లేకుండుట, విజయ మందినపుడు మోహపడకుండుట, అపజయము కలిగినపుడు శోకము చెందకుండుట జరిగినచో కర్మయోగము సిద్ధించినట్లే. ఇట్లు జరుగుటకు దైవమును ఆరాధించుట, ఆశ్రయించుట నెంతయో ఉపయోగకరము.

అటుపైన తనకున్నదానిలో ఆత్మవంచన లేక ఇతరులకు హితము ఒనర్చుట వలన మనోమాలిన్యములు తొలగి, జ్ఞానాసక్తి ఏర్పడును. తనకున్నవన్నియు దైవమిచ్చినవేయని తలచి, దైవదత్త మని ఎరిగి, ఆర్తులగు జీవులకు వానిని పంచుటవలన మనోనైర్మల్య మేర్పడి బుద్ధియందు ప్రవేశించుట కవకాశ మేర్పడును.

తన శరీరమును, ఇంద్రియములను, మనోమేధస్సును ఇతరుల కుపయోగ పడునట్లు కర్తవ్య నిర్వహణముతో పాటు సాగుచుండగ జ్ఞానోదయమున కవకాశ మేర్పడును. అంతరంగమున వినిపించుట, కనిపించుట జరిగి జ్ఞానయోగమునకు దారిచూపును.

మనిషికి జ్ఞానము కలుగుచున్నదా, లేదా అను విషయమునకు గీటురాయి ఒకటియే. ఎట్టి సమయమునందు కాంక్ష, ద్వేషము లేకుండుట, జ్ఞానులనుకొన్న వారికి, భక్తులనుకొన్న వారికి, వారి కాంక్షా ద్వేషము లెట్లున్నవో, ఎప్పటికప్పుడు తరచి చూచుకొనుచుండ వచ్చును. ఈ క్రమమున సమ్యగ్ న్యాసము లభించును. అదియే సన్యాసయోగము.

కాషాయము కట్టినను కాంక్షలు, ద్వేషము వీడనివారు సన్యాసులు కారు. సంసార మందున్నను, కాంక్షాద్వేషములు లేనివారు సన్యాసులే. ఎందరో యోగులు సంసారమందు సన్యాస స్థితిలో గడిపిరి. అట్లే సన్యాసుల యందుగూడ నిజమగు యోగులున్నారు. పై తెలిపిన సోపానక్రమమే భగవానుడు మరల మరల తెలియజెప్పుచు ముందడుగు వేయించుట భగవద్గీత యందు నిత్యము కన్పట్టును. సంకల్పము సన్యసించుట యోగమున కావశ్యకమని ఈ అధ్యాయమున రెండవ శ్లోకమున దైవము తెలిపినాడు.

సంకల్పము సన్యసించినపుడు కోరికలే కలుగవు. కర్తవ్య స్ఫురణయే యుండును. దానిని ఈ సూత్రమున ఆవిష్కరించు చున్నాడు. కర్తవ్యము మాత్రమే నిర్వర్తించుచు, ఇతరమగు కోరికలు లేనపుడు, ఇంద్రియములకంత పనియుండదు. తీరుబడిలేక ఇంద్రియ ద్వారమున జీవుడు బాహ్యమున తిరుగడు. అప్పుడా ఇంద్రియములు జాతికుక్కలవలె మనస్సను యజమానిని అంటి పెట్టుకొని యుండును.

సంకల్పములు తీవ్రముగ లేనపుడు మనస్సునకు గూడ తీరుబడి ఉండును. సంకల్పములే సన్యసింపబడినపుడు మనస్సునకు తీరుబడి పెరుగును. ప్రశాంతతకూడ పెరుగును. అట్టి మనస్సును బుద్ధితో లగ్నము చేయుట సులభము. బుద్ధియను వెలుగుపై మనస్సు నిలచినపుడు మనస్సు వెలుగై, బుద్ధియై నిలచును. అట్టి బుద్ధిని దానిమూలము పై లగ్నము చేయుట ఈ అధ్యాయమున తెలుపబడుచున్నది.

అట్లు అంతరంగ ధ్యానమున నిలచిన స్థితి మనో బుద్ధ్యాత్మ స్థితి. అపుడా మనస్సున కితర చింత లెట్లు కలుగును. ఇట్లు పరమాత్మ సోపానక్రమమున ఆత్మతో యోగమును అందించినాడు. సోపానమును ఎవరైనను ఈ విధముగనే ఆరోహణము చేయనగును. ఇతర మార్గములు భ్రమ గొల్పును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


10 Apr 2021

No comments:

Post a Comment