శ్రీ శివ మహా పురాణము - 383


🌹 . శ్రీ శివ మహా పురాణము - 383 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 14

🌻. వజ్రాంగుడు - 3 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

జ్ఞాని, సత్వ గుణ సంపన్నుడు, విరోధము లేనివాడు అగు ఆ వజ్రాంగుడు ప్రియురాలి ఈ మాటము విని ఆశ్చర్యమును దుఃఖమును పొంది, తన మనస్సులో ఇట్లను కొనెను(33). నా ప్రియురాలు దేవతలతో వైరమును కోరుచున్నది . నాకు వైరమునందు అభిరుచి లేదు. ఏమి చేయుదును? ఎక్కడికి వెళ్లేదను? నాప్రతిజ్ఞ చెడకుండ ఉపాయమేది? (34).ప్రియురాలి కోర్కెను తీర్చినచో , ముల్లోకములు, దేవతలు, మహర్షులు మరల పెద్ద దుఃఖమునకు గురి యగుదురు(35).

ప్రియురాలి కోరిక తీరనిచో , నాకు నరకము సంప్రాప్తమగును. ఈ రెండు పక్షములలోనూ ధర్మమునకు హాని నిశ్చితమని ఆతడు తలపోసెను (36). ఓ మహర్షీ! వజ్రాంగుడు ఈ తీరును ధర్మ సంకటములో పడి తిరుగాడెను. ఆ రెండు పక్షముల బలాబలములను అతడు బుద్ధితో విమర్శించెను (37).

ఓ మహర్షీ! విద్వాంసుడగు ఆ వజ్రాంగుడు శివుని సంకల్పముచే ప్రియురాలి వాక్యమును అంగీకరించెను. ఆ రాక్షసరాజు ప్రియురాలితో 'అటులనే గానిమ్ము' అని పలికెను(38). అతడు ఇతరులకు శక్యముగాని తీవ్రమగు తపస్సును ఆమె కోర్కెను

తీర్చుటకు చేసెను. అతడు జితీంద్రియుడై నన్ను ఉద్దేశించి పరమప్రేమతో అనేక సంవత్సరములు తపస్సు జేసెను. (39). నేనా మహాతపస్సును గాంచి, అతనికి వరము నిచ్చుటకై వెళ్లితిని. మిక్కిలి ప్రసన్నమగు మనస్సుతో అతనిని 'వరమును కోరుకొమ్మని' చెప్పితిని(40). ఆకాశమునందున్న విభుడనగు నన్ను చూచి , నేను ప్రీతుడనై యుండుటను గాంచి , ఆ వజ్రాంగుడు సాష్టాంగప్రణామమును చేసి అనేక విధముల స్తుతించి , అపుడు ప్రియురాలి కోరికను వరముగా అడిగెను(41).


వజ్రాంగుడిట్లు పలికెను-

హే ప్రభో! తన తల్లికి గొప్ప హితమును చేకూర్చువాడు, మహాబలశాలి, గొప్ప పరాక్రమము గలవాడు, గొప్ప దక్షుడు, తపససునకు నిధి యగు పుత్రుని నాకు ఇమ్ము(42).


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! అతని ఆ వాక్యమును విని, నేను 'అటులన్‌ అగు గాక!' అని పలికితిని. అట్లు వరమునిచ్చి, వికలమైన మనస్సు గలవాడనై, శివుని స్మరించుచూ , నేనూ నా ధామమును చేరుకొంటిని(43).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో వజ్రాంగతపోవర్ణనమనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది.(14)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


10 Apr 2021

No comments:

Post a Comment