గీతోపనిషత్తు -265


🌹. గీతోపనిషత్తు -265 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 7-2

🍀 7. ఈశ్వర ప్రణిధానము -2 - ప్రతి జీవుడును తన ప్రకృతిని తాను దాటుటకు, తన యందున్న ఈశ్వరుని శాశ్వతముగ ఆశ్రయించ వలెను. ఈశ్వర ప్రణిధానముననే జీవుడు తనదైన ప్రకృతిని దాట గలడు. సర్వప్రకృతికిని స్వామియే ఈశ్వరుడై యుండుటచే, ఈశ్వరునాశ్రయించుట, ఈశ్వర శరణాగతి జొచ్చుట, ఈశ్వరునితో ఎల్లప్పుడు కూడి యుండుట ఉపాయమని తెలియవలెను. చేతల యందున్నంత కాలము ప్రకృతి యందున్నట్లే, చేతలకు మూలమగు ఉనికి యందున్నపుడు స్వభావ వశమున యుండక దైవవశమై యుండును. ప్రకృతికి మూలము, ఆధారము అగు తత్త్వమును ఆశ్రయించుట మార్గమని తెలియవలెను. 🍀


సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పయే పున స్తాని కల్పాదౌ విస్పజా మ్యహమ్ II 7


తాత్పర్యము : ప్రళయ కాలమున ప్రాణికోట్లన్నియు నా ప్రకృతిని చేరును. నా ప్రకృతి నన్నుచేరి హృదయమున నుండును. మరల నా ప్రకృతి నా హృదయమునుండి వెలువడి ప్రాణికోట్లను వెలువరించును.

వివరణము : ప్రాణికోట్లన్నిటికిని ప్రకృతియే మూలము. ప్రకృతికి తాను మూలము. తన నుండి పుట్టిన ప్రకృతినుండి పుట్టిన ప్రాణి కోట్లకు ప్రకృతియే స్వామి. ప్రకృతికి తాను స్వామి. తాను ప్రకృతికి ఆవలివాడు. జీవులు ప్రకృతికి ఈవలివారు. జీవులు ప్రకృతికి లోబడి యుందురు. తాను ప్రకృతికి మూలమగుటచే ప్రకృతికి లోబడి యుండు వాడు కాదు.

జీవులు తన్నాశ్రయించినచో ప్రకృతిని దాటుటకు వీలుపడును. ప్రతి జీవుడును తన ప్రకృతిని తాను దాటుటకు, తన యందున్న ఈశ్వరుని శాశ్వతముగ ఆశ్రయించ వలెను. ఈశ్వర ప్రణిధానముననే జీవుడు తనదైన ప్రకృతిని దాట గలడు. సర్వప్రకృతికిని స్వామియే ఈశ్వరుడై యుండుటచే, ఈశ్వరునాశ్రయించుట, ఈశ్వర శరణాగతి జొచ్చుట, ఈశ్వరునితో ఎల్లప్పుడు కూడి యుండుట ఉపాయమని తెలియవలెను.

చేతల యందున్నంత కాలము ప్రకృతి యందున్నట్లే, చేతలకు మూలమగు ఉనికి యందున్నపుడు స్వభావ వశమున యుండక దైవవశమై యుండును. జీవుడు తానే కర్తయని భావించుచుండును. నిజమునకు తన యందలి ప్రకృతియే తనను నడిపించు కర్త. తన స్వాధీనము నందు లేని తన ప్రకృతిని తానెట్లు దాటగలడు? తన ప్రకృతి బలవత్తరముగ తనచే పనులు చేయించు చుండును. అనగూడని మాటలనుట, వినగూడనివి వినుట, చేయగూడనివి చేయుట, తినగూడనివి తినుట- ఇట్లెన్నో విధములుగ జీవుడు అవశుడై యుండును. ఎంత తెలిసినను ప్రకృతిచే ఏదో విధమగు హింసకు గురియగు చుండును. అట్టి ప్రకృతిని జ్ఞానులు కూడ దాటలేరు. కనుక ప్రకృతికి మూలము, ఆధారము అగు తత్త్వమును ఆశ్రయించుట మార్గమని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

23 Oct 2021

No comments:

Post a Comment