శ్రీ శివ మహా పురాణము - 464
🌹 . శ్రీ శివ మహా పురాణము - 464🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 33
🌻. సప్తర్షుల ఉపదేశము - 2 🌻
అరుంధతి ఇట్లు పలికెను-
ఓ మేనకా! సాధ్వీ! లెమ్ము. నేను అరుంధతిని. దయానిధులగు ఏడ్గురు ఋషులతో గూడి నేను మీఇంటికి వచ్చి యుంటిని (13).
బ్రహ్మ ఇట్లు పలికెను-
అరుంధతి యొక్క కంఠస్వరమును విన్నంతనే మేనక వేగమే లేచి నిలబడి, లక్ష్మీదేవి వలె వెలుగొందుచున్న ఆమెకు శిరసానమస్కరించి ఇట్లు పలికెను (14).
మేన ఇట్లు పలికెను-
అహో! మేము ఎంత పుణ్యమో చేసుకొని జన్మించితిమి. అందువలననే జగ్తునకు విధివిధానమునందించిన వసిష్ఠుని ధర్మపత్ని ఇచటకు వచ్చినది (15). ఓ దేవీ! ఇచటకు మీరు వచ్చుటలో గల కారణమేమియో నాకు వివరముగా చెప్పుడు. నేను నీకు దాసివంటి దానను. నీకుమార్తె వంటి దానను. నాపై దయను చూపుము (16).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు పతివ్రతయగు అరుంధతిమేనయొక్క ఈ మాటలను విని, ఆమెకు పరిపరివిధముల బోధచేసి, మరల ఆ ఋషులు ఉన్నచోటికి ప్రీతితో తరలి వచ్చెను (17). మరియు మాటలాడుటలో సమర్థులగు ఆ ఋషులందరు శివుని పాద పద్మములను స్మరించి సాదరముగా పర్వతరాజునకు బోధించిరి (18).
ఋషులిట్లు పలికిరి-
ఓ పర్వతరాజా! శుభకరమగు మా మాటలను వినుము. పార్వతిని శివునకు ఇమ్ము. జగత్తును లయముచేయు రుద్రునకు మామవు కమ్ము (19). తారకుని వినాశము కొరకై బ్రహ్మగారు యాచించుట ఎరుంగని ఆ సర్వేశ్వరుని ఈ వివాహమును చేసుకొమ్మని కష్టపడి ఒప్పించెను (20). యోగివర్యుడగు శంకరునకు వివాహమునందభిరుచి లేదు. కాని ఆ దేవుడు బ్రహ్మగారి ప్రార్థనచే నీ కన్యను వివాహమాడగలడు (21). నీ కుమార్తె తపస్సును చేయగా ఆయన ఆమెకు మాటను ఇచ్చి యున్నాడు. ఈ రెండు కారణములచే యోగివర్యుడగు శివుడు వివాహమును చేసుకొనగలడు (22).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
23 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment