మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 93


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 93 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 9 🌻


మానవజీవిత రంగంలో ప్రతి ఒక్కడు పరమాత్మను తనకు సహాయంగా ఆవాహన చేసి తన హృదయంలోనికి ఆహ్వానం చేసికొనుటకు సంకేతంగా మహాభారతంలో ఈ ఘట్టం ఉన్నది.

శ్రీకృష్ణుని, యుద్ధంలో సహాయమును ఆపేక్షించుట కొరకు అర్జునుడు, దుర్యోధనుడు వస్తారు. దుర్యోధనుడు తలవైపున అర్జునుడు పాదముల వైపున కూర్చొనుట ఈ కథను మనమెరుగుదుము. పాదముల వైపున కూర్చున్నవాడు అనుగ్రహింప బడినాడు.

పరమాత్మ తన దొంగనిద్రలో నుండి మేల్కొని కనులు తెరిచేటప్పటికి ఎదురుగా కాళ్ళవైపున చూస్తుండగా అర్జునుడు కనబడినాడు. తలవైపున కూర్చున్న దుర్యోధనుడు కనిపించలేదు. అతడు నేను వచ్చానని చెప్పుకోవలసి వచ్చింది.

నేను వచ్చానని చెప్పుకున్నవాడి గతి యుద్ధంలో ఏమైందో మనం చూశాము గదా! ఈ ప్రపంచంలోకి నేను వచ్చానండోయ్ నేనిది పాస్ అయినాను అది చదువుకున్నాను. నాకు ఆస్తి ఇంత ఉంది. నగరంలో నేనింత‌ మందిని ఎరుగుదును. నాకు హోదా ఇంత ఉంది. నేనింతమందిని కంట్రోల్ చేయగలను అన్నవాడి గతి దుర్యోధనుడి గతే అవుతుంది. ఇది లాభం లేదు.

కావలసినదల్లా పాదముల దగ్గర కూర్చోగలగటమే. సంఘంలో ఉన్న జీవులను చూచి, వారిలో పరమాత్మను చూచి, తదర్చన బుద్ధితో, తదర్పణబుద్ధితో తన వృత్తి వ్యాపారాదులను ఆరంభించుకొనవలెను. ఇది మహాభారతానికి (మన జీవితానికి మధ్యన) ఉన్న సంకేతం.

దుర్యోధనునితో పాటు వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని ఏమీ కోరలేదు‌ శ్రీకృష్ణుడే "యాదవుల సహాయం కావాలా? నేను ఒక్కడినే కావాలా? అని అడుగుతూ నేను యుద్ధం చేయను అస్ర్తం పట్టను, అని అన్నాడు. "నీ యుద్ధం, సహాయం కాదయ్యా నేను కోరేది. నీవు నా రథమందు వసింపుమయ్య! నందకుమారా యదుభూషణ" అని (అర్జునుడు) కోరాడు‌. కోరగానే కృష్ణుడు యుద్ధంలో రథం మీద కూర్చున్నాడు.

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


24 Oct 2021

No comments:

Post a Comment