గీతోపనిషత్తు -283


🌹. గీతోపనిషత్తు -283 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 14-3

🍀 14-3. మహాత్ములు - దైవము కాని దేదియు లేదు. ఆ దైవీతత్త్యము అనేకానేకమగు అల్లికలు ప్రకృతి నిర్వర్తించును. అన్నియు మూలము నందు దైవమే. దేవతలకు, మానవులకు, జంతువులకు, వృక్షములకు, ఖనిజములకు, పక్షులకు, గ్రహగోళములకు, సూర్యమండలములకు, తారకా మండలములకు, సమస్త సృష్టికి మూలము ఒకటియే. అట్టి తత్త్వమును దర్శించుట అనుక్షణము భగవద్గీత యందు బోధించ బడుచున్నది. నామ రూప భేదములతో కొట్లాడుకొను మూర్ఖులకు, మత భేదములతో హింసించుకొను మతోన్మాదులకు, జాతి భేదము లతో ఒకరినొకరు దమించజూచు జాతి అహంకారులకు, దైవమును గూర్చిన ఉద్యమకారులకు, ఉద్వేగులకు, ఉగ్రవాదులకు దైవము తెలుయుట కలనైనను సాధ్యపడదు. 🍀

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14

తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించిన వారిని గూర్చి ముందు శ్లోకమున తెలుపబడినది. వారి లక్షణములు మరికొన్ని ఈ శ్లోకమున దైవము తెలియజేయుచున్నాడు. ముందు శ్లోకమున మహాత్ములు దైవమును భూతము లన్నిటికిని మూలమని, అది అవ్యయమగు తత్త్వమని తెలిసి అన్యము లేని మనసుతో వానిని నిత్యము సేవించు చుందురని తెలిపెను.

వివరణము : కులమత భేదములు, స్త్రీ పురుష భేదములు, జాతి భేదములు, దేశీయత వంటి వర్గీకరణము లేక అట్లు గోచరించుచున్న వైవిధ్యము నందు ఏకత్వమును దర్శింతురు. నిజమునకు దైవము కాని దేదియు లేదు. ఆ దైవీతత్త్యము అనేకానేకమగు అల్లికలు ప్రకృతి నిర్వర్తించును. అన్నియు మూలము నందు దైవమే. అన్ని రంగులకు మూలము శ్వేతవర్ణమే. అన్ని శబ్దములకు మూలము నాదమే. అన్ని రూపములకు మూలము అండమే. అన్ని అంకెలకు మూలము పూర్ణమే (సున్న).

దేవతలకు, మానవులకు, జంతువులకు, వృక్షములకు, ఖనిజములకు, పక్షులకు, గ్రహగోళములకు, సూర్యమండలములకు, తారకా మండలములకు, సమస్త సృష్టికి మూలము ఒకటియే. చూచు వానికి, వినువానికి మూలము కూడ అదియే. అట్టి తత్త్వమును దర్శించుట అనుక్షణము భగవద్గీత యందు బోధించ బడుచున్నది.

నామ రూప భేదములతో కొట్లాడుకొను మూర్ఖులకు, మత భేదములతో హింసించుకొను మతోన్మాదులకు, జాతి భేదము లతో ఒకరినొకరు దమించజూచు జాతి అహంకారులకు, దైవమును గూర్చిన ఉద్యమకారులకు, ఉద్వేగులకు, ఉగ్రవాదులకు దైవము తెలుయుట కలనైనను సాధ్యపడదు. ఇట్టి కల్లోలము నందు కూడ దైవలీలను చూచువాడు నిజమగు మహాత్ముడు. దీనిని నిరాకరింపక అన్నియు అతని వైభవమే అని భావించుచు, అన్నిటి యందు అతనిని దర్శించు మహాత్ములే మానవజాతికి పరిష్కారము. దైవమే మహాత్ములు గూర్చి నిర్వచించినాడు. మహాత్ములను గుర్తించుటకు ఈ రెండు శ్లోకములే (13, 14) ప్రామాణికములు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


29 Nov 2021

No comments:

Post a Comment