శ్రీ శివ మహా పురాణము - 482

🌹 . శ్రీ శివ మహా పురాణము - 482 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 37

🌻. పెళ్ళి హడావుడి - 1 🌻

నారదుట్లిపలికెను-

తండ్రీ! నీవు ప్రాజ్ఞుడవు. హే ప్రభో! నాయందు దయ ఉంచి, సప్తర్షులు వెళ్లిన తరువాత హిమవంతుడు ఏమి చేసెను? అను వృత్తాంతమును నాకు చెప్పుము (1).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అరుంధతితో గూడి సప్తర్షులు వెళ్లిన తరువాత హిమవంతుడు ఏమి చేసినాడు అను విషయమును నీకు చెప్పెదను. ఓ మహర్షీ! (2) మహాత్ముడు, పర్వతేశ్వరుడు అగు హిమవంతుడు తరువాత మేరువు మొదలగు తన సోదరులను, కుమారులను, బంధువులను ఆహ్వానించి ఆనందించెను (3).

మహర్షుల ఆజ్ఞ ప్రకారము హిమవంతుడు తమ పురోహితుడగు గర్గుని చేత ప్రీతి పూర్వకముగా లగ్నపత్రికను వ్రాయించెను (4). తరువాత ఆయన ఆ పత్రికను, అనేక విధములగు వస్తువులను, ఆనందముతో నిండిన హృదయములు గల బంధువులచేత శివునికి పంపించెను (5).

ఆ జనులు కైలాసములో శివుని సన్నిధికి చేరి ఆ పత్ర మునకు తిలకమునద్ది శివునకు సమర్పించిరి (6). వారందరికి ఆ ప్రభుడు యథాయోగ్యముగా ప్రత్యేక సన్మానమును చేయగా, వారు ఆనందముతో నిండిన మనస్సు గలవారై పర్వతుని సన్నిధికి మరలివచ్చిరి (7).

మహేశ్వరునిచే ప్రత్యేకముగా సన్మానింపబడి మిక్కిలి ఆనందముతో తిరిగి వచ్చిన ఆ జనులను చూచి పర్వతరాజు మనస్సులో చాల సంతోషించెను (8). అపుడాయన ఆనందముతో అనేక దేశములందున్న తన బంధువులందరికీ ప్రీతికరమగు ఆహ్వానములను పంపెను (9).

తరువాత ఆయన వివాహమునకు కావలసిన వివిధ సామగ్రులను, బంగారమును శ్రద్ధతో ప్రోగు చేయ జొచ్చెను (10). బియ్యము, అటుకులు, బెల్లము, పంచదార, మరియు లవణము పర్వత శిఖరముల వలె గుట్టలుగా పోయబడి యుండెను (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


29 Nov 2021

No comments:

Post a Comment