🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 14 🌹🌻. 12. శ్రీ మాణిక్యాంబ దేవి - 12వ శక్తి పీఠం - ద్రాక్షారామం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 🌻📚.

శ్రీ భీమేశ్వర శ్రీ మాణిక్యాంబ దేవి 🙏 


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 14 🌹
🌻. 12. శ్రీ మాణిక్యాంబ దేవి - 12వ శక్తి పీఠం - ద్రాక్షారామం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. శ్రీ మాణిక్యాంబ దేవి దివ్యస్తుతి 🌴

స్వయం భూరస్తి భీమేశః మాణిక్యాంబాతదైవ చ |
సప్తర్షిస్సమానీతం సప్త గోదావరం శుభం |
సూర్యేణసేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః |
భక్తరక్షణ సంవ్యగ్రా దక్షవాటికే ||12 మాణిక్యాంబ

🌻. ద్రాక్షారామ మాణిక్యాంబ:
రక్షమాం ద్రాక్షారామ పురవాసినీ – భీమే శురాణీ
పాలయమాం గోదావరీతటి వాసినీ – శక్తి స్వరూపిణీ

మాణిక్యాంబ … ఆహా ! ఎంత చల్లని పేరు. అంబ అనగా అమ్మ, మాణిక్యముల వంటి చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలందించే అమృతమూర్తి. 

సతీదేవి “కణత” పడిన శక్తి ప్రదేశమై భీమేశ్వరుడు, మాణిక్యాంబ ఒకేసారి స్వయం ప్రతిష్ఠ పొందిన ప్రదేశమే ద్రాక్షారామం. 

ఈ ప్రాంతాన్నే “త్రిలింగ” పిఠం అంటారు. ఆంధ్ర ప్రదేశ్‌లో శ్రీశైల, శ్రీకాళహస్తి, ద్రాక్షారామ క్షేత్రాలను మూడింటిని కలిపి “త్రిలింగ దేశం” అంటారు. 

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు 32 కి||మీ|| దూరంలో, రాజమండ్రికి 60 కి||మి|| దూరంలో ఉన్న ఈ ద్రాక్షారామ శక్తి పీఠాధినేత్రి మాణిక్యాంబ, స్వయంభూ లింగాకారుడు భీమేశ్వరుడు, దక్షుడు యాగం చేసిన ప్రదేశం కనుక దక్షారామమయింది. దక్షవాటిక అనే మరో పేరు కూడా కలదు.

దక్షప్రజాపతి యజ్ఞ చేసిన ప్రదేశం కనుక “దక్షారామం” అని మిక్కిలి ద్రాక్ష తోటలుండటం వలన “ద్రాక్షారామం” అని పేరు వచ్చింది. “ద్రాక్షారం” అనే మరోపేరు కూడా కలదు. ఇక్కడ శంకరుడు “భీమేశ్వరుడై” స్వయంభువుడై వెలిశాడు. కనుక శక్తి ఈశ్వరుల సంగమస్థానమే ఈ ద్రాక్షారామం.

ఈ ప్రాంతాన గోదావరీ నదికి “సప్త గోదావరమని” పేరు.

తెలుగు వెలుగుల పదమునకు సత్యపదమై అమరేవిధంగా అక్షర సత్య నిరూపణ చేసిన భీమ కవి ఈ భీమేశ్వర మాణిక్యాంబలను సేవించి, అక్షర శక్తిని సంపాదించాడు.

ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో రెడ్డిరాజులు నిర్మించారు. ఊరిమధ్యనగల ఈ ఆలయం 3 ప్రాకారాలతో , 4 గాలిగోపురాలతో శివభక్తితో ధీటుగా నిలచింది. ఆంధ్రప్రదేశ్‌ త్రిలింగం అనడానికి మూలమైనా త్రిలింగాలలో ద్రాక్షారామలింగం ఒకటి. 

ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చెబుతారు. ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి కావడం విశేషం. 

జగద్గురు శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన ఈ శక్తి స్వరూపిణి మాణిక్యాంబాలయం, స్వయంభూ భీమేశ్వరాలయం యొక్క విశిష్ఠత చేరి కొలవవలెనే గాని చెప్పనలవికాదు. శివోహం !

🌻. స్థలపురాణం : 
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. 

సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. 

ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. 

లోక కల్యాణం కోసం తారకాసురుడిని సంహరించ వలసిన బాధ్యత కుమారస్వామికి అప్పగించడం జరిగింది. 

తారకాసురుడి హృదయ స్థానంలో వున్న శివుడి అమృత లింగాన్ని కుమారస్వామి తన 'శక్తి' ఆయుధంతో ఛేదించడంతో, ఆ అమృత లింగం అయిదు ముక్కలై వివిధ ప్రదేశాల్లో పడింది. ఆ అయిదు భాగాలు పడిన ప్రదేశాల్లోనే దేవతలు వాటిని ప్రతిష్ఠించగా అవి 'పంచారామాలు'గా ప్రసిద్ధి చెందాయి.

ఇక కాశీ నుంచి బహిష్కరించబడిన వ్యాసుడు, దక్షిణ ప్రాంతానికి చేరుకొని అగస్త్య మహర్షితో కలిసి ఇక్కడి భీమేశ్వరుడిని పూజించాడట. ఈ దేవాలయానికి చుట్టుపక్కల కనిపించే సోమేశ్వర ఆలయాలు చంద్రుడు ప్రతిష్ఠించినవిగా చెబుతారు.

🌷. మరిన్ని విశేషాలు : 

🌻. ద్రాక్షారామంలో 'భీమేశ్వర స్వామి'ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది. 

🌻. ఇక ఇప్పుడున్న మాణిక్యాంబాదేవి విగ్రహాన్ని ఆది శంకరుల వారు ప్రతిష్ఠించి పూజించినట్టుగా ఆధారాలు వున్నాయి. 

🌻 · ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు. ఇవి అంతర్వాహినులు. 

🌻 · ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు.

🌻· గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు.

🌻· ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట.

🌻 · ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో.

🌻 · ఇంకా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి, రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి, కైలాస గణపతి దర్శనీయ దేవతా మూర్తులు.

🌻· ఏక శిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.

🌻 · అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment