🌷. శ్రీ శివ మహా పురాణము - 101 🌷

🌷. శ్రీ శివ మహా పురాణము - 101 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. విద్యేశ్వర సంహితా 🌴 
అధ్యాయము - 25
🌻. రుద్రాక్ష మహాత్మ్యము - 1 🌻

సూత ఉవాచ |

శౌనకర్షే మహాప్రాజ్ఞ శివరూప మహాపతే | శృణు రుద్రాక్ష మహాత్మ్యం సమాసాత్కథయామ్యహమ్‌ || 1

శివప్రియతమో జ్ఞేయో రుద్రాక్షః పరపావనః | దర్శనాత్‌ స్పర్శనాజ్ఞాప్యాత్సర్వ పాపహరస్స్మృతః || 2

పురా రుద్రాక్ష మహిమా దేవ్యగ్రే కథితో మునే | లోకోపకరణార్థాయ శివేన పరమాత్మనా || 3

సూతుడిట్లు పలికెను -

శౌనక మహర్షీ! నీవు గొప్ప జ్ఞానివి. శివ స్వరూపడవు. గొప్పవారిలో గొప్పవాడివి. నేను రుద్రాక్ష మహిమను సంగ్రముగా చెప్పెదను వినుము (1). 

మిక్కిలి పవిత్రమగు రుద్రాక్ష శివునకు ఎంతయూ ప్రియమైనది. రుద్రాక్షను చూచినా, స్పృశించినా, మాలతో జపము చేసినా పాపములన్నియు తొలగునని ఋషులు చెప్పిరి. (2). 

ఓ మహర్షీ! పూర్వము శివపరమాత్మ లోకోప కారము కొరకై పార్వతీ దేవికి రుద్రాక్ష మహిమను చెప్పియున్నాడు (3).

శృణు దేవి మహేశాని రుద్రాక్ష మహిమాం శివే | కథయామి తవ ప్రీత్యా భక్తానాం హితకామ్య యా|| 4

దివ్య వర్ష సహస్రాణి మహేశాని పునః పురా | తపః ప్రకుర్వతస్త్రస్తం మనస్సంయమ్య వై మమ || 5

స్వతంత్రేణ పరేశేన లోకోపకృతి కారిణా | లీలయా పరమేశాని చక్షురున్మీలితం మయా || 6

పుటాభ్యాం చారు చక్షర్భ్యాం పతితా జలబిందవః | తత్రాశ్రు బిందవో జాతా వృక్షా రుద్రాక్ష సంజ్ఞ కాః || 7

ఓ మహేశానీ!దేవీ!శివే! భక్తుల హితమును గోరి, నేను నీకు ప్రీతితో రుద్రాక్ష మహిమను చెప్పెదను వినుడు (4). 

ఓ మహేశ్వరీ! పూర్వము నేను వేలాది దివ్య సంవత్సరములు సంయమముతో తపస్సు చేయుచుండగా, నామనస్సు భయపడినది (5) 

హే పరమేశ్వరి! పరమేశ్వరుడు, స్వతంత్రుడు, లోకములకు ఉపకారమును చేయువాడునగు నేనులీలగా నేత్రములను తెరచితిని (6). 

సుందరమగు ఆ నేత్ర పుటముల నుండి నీటి బిందువులు జారినవి. ఆ కన్నీటి బిందువులే రుద్రాక్ష అను పేరు గల వృక్షములైనవి (7).

స్థావరత్వమను ప్రాప్య భక్తాను గ్రహకారణాత్‌ | తే దత్తా విష్ణు భక్తే భ్యశ్చతుర్వర్ణేభ్య ఏవ చ || 8

భూమౌ గౌండోద్భవాంశ్చక్రే రుద్రాక్షాన్‌ శివవల్లభాన్‌ | మథురాయామయోధ్యాయాం లంకాయాం మలయే తథా || 9

సహ్యాద్రౌ చ తథా కాశ్యాం దశేష్వన్యేషు వా తథా | పరానసహ్యాపాపౌఘభేదనాన్‌ శ్రుతినోదనాన్‌ || 10

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శ్శూద్రా జాతా మమాజ్ఞయా | రుద్రాక్షాస్తా పృథివ్యాం తు తజ్జాతీయాశ్శుభాక్ష కాః || 11

ఆ కన్నీటి బిందువులు భక్తుల అనుగ్రహము కొరకై వృక్షరూపమును పొందినవి. ఆ రుద్రాక్షలను శివుడు విష్ణు భక్తులకే గాక సర్వవర్ణముల వారికి ఇచ్చెను (8). 

శివునకు ప్రీతికరములగు రుద్రాక్షలు భూలోకములో గౌడ దేశమునందు పుట్టినవి. శివుడు వాటిని మథుర, అయోధ్య, లంక, మలయ (9) 

సహ్య పర్వతములు, కాశీ మాత్రమే గాక, ఇంకనూ, పది స్థానములలో లభ్యమగునట్లు చేసెను. వేద సమ్మతములగు రుద్రాక్షలు శ్రేష్ఠమైనవి, సహింప శక్యము కాని పాప సమూహములను నశింపజేయును (10). 

నా ఆజ్ఞచే ఈ శుభకరములగు రుద్రాక్షలు భూలోకములో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర అనే నాల్గు భేదములతో ప్రవర్తిల్లుచున్నవి (11).

శ్వేతరక్తాః పీతకృష్ణా వర్ణా జ్ఞేయాః క్రమాద్బుధైః | స్వజాతీయం నృభిర్ధార్యం రుద్రాక్షం వర్ణతః క్రమాత్‌ || 12

వర్ణైస్తు తత్ఫలం ధార్యం భుక్తిముక్తి ఫలేప్సు భిః | శివభక్తైర్విశేషేణ శివయోః ప్రీతయే సదా || 13

ధాత్రీఫల ప్రమాణం యచ్ఛ్రేష్ఠమేతదుదాహృతమ్‌ | బదరీఫల మాత్రం తు మధ్యమం సంప్రకీర్తితమ్‌ || 14

అధమం చణమాత్రం స్యాత్ర్పక్రియైషా పరోచ్యతే | శృణు పార్వతి సుప్రీత్యా భక్తానాం హితకామ్యయా || 15

రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అను నాల్గు రంగులు గలవు. మానవులు తమకు యోగ్యమైన రంగు గల రుద్రాక్షలను స్వీకరించి ధరించవలెను (12). 

భుక్తిని, ముక్తిని, గోరు శివభక్తులు పార్వతీ పరమేశ్వరుల ప్రీతి కొరకై ఆయా వర్ణముల రుద్రాక్షలను ధరించవలెను (13).

 పెద్ద ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్ష ఉత్తమమనియు, రేగిపండు ప్రమాణము గలది మధ్యమమనియు (14), 

సెనగగింజ ప్రమాణముగలది అధమమనియు వ్యనస్థ గలదు. ఓ పార్వతీ! భక్తుల హితమును గోరి నేను చెప్పే విషయమును ప్రీతితో వినుము (15).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment