🌹. ఋగ్వేద సంహిత వచనము - 57 🌹

🌹. ఋగ్వేద సంహిత వచనము - 57 🌹 
✍️. రచన : దాశరధి రంగాచార్య
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ
 
🌻. మండలము 1, అధ్యాయము 4, అనువాకము 10, సూక్తము - 12 🌻
🌴 56వ సూక్తము 🌴

ఏబది ఆరవ సూక్తము, ఋషి-సవ్యుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-జగతి.

    1. యజమాని చమసములలో సోమరూపములగు అన్నములను ఉంచినాడు. మగ గుఱ్ఱము ఆడు గుఱ్ఱమును చేరదీసినట్లు ఇంద్రుడు ఆ సోమములను అందుకున్నాడు. బంగారు రథము నెక్కినాడు. సర్వకార్య సాధకము అగు సోమమును త్రావినాడు.

    2. ధనము కోరిన వర్తకులు యానమునకు సంద్రమును ఆశ్రయింతురు. స్తోత్రము చేయు యాజకులు సర్వవ్యాపకుడయిన ఇంద్రుని ఆశ్రయింతురు. స్తోత్రా ! వృద్ధి కలిగించువాడును, యజ్ఞపతియు అయిన ఇంద్రుని స్తోత్రము చేయుడు. స్త్రీలు, పూలు, పండ్లకొఱకు పర్వతమును ఆశ్రయింతురు. అట్లే ఇంద్రుని స్తుతులతో ఆశ్రయింపుడు.

    3. ఇంద్రుడు ఇనుప కవచము తొడిగినాడు. శాత్రవులను దూలించినాడు. సోమము త్రావినాడు. మత్తెక్కినాడు. తన బలమును సర్వమును శోషింప చేసినాడు. మాయావులను సంకెలలందు ఇరికించినాడు. ఇంద్రుని దోషరహితమయిన బలము యుద్ధములందు పర్వత శిఖరమువలె ప్రకాశించుచున్నది.

    4. ఇంద్రుని బలమునకు ఎదురులేదు. అతడు తిమిర రూపుని వధించినాడు. యాజకులు ఇంద్రుని బలము వర్ధిల్లుటకు స్తోత్రపాఠములు చేసినారు. అవి సూర్యుడు ఉషస్సును చేరినట్లు ఇంద్రుని చేరినవి. అపుడు ఇంద్రుని శత్రువులు హింసలు అనుభవించినారు.

    5. జలములు నాశరహితములు. ప్రాణాధారములు. వాటిని వృత్రుడు మూసిపెట్టినాడు. ఇంద్రుడు జలములను విడిపించినాడు. ద్యులోకమున నిలిపినాడు. ధనార్థమయిన యుద్ధమున హర్షోల్లాసమున ఇంద్రుడు వృత్రుని కొట్టినాడు. అప్పుడు ఇంద్రుడు మేఘములను అధోముఖముగ వర్షింపచేసినాడు.

    6. ఇంద్రా ! జలము భూమికి ఆధారభూతము. ఆ జలమును నీవు ద్యులోకమున ఉండి ధరించుచున్నావు. నీవు సోమము సేవించినావు. మదమెక్కినావు. వృత్రుని శిలతోబద్దలు కొట్టినావు. వర్షము కలిగించుచున్నావు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment