శ్రీ శివ మహా పురాణము - 410


🌹 . శ్రీ శివ మహా పురాణము - 410🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 22

🌻. పార్వతీ తపోవర్ణనము - 5 🌻


గొప్పవారిని, ధర్మవృద్ధులను చేరి నమస్కరించుట శ్రేయోదాయకమని పెద్దలు చెప్పెదరు. తపస్సునకు కొలత లేదు వివేకులు సర్వదా ధర్మమును ఆదరించవలెను గదా! (63) ఈమె చేయు తపస్సును గురించి విని, చూచి ఇతరులు తపస్సును ఏల కొనసాగించు చున్నారు? ఈమె తపస్సు కంటె అధికమగు తపస్సు ఇంతకు ముందు లోకములో లేదు. ఈ పైన ఉండబోదు (64)

వారందరు ఇట్లు పలుకుచూ పార్వతి యొక్క తపస్సును అధికముగా ప్రశంసించి ఆనందముతో తమ స్థానములకు వెళ్లిరి. రాటు దేలిన దేహము గల వారు గూడా ఆమె తపస్సునకు విస్తుపోయిరి (65).

ఓ మహర్షీ! ఆమె తపస్సు యొక్క మహిమను మరియొక దానిని ఇప్పుడు చెప్పెదను. వినుము. జగన్మాతయగు పార్వతి యొక్క ఆ గొప్ప తపస్సు పరమాశ్చర్యమును కలిగించును (66). ఆమె ఆశ్రమము వద్దకు వెళ్లిన జంతువులు సహజవిరోధము కలవి కూడా ఆ తపః ప్రభావముచే విరోధమును వీడి జీవించినవి (67).

ఆమె యొక్క మహిమచే గోవులకు నిత్య విరోధియగు సింహము ఇత్యాది క్రూర మృగములు ఇతర మృగములను బాధించుటను మానివేసినవి. మృగములయందు కూడ రాగద్వేషాది దోషములు అదృశ్యమైనవి (68).

ఓ మహర్షీ! పిల్లి ఎలుక మొదలగు సహజవైరముగల ఇతర జంతువులు గూడ అచట ఏకాలముమందైననూ వికారమును పొందకుండా జీవించెను (69). అచటి చెట్లు పండ్లను కాయుచుండెడివి. పశువులకు పచ్చగడ్డి సమృద్ధిగ నుండెను. రంగు రంగుల పువ్వులతో ఆ స్థలము ప్రకాశించెను. ఓ మహర్షీ! (70).

ఆ కాలములో ఆమె తపస్సు యొక్క సిద్ధియే వనరూపమును దాల్చినదా యన్నట్లు, ఆ వనము అంతయూ కైలాసమును బోలి ప్రకాశించెను (71).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతి ఖండలో పార్వతీ తపోవర్ణనమనే ఇరువది రెండవ అధ్యయము ముగిసినది (22).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Jun 2021

No comments:

Post a Comment