గీతోపనిషత్తు -210
🌹. గీతోపనిషత్తు -210 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 1, 2
🍀 1. జిజ్ఞాస - అర్జునుడి వలె మానవు లందరును సహజముగ నరులే. నశింపనివారే. అక్షరులే. కాని మనస్సను కక్ష్యలో నివాస స్థాన మేర్పరచుకొనుట వలన మానవులైనారు. శాశ్వత స్థితి నుంచి, అశాశ్వతము, చపలము అగు కక్ష్యలో స్థిరపడినారు. మరల మనస్సును చపలమగు కక్ష్య నుండి బుద్ధియను కక్ష్యలోనికి మానవుడు జిజ్ఞాసువై ఎదగదలచినపుడు ప్రశ్నలు సహజముగ అతని నుండి జనించును. గీత యందు అర్జునుడు జిజ్ఞాసువు. శ్రీకృష్ణుడు సద్గురువు. 🍀
కిం తర్ర్బహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ
అదిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే || 1
అధియజ్ఞం కథం కో-త్ర దేహే2 స్మి న్మధుసూదన |
ప్రయాణకాలే చ కథం భ్రయో2 సి నియతాత్మభిః || 2
1. ఓ పురుషోత్తమా! ఏది బ్రహ్మము? ఆధ్యాత్మ మనగానేమి? కర్మమేది? అధిభూతమనగా నేమి? అధి దైవమనగా నేమి?
2. ఈ దేహమందు అధియజ్ఞ మేది? నియతాత్మలయందు ప్రయాణ కాలమున తెలియబడునదేది?
శ్రీ కృష్ణుడు జ్ఞాన విజ్ఞానములను విపులముగా వివరించిన పిదప అర్జునుని యందు ఏడు (7) ప్రశ్నలు పుట్టినవి. వానికి భగవానుడు తెలిపిన సమాధానము 'అక్షర పరబ్రహ్మ యోగము'గ, ఎనిమిదవ అధ్యాయముగ కీర్తింపబడు చున్నది. ఆ ఏడు ప్రశ్న లీవిధముగ నున్నవి.
1. బ్రహ్మ మనగా ఏమి?
2. అధ్యాత్మ మనగా నేమి?
3. అధిదైవ మనగా నేమి?
4. అధిభూత మనగా నేమి?
5. కర్మ మనగా నేమి?
6. ఈ దేహమందు అధియజు డెవరు?
7. ప్రయాణ కాలమున నియతాత్మలు దేనిని తెలుసుకొను చున్నారు?
అర్జునుడు నరుడగుటచే, మానవుడుగ నుండుటచే మానవుల కొరకు దైవము నుండి పై తెలిపిన అంశములకు సూటిగ సమాధానము పొందినాడు. వ్యాస మహర్షి భగవానుని పలుకులను పదిలపరచి మానవజాతి కందించెను. మానవులు నరులగుటచే భగవదుపదేశము.
అనగా మనసున యున్న మానవుడు తనను తాను నశింపనివాడుగ, అక్షరుడుగ, నరుడుగ తెలియుటయే ఆశయముగ భగవద్బోధ సాగినది. అర్జునుడివలె మానవు లందరును సహజముగ నరులే. నశింపనివారే. అక్షరులే. కాని మనస్సను కక్ష్యలో నివాస స్థాన మేర్పరచుకొనుట వలన మానవులైనారు. శాశ్వత స్థితి నుంచి, అశాశ్వతము, చపలము అగు కక్ష్యలో స్థిరపడినారు.
మరల మనస్సును చపలమగు కక్ష్య నుండి బుద్ధియను కక్ష్యలోనికి మానవుడు జిజ్ఞాసువై ఎదగదలచినపుడు పై తెలిపిన ప్రశ్నలు సహజముగ అతని నుండి జనించును. గీతయందు అర్జునుడు జిజ్ఞాసువు. శ్రీకృష్ణుడు సద్గురువు. అర్జును డడిగిన ప్రశ్నలకు వాత్సల్యముతో శ్రీకృష్ణుడిట్లు సమాధాన మిచ్చుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment