🌹 జగత్సంబంధమైన దుఃఖం బారి నుండి తప్పించుకునే మార్గం - సాంఖ్యం 🌹
జగత్తును మనం దానికున్న ధర్మాల రీత్యా అనేకరకాలుగా వర్ణిస్తుంటాం. అందులో ఒకటి ‘జగత్తు త్రిగుణాత్మకం.’ మరోటి ‘జగత్తు శక్తిమయం’.
జగత్తు త్రిగుణాత్మకం అన్నవర్ణనను అనుసరించి సాంఖ్యమార్గం ఏర్పడింది. జగత్తు శక్తిమయం అన్నవర్ణనను అనుసరించి యోగమార్గం ఏర్పడింది.
సాంఖ్యమార్గపు మూలసూత్రం ‘జగత్తు త్రిగుణాత్మకం’. అంటే ఈ ప్రపంచం సత్వము, రజస్సు, తమస్సు అనే పరస్పరవిరుద్ధమైన, పరస్పరం సంఘర్షించుకునే మూడు గుణాలతో కూడుకుని ఉంటుంది. ఈ మూడు గుణాలలో ప్రతీ ఒకటీ కూడా జగత్తులో తనదైన ఓ ప్రత్యేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
ఈ మూడు గుణాల మధ్యన జరిగే సంఘర్షణలో ఏదో ఒక దానికి ఆధిక్యం లభించినపుడు అది తనకు విరుద్ధంగా ఉన్న మిగతా రెండు గుణాలనూ అణచివేసి తనదైన ప్రభావాన్ని జగత్తులో వ్యాప్తి చేస్తుంది. అది జగత్తులో దుఃఖానికి కారణమౌతుంది. ఎందుకంటే గుణసంబంధమైన లేక జగత్సంబంధమైన ప్రభావం ఏదైనప్పటికీ అది దుఃఖ మయమే.
జగత్తు, త్రిగుణాలు అనేవాటిని మనం రెండువిధాలుగా అర్థం చేసుకోవలసి ఉంటుంది.
ఒకటి అఖండదృష్టి , మరొకటి ప్రాతినిథ్య దృష్టి.
త్రిగుణాలు సమతుల్యతను కోల్పోవడం వలన ఈ చరాచర సృష్టి ఉనికిలోనికి వస్తుంది. అవి సమతుల్యతలో ఉన్నంతకాలం ఈ సృష్టి లేక ఈ జగత్తు లయస్థితిలోనే ఉంటుంది. జగత్తు మరియు త్రిగుణాలయొక్క అఖండ స్థితిలో జరిగే ఈ పరిణామాలలో మనకెట్టి ప్రమేయం లేదు. ఇది మానవాతీతంగా జరిగే ప్రక్రియ.
త్రిగుణాలు అఖండరూపంగా ఉండటమేకాక ఈ లోకంలో మనం ఆచరించే అన్ని కర్మలలోనూ తమ ప్రాతినిథ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కర్మలగురించి మాట్లాడేటపుడు కూడా మనం జగత్తు మరియు త్రిగుణాలనే మాటలనే ఉపయోగిస్తాము.
త్రిగుణాలు సమతుల్యత కోల్పోయినపుడు అఖండ స్థాయిలో ఈ చరాచర సృష్టి ఉనికిలోనికి వస్తే ప్రాతినిథ్య స్థాయిలో దుఃఖం ఉనికిలోనికి వస్తుంది.
త్రిగుణాల మధ్యన సమతుల్యత నెలకొన్నపుడు అఖండ స్థాయిలో సృష్టి లయమైపోతే ప్రాతినిథ్య స్థాయిలో దుఃఖం అంతరించిపోతుంది.
అలాకాక గుణాల మధ్యన జరిగే ఈ సంఘర్షణలో ఏ ఒక్కదానికీ ఆధిక్యం లభించకుండా మూడింటికీ సమప్రాధాన్యతను కల్పించినట్లైతే పరస్పరవిరుద్ధమైన ఈ మూడు గుణాలూ –బలాబలాల సమతూకం (Balance of Powers) వలన– ఒకదాన్నొకటి న్యూట్రల్ చేసుకుంటాయి. దానితో జగత్తు ప్రభావరహితమౌతుంది. అప్పుడు జగత్తుకు అతీతమైన అంటే గుణాలకు అతీతమైన (గుణాతీత) స్థితి ఏర్పడుతుంది. సంసారబంధం తొలగిపోతుంది. దుఃఖం నశిస్తుంది.
ఆత్మానుభవం అన్నా కూడా ఇదే! భారతీయ ఇతిహాస పురాణాలలో సాంఖ్యతత్వం గురించి చర్చించేటపుడు ఎక్కువగా ఆత్మ గురించే వర్ణన జరగడానికి కారణం ఇదే. భగవద్గీత రెండవ అధ్యాయంలో ఆత్మ వర్ణన జరిగిన తరువాత "పార్థా ! ఇంతవరకూ నీకు సాంఖ్యమతానుసారం ఆత్మతత్వం గురించి చెప్పాను. " అని శ్రీ కృష్ణుడు అంటాడు.
ఇక్కడ సంసారం అంటే జగత్తు అనే అర్థమే తప్ప దారాపుత్రుల పోషణతో కూడుకున్న వైవాహిక జీవితం అని కాదు. అది బాధ్యతలను మోయలేని అసమర్థత మూలంగా వాటినుండి తప్పించుకోవాలని చూచే పిరికివారు కల్పించిన అర్థం మాత్రమే.
ప్రపంచంలోని దుఃఖాన్ని నివారించడం కొరకు సాంఖ్యమార్గం ఈ ఉపాయాన్నే అనుసరిస్తుంది.
అయితే జగత్తులోని ఈ మూడు గుణాలకూ సమప్రాధాన్యత కల్పించడం ఎలా?
సర్వకర్మలూ త్రిగుణాల వలనే జరుగుతున్నాయని ఉపనిషత్సారమైన గీతావాక్యం. అంటే సర్వకర్మలూ త్రిగుణాలకే ప్రాతినిథ్యం (Representation) వహిస్తున్నాయని అర్థం.
దీనినిబట్టి ప్రాపంచిక కర్మలన్నింటిలోనూ త్రిగుణాలకు ప్రాతినిథ్యం ఉన్నది అని మనకు అర్థమవుతున్నది.
జగత్తులోని గుణాలు లెక్కకు మూడే ఐనప్పటికీ ఒక్కొక్కదాని అభివ్యక్తీకరణ అనంతరూపాలలో ఉండి జగత్తంతా పైకి చాలా సంక్లిష్టంగా కనిపిస్తుంది. గుణం యొక్క ఈ అభివ్యక్తీకరణ కర్మ రూపంలో ఉంటుంది. ఈ కారణంగానే సర్వకర్మలూ త్రిగుణాలవలనే జరుగుతున్నాయని గీతలో పేర్కొనడం జరిగినది. ఒక గుణం యొక్క ఏ అభివ్యక్తీకరణ అయినా కూడా మిగతా రెండు గుణాలలో కూడా తన అనురూపాలను కలిగి ఉంటుంది. అంటే జగత్తులోని కర్మసంబంధమైన ఏ విషయమైనా కూడా త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే మూడు అనురూపకర్మలుగా ఉంటుంది.
ఉదాహరణకు వాతావరణానికి సంబంధించి ఎండ, వర్షం, చలి అనేవి త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే మూడు అనురూపకర్మలు.
అలాగే క్రమశిక్షణకు సంబంధించి అదుపు, స్వేచ్ఛ, ఉపేక్ష అనేవి అనురూపకర్మలు.
త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అనురూప కర్మలు మూడింటికీ సమప్రాధాన్యత ఏర్పడితే త్రిగుణాలకు సమప్రాధాన్యత ఏర్పడినట్లే.
త్రిగుణాల పరిధిలోకి రాని కర్మలు ఎక్కడా ఉండవు కనుక మనం ఈ లోకంలో కర్మాచరణకు ఉపక్రమించిన ప్రతీసారీ మూడు గుణాలకు ప్రాతినిథ్యం వహించే మూడు అనురూప కర్మలలో ఏదో ఒక దానిని తప్పనిసరిగా ఎంచుకోవలసి వస్తుంది. అటువంటపుడు ప్రతీ సందర్భంలోనూ ఏదో ఒక గుణానికి ప్రాతినిథ్యం వహించే కర్మకే ప్రాధాన్యతనీయక సందర్భౌచిత్యాన్ని అనుసరించి ఒక్కొక సందర్భంలో ఒక్కొక గుణానికి ప్రాతినిథ్యం వహించే అనురూపకర్మకు ప్రాధాన్యతనిచ్చినట్లైతే మన జీవితంలో మూడు గుణాలకూ సమప్రాథాన్యత ఏర్పడుతుంది.
దీనినిబట్టి జగత్తును తిరస్కరించడం కాక దానిలోని వైరుధ్యాల యెడల సమదృష్టిని కలిగి ఉండి వాటన్నింటికీ సమ ప్రాధాన్యతనీయడమే జగత్సంబంధమైన దుఃఖం బారినుండి తప్పించుకునే మార్గమని, అదే సాంఖ్యమని మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రాచీన భారతదేశంలో ఆయుర్వేద వైద్యవిధానం ఈ సాంఖ్యమార్గాన్ని అనుసరించే అభివృద్ధి చేయబడింది. దీనిప్రకారం మానవ శరీరంలో త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే మూడు అనురూపకర్మలు వాతం, పిత్తం, కఫం అనబడే త్రిదోషాల రూపంలో ఉంటాయి. ఈ దోషాలు మూడు కూడా సమపరిమాణంలో, సమతుల్యతతో ఉన్నంత కాలం అవి ఒకదాన్నొకటి ప్రభావరహితం చేసుకుంటూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆ సమతుల్యత చెడిపోయి ఏ దోషమైనా మిగతా రెంటికన్నా ఎక్కువైనపుడు ఆదోషానికి సంబంధించిన అనారోగ్యం శరీరంలో తలయెత్తుతుంది. ఆ దోషాన్ని తగ్గించి మిగతా రెంటితో సమస్థితికి తెచ్చే విధానమే ఆయుర్వేదం.
ఈ విధమైన సాంఖ్యమార్గపు ఎత్తుగడను మనం ఈ ప్రపంచంలో ఏ సమస్యకైనా అనువర్తింపచేయవచ్చు.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్
No comments:
Post a Comment