సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 19

🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 19 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ


🍃. సాధనా చతుష్టయము - 1 🍃

94. యోగ విద్య యందు సాధకునికి నాలుగు రకములైన సాధన సంపత్తులు అవసరము.
1. నిత్యానిత్య వస్తు వివేకము.
2. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము.
3. శమ దమాది షట్‌ సంపత్తి.
4. ముముక్షత్వము


95. నిత్యానిత్య వస్తు వివేకమనగా ప్రపంచమంతయు మాయయని, నశ్వరమని, ఆత్మ ఒక్కటె నిత్యమని, నాశరహితమని భావించుట.

96. ఇహా ముత్రార్థ ఫల భోగ విరాగము అనగా ఇహలోక, స్వర్గలోక సుఖములందు వైరాగ్యము.

97. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, భక్తి అను ఆరింటిని షట్‌ సంపత్తి అంటారు.
1. శమమనగా: అంతరింద్రియ నిగ్రహము, నిశ్చల సమాధి.
2. దమమనగా: బాహ్యేంద్రియ నిగ్రహము, విరక్తి వైరాగ్యములు.
3. ఉపరతి అనగా అరిషడ్వర్గములను జయించుట, విషయాసక్తి వీడుట.
4. తితీక్ష అనగా సుఖఃదుఃఖములను ఓర్చుకొనుట, విషయ సమత్వము.
5. శ్రద్ధ అనగా గురువు యందు వేదాంత వాక్యములందు నమ్మకము కలిగి శ్రవణము, విచారణ చేయుట.
6. భక్తి అనగా గురువులను పూజించుట. శుశ్రూష చేయుట.

98. ముముక్షత్వము అనగా మోక్షము పొందుట యందు అభిలాష కలిగి అందుకు తగిన సాధన, యోగాభ్యాసము చేయుట, గురువులను ఆశ్రయించుట, శ్రవణాదులు చేయుట.

99. దివ్య దృష్టి గురువు ద్వారానూ, భగవంతుని అనుగ్రహము ద్వారాను పొందవచ్చు. అభ్యాసంతో దివ్యదృష్టిని అనగా జ్ఞాన నేత్రములను(మూడవ కన్ను) పొందవచ్చు. దీని వలన ఆత్మానుభూతి పొందవచ్చు. వ్యాసుడు సంజయునకు, శ్రీకృష్ణుడు అర్జునునకు, బ్రహ్మంగారు సిద్థయ్యకు దివ్య దృష్టిని ప్రసాదించిరి.

జ్ఞానంతో పాటు దివ్య దృష్టి ఉన్నప్పుడు సుదూర ప్రాంతపు దృశ్యములను కూడా దర్శించవచ్చు. బ్రహ్మాండములోని దృశ్యములలో, భవిష్యత్తు సంఘటనలు దివ్య దృష్టి ద్వారా తెలుసుకోవచ్చు. ఈ శక్తిని నిరంతర యోగ సాధన ద్వారా పొందవచ్చు. జనుల మనస్సులోని విషయములు గ్రహించవచ్చు. ఉత్తమమైన అనన్య యోగులు ఈ శక్తిని పొందగలరు. కాని ఇవన్నీ మోక్షమునకు ప్రతిబంధకము.

100. యోగసిద్ధి: ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేక శాశ్వతమైన పరబ్రహ్మరూపములోనే లయించి యుండును. అట్టి వారే యోగసిద్ధిని పొందినట్లు.

అందుకు కోరికలు త్యజించవలెను. మనస్సును నిగ్రహించవలెను. ఆత్మ స్థితి యందు సర్వమును లయించవలెను. అట్టి యోగికి పునర్జన్మలేదు. సంకల్పరహితుడు మనస్సును ఆత్మ యందు లయించి యుండును. శాంతిని పొందును. సమదృష్టి కల్గి సర్వ జీవరాశులు పరబ్రహ్మ స్వరూపమే అని జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని గ్రహించును.

101. యోగము సిద్ధించాలంటే దృఢ సంకల్పము, సాధన, వైరాగ్యము, సాధనాఫలితముల కొరకు చూడకుండా సాధన నిరంతరము కొనసాగించుట. భౌతిక తాపత్రయములు వదలివేయుట. సుఖ దుఃఖములకు అతీతుడై ఉండుట. ఇంద్రియ నిగ్రహము, వాసనాక్షయము, భోగరాహిత్యము కలిగి ఉండుట. అట్టి వారే యోగసిద్ధిని పొందగలరు. వారినే యోగారూఢులందురు.

102. ఉత్తమ యోగి అయినవాడు నిరంతరము భగవంతుని యందు ఆత్మను లయింపజేయుట, శ్రద్ధ, దైవచింతన కల్గి ఉండును.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment