🌹. గీతోపనిషత్తు - 68 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 6. వాగ్దానము - దైవము దిగి వచ్చినప్పుడు, అధర్మమును పరిపూర్ణముగ నిర్మూలించుట ఎప్పుడును జరుగదు. ధర్మాధర్మములు సృష్టి తక్కెడల వంటివి. తూకమునకు రెండు తక్కెడలును అవసరమే. దైవము హెచ్చుతగ్గులనే సరిచేయును తప్ప అధర్మమును పరిపూర్ణముగ సృష్టినుండి తొలగజేయునని తలచరాదు. 🍀
📚. 4. జ్ఞానయోగము - 7 📚
యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత |
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజా మ్యహమ్ || 7
ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి యగు చుండునో, అపుడు నన్ను నేనే సృష్టించుకొందునని భగవంతుడు తెలిపినాడు. ఇది భగవంతుని వాగ్దానము.
సృష్టితో పాటు సృష్టి ధర్మమును కూడ దైవ మేర్పరచినాడు. ధర్మమునకు గ్లాని కలిగినపుడెల్ల తానవతరించి ధర్మమును చక్కబెట్టుదునని తెలిపినాడు. ధర్మమే సృష్టికి ఆధారము.
ద్వంద్వములు కూడ సృష్టిధర్మమే. ద్వంద్వములు లేనిదే సృష్టిలేదు. వెలుగు లోకములు కలవు. చీకటి లోకములు కూడ కలవు. సురలు గలరు. అసురులు కూడ గలరు. జ్ఞానము కలదు. అజ్ఞానము కూడ కలదు. ఇట్లెన్నియో ద్వంద్వములు సృష్టిని సమతూకముగ నుంచును. ఇవి అన్నియు సృష్టి ధర్మములే.
ఇందొకటి నిర్మూలించినచో రెండవది కూడ నిర్మూలింపబడును. కావున దైవము దిగి వచ్చినప్పుడు, అధర్మమును పరిపూర్ణముగ నిర్మూలించుట ఎప్పుడును జరుగదు. ధర్మాధర్మములు సృష్టి తక్కెడల వంటివి. తూకమునకు రెండు తక్కెడలును అవసరమే. దైవము హెచ్చుతగ్గులనే సరిచేయును తప్ప అధర్మమును పరిపూర్ణముగ సృష్టినుండి తొలగజేయునని తలచరాదు.
శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు వంటి రూపములలో దైవము దిగి వచ్చినప్పుడు ధర్మగ్గానిని సరిదిద్దిరే గాని అధర్మమును సంపూర్ణముగ తొలగింపలేదు. అసురులు, అజ్ఞానము ఎప్పుడూ యుండనే యున్నవి. వాటి స్థానము వాటికున్నది. ఇది సృష్టి ధర్మము.
ఎవరి ధర్మమును వారు పాటించుట దైవమునకు ముఖ్యము. అతిక్రమించినపుడు వానిని సరిజేయును. కాలమునకు ధర్మమున్నది. కృతయుగమున కేవలము ధర్మమే యుండును. అపుడు సృష్టి అంతయు వెలుగు లోకములతోనే నిండియున్నది. త్రేత, ద్వాపర, కలియుగములలో ఒక్కొక్క పాదము (25%) ధర్మము నశించుట జరుగును.
కలియందు ఒక పాదమే ధర్మముండును. మూడు పాదములు అధర్మమే యుండును. అంతకు మించి అధర్మము పెరిగినచో దైవము అవతరించగలడు. దైవము అవతరించనిచో, కాలరీతిని బట్టి అధర్మము మితిమీర లేదని తెలియవలెను.
దైవము యొక్క అవతారములు దిగివచ్చినను, మహా పురుషులు దేహధారులై యున్నను, అధర్మ మెందులకున్నది అని ప్రశ్నించువారు, సందేహ పడువారు పై సత్యమును తెలియవలెను. కాలమును బట్టి ధర్మ ముండును. జనస్రవంతి కాలము ననుసరించి యుండును.
అందువలన ధర్మము ననుసరించు వారు అధర్మమును దూషింపక, ఒద్దికగ జీవించినచో అధర్మము స్పృశించదు. ధర్మ మనుసరించు వారికొరకై మరియొక శోకము చెప్పబడినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05 Nov 2020
No comments:
Post a Comment