శ్రీ శివ మహా పురాణము - 265


🌹 . శ్రీ శివ మహా పురాణము - 265 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

62. అధ్యాయము - 17

🌻.సతీ వరప్రాప్తి - 4 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

నా కుమారుడగు దక్ష ప్రజాపతి ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షీ! నేను చిరునవ్వు నవ్వి ఆతనికి ఆనందమును కలిగించుచూ ఇట్లు పలికితిని (58). హే దక్షా! నేను నీ వద్దకు వచ్చిన కారణమును వినుము. నేను నీ కుమార్తె హితమును గోరుచున్నాను. నీ కోరిక కూడ అదియే (59).

నీ కుమార్తె శివుని ఆరాధించి ఒక వరమును కోరియున్నది. దానికి ఇపుడు సమయము ఆసన్నమైనది (60). శివుడు నన్ను నీ వద్దకు పంపినాడు. ఆయన నీ కుమార్తె కొరకు నన్ను పంపినాడు. నీకర్తవ్యమును, నీకు శ్రేయస్సు కలుగు విధముగా శ్రద్ధగా వినుము (61).

శివుడు వరము నిచ్చి వెళ్లిన నాటినుండియూ నీ కుమార్తె యొక్క వియోగముచే సుఖమును పొందలేకున్నాడు (62). మన్మథుడు పుష్పబాణములన్నింటితో పెద్ద ప్రయత్నమును చేసియూ, ఛిద్రము (దౌర్బల్యము) లభించకపోవుటచే ఏ శివుని జయింపలేకపోయినాడో(63),ఆ శివుడు ఇపుడు కామబాణములచే కొట్టబడకపోయిననూ, ఆత్మ ధ్యానమును వీడి, దుఃఖితుడై ప్రాకృతజనునివలె సతిని ధ్యానించుచున్నాడు (64).

ఆయన వియోగ దుఃఖితుడై గణముల ఎదుట ఆరంభించిన ప్రసంగమును మరిచి 'సతి ఎక్కడ?' అని పలికి నలువైపులా పరికించు చున్నాడు. మరియు నిట్టూర్పులను విడుచుచున్నాడు(65).

కుమారా! పూర్వము నేను, నీవు, మన్మథుడు, మరియు మరీచి మొదలగు మహర్షులు దేనిని కోరిరో, అది ఇప్పుడు సిద్ధించినది (66). నీ కుమార్తె శంభుని ఆరాధించినది. ఆయన ఆమెను ధ్యానించుచూ ఆమెను పొందగోరి ఆమెకు అనుకూలుడై హిమవత్పర్వతమునందున్నాడు (67).

ఆమె నానా విధ భావములతో, సత్త్వగుణశీలియై దృఢవ్రతముతో శంభుని ఏ తీరున ఆరాధించినదో,ఆయన ఆ సతిని అటులనే ఆరాధించుచున్నాడు (68). కావున, శంభుని కొరకు తనువును దాల్చిన దాక్షాయణిని ఆయనకు సమర్పించుము. విలంబమును చేయకుము. అట్లు చేసి నీవు కృతార్థుడవు కమ్ము (69).

నేను నారదుని ద్వారా ఆయనను నీ ఇంటికి రప్పించెదను. నీవు ఆయన కొరకు తనువును దాల్చిన ఈమెను ఆయనకు సమర్పించుము (70). నా కుమారుడగు దక్షుడు నా ఈ మాటను విని, మిక్కిలి సంతసిల్లి, 'అటులనే అగుగాక!'అని నాతో పలికెను (71).

ఓ మహర్షీ! అపుడు లోకకార్యము నందు నిమగ్నుడనైన నేను ఉత్సాహముతో మిక్కిలి ఆనందముతో శివుడు ఉన్న స్థానమునకు వచ్చితిని (72).ఓ నారదా! నేను వెళ్లగానే దక్షుడు భార్యతో , కుమార్తెతో గూడి అమృత పానమును తృప్తిగా చేసిన వాడు వలె పూర్ణమనోరథుడాయెను (73).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో సతీవరప్రాప్తి అనే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment