🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 153 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 27 🌻
192. ఎప్పుడూ కూడా నిర్దుష్టమైనటువంటి పుణ్యమనేది - కేవల పుణ్యం గాని, కేవల శుద్ధమయిన జ్ఞానంగాని- మనుష్యుల్లో ఉండదు. ఈ పాపపుణ్యముల మధ్యనే, వాటి మిశ్రమంలోనే మనుష్యుడు తిరుగుతూ ఉంటాడు. అందుకే, ‘తస్మాత్ జాగ్రత జాద్రత’ – ‘ఎప్పుడూ మెలుకువగా ఉండు’ – అని మన పెద్దలు బోధచేసారు.
193. “ఈ పాపపుణ్యములు నిన్ను వేధిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండు సుమా! తెలివిగా ఉండు, నిద్రపోకు” అని వారి తాత్పర్యం. ఎందుకంటే, పొరపాటు జరిగిపోయిన తరువాత మనం విచారించి లాభంలేదు. స్వర్గమయినా, నరకమయినా ఈ కర్మలవలన ప్రాప్తించాక, శిక్ష ప్రారంభమైన తరువాత, తప్పుచేయకుండా ఉండవలసింది అని అనుకుంటే లాభం ఏమిటి? ఏ తప్పూచేయకుండాఉండే అవకాశం జీవితంలో ఇప్పుడే ఉంది మనకు. ఈ అవకాశం జీవితంలో, ఈ శరీరంలో ఉన్న కాలమేకదా!
194. భవిష్యత్తు అంటే అర్థం – తన జీవుడికి ఉన్న యథార్థమైన, సుధీర్ఘమైన భవిష్యత్తు అని. ఈ శరీరమో అల్పం, మూడునాళ్ళ ముచ్చట. దీనితోపోలిస్తే కొన్నివేల సంవత్సరముల స్థితి జీవుడికి ఉంటుంది. అప్పుడు(శరీరంలేనపుడు) పుణ్యంచేసుకోవటానికి అవకాశం లేదు. కాళ్ళూలేవు, చేతులులేవు, ‘తను’ ఒక్కడే తనతో ఉంటాడు.
195. అలా ఏకాకిగా ఉండేటటువంటి జీవాత్మ, ఏ పుణ్యంచేసుకుని తన దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది? ఏం తపస్సు చేస్తుంది? అప్పుడు పుణ్యం చేసుకోవటానికిగాని, జ్ఞానబోధ చేసేవాడు కాని, మనమధ్యకు వచ్చి చెప్పేవాడు కాని ఎవరున్నారు?.
196. ఆ స్థితిలో జీవుడు క్రియాశూన్యుడు, క్రియారహితుడు కనుక, వ్యర్థుడే అవుతాడు. మానవశరీరంలో ఉన్నటువంటిస్థితిలో, తనకు రాబోయే స్థితిని గురించి చింతించి, ఇప్పుడే దానికికావలసిన పుణ్యం ఎవడు సంపాదించుకుంటాడో, ఏదయితే పాపహేతువో దానిని పరిహరిస్తాడో, అట్టివాడు వివేకిగాని; రాబోయే పదేళ్ళలోనూ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగేవాడు వివేకి ఎట్లా అవుతాడు? రాబోయే ఓ పదేళ్ళో, ముప్ఫయిఏళ్ళో జాతకం ఎట్లాఉందని అడుగుతారు. అంటే, ఆశ, ఏ జ్యొతిష్కుడైనా ఇంకా ముప్ఫైఏళ్ళు బాగా ఉంటుందని చెప్తాడని ఆశ.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/
05 Nov 2020
No comments:
Post a Comment