గీతోపనిషత్తు -169


🌹. గీతోపనిషత్తు -169 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 12

🍀 12. యోగాభ్యాసము - స్థిరమగు ఆసనముపై కూర్చుండి మనస్సును ఇంద్రియ వ్యాపారముల నుండి విరమింప జేసి "తత్" విషయముపై స్థిరముగ నిలుపుట అభ్యాసము చేయవలెను. దానివలన ఆత్మ మనో ఇంద్రియ వ్యాపారముల నుండి శుద్ధి చెంది తానను వెలుగుగ నిలచును. సాధకుని యందు భావ పరంపరలన్నియు ఉపసంహరింప బడినపుడు వానికి మూలమైన వెలుగు తన అంతఃకరణ యందు గోచరించును. కావున అట్లు గోచరించుటకు మనో ఇంద్రియ వ్యాపారములు నియమింప బడవలెను. మనస్సు, ఇంద్రియములు, నియమింప బడ వలె నన్నచో, జీవన విధానమున యమనియమములు పాటింపబడ వలెను. 🍀

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |
ఉపవిశ్యాసనే యుంజ్యా ద్యోగ మాత్మవిశుద్ధయే II 12


స్థిరమగు ఆసనముపై కూర్చుండి మనస్సును ఇంద్రియ వ్యాపారముల నుండి విరమింప జేసి "తత్" విషయముపై స్థిరముగ నిలుపుట అభ్యాసము చేయవలెను. దానివలన ఆత్మ మనో ఇంద్రియ వ్యాపారముల నుండి శుద్ధి చెంది తానను వెలుగుగ నిలచును.

ఈ శ్లోకము ఆత్మసంయమ యోగమునకు కీలక సూత్రము. ఈ అభ్యాసము చేయవలెనన్నచో ముందు తెలిపిన అర్హత లన్నియు సాధకునకు కూడవలెను. అందెట్టి లోపమున్నను ఆత్మ సంయమము అభ్యాసము చేయుటకు వీలుపడదు. ఆత్మ నుండియే బుద్ధియను వెలుగు వ్యక్తమగును.

ఆ వెలుగు ఆధారముగ పంచప్రాణములు, పంచేంద్రియములు, కర్మేంద్రియములు, దేహము ఏర్పడుచుండును. ఆ వెలుగు అంతః కరణమున వ్యాపించి యుండును. ఇన్నిటిలోనికి వ్యాపించినది ఆత్మ వెలుగే.

సూర్యుని నుండి కిరణములు వ్యాపించినట్లుగ ఆత్మనుండి వెలుగు కిరణములు మనస్సు, ఇంద్రియములు, దేహము, బాహ్యములోనికి వ్యాప్తి చెందుచుండును. సూర్య కిరణములు ప్రచండముగ వ్యాప్తి చెందినపుడు సూర్యబింబమును దర్శనము చేయలేము. అట్లే ఇంద్రియ వ్యాపారముల యందు అనేకానేక భావములతో తిరుగాడుచున్న సాధకునకు ఆత్మదర్శనము దుర్లభము.

కిరణములు ఉపసంహరింప బడినపుడు సూర్య బింబము మనోహరముగ గోచరించును. అట్లే సాధకుని యందు భావ పరంపరలన్నియు ఉపసంహరింప బడినపుడు వానికి మూలమైన వెలుగు తన అంతఃకరణ యందు గోచరించును. కావున అట్లు గోచరించుటకు మనో ఇంద్రియ వ్యాపారములు నియమింప బడవలెను. మనస్సు, ఇంద్రియములు, నియమింపబడ వలె నన్నచో, జీవన విధానమున యమనియమములు పాటింపబడ వలెను.

యమనియమములను పాటించుటకు జీవుని స్వభావము అడ్డు తగులుచుండును. స్వభావము అడ్డు తగులకుండుటకై ఈశ్వర ప్రణిధానము నభ్యాసము చేయవలెను. కేవలము ధ్యానముపై ఆసక్తి చాలదని, జీవితమున యమ నియమములు పాటింపనివారు యతచిత్తులు కాలేరని తెలియ వలెను. మనస్సు పరిపరి విధముల పోకుండుటకే యమనియమ ముల అభ్యాసము. అందువలననే ఈ శ్లోకమున “యతచిత్త ఇంద్రియః" అను పదములు సూచింపబడినవి. యయ నియమములు పాటింపబడుట వలన స్వభావము కొంత శాంతపడును.

మనస్సునకు నిలకడ చిక్కును. నిలకడగ నున్న మనస్సును గూర్చియే ఈ శ్లోకమున 'ఉపవిశ్య ఆసనే' అను పదమున తెలియ నగును. మనస్సు నిలకడ చెందినపుడు ఆసనము సిద్ధించినట్లే.

మనసు నిలకడగ నున్నపుడు భావ తీవ్రత యుండదు. చూచినవి, విన్నవి, మాట్లాడినవి, తిన్నవి, స్పృశించినవి, వాసన చూచినవి ఏవియును అట్టి సమయమున కలవర పెట్టవు. దేహమునకు స్థిరమగు ఆసన మేర్పడును.

యోగమున ఆసనము స్థిరముగ నుండుట అనగ మనస్సు, ఇంద్రియములు, శరీరము స్థిరముగ నుండుట. సంచలనము లేక యుండుట. ఒకానొకచో సంచలము గోచరించిన, మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసల పై లగ్నము చేయుటవలన సంచలనము తగ్గును. శ్వాస వేగమును క్రమముగ తగ్గించినకొలది భావవేగము తగ్గును. ప్రశాంతత చిక్కును. శ్వాసయందు మనస్సును లగ్నము చేయుట ముందు అధ్యాయములో తెలుపబడినది.

ఎట్లైనను ఆసనసిద్ధి కలిగిన తరువాతనే మనస్సును భావములు పుట్టు చోటుయందు లగ్నము చేయుటకు వీలు పడును. 'తతైకాగ్రం' అను పదము శ్లోకమున వాడబడినది. “అక్కడ మనసు లగ్నము చేయుట" అని ఆ పద తాత్పర్యము. అక్కడ అనగ ఎక్కడ అను ప్రశ్న పెద్దలచే పరిష్కరింపబడినది. భావములు పుట్టుచోటు అని నిర్ణయింపబడినది. ఆ చోటును దర్శించుటకు సాధకుని మనోప్రజ్ఞ లగ్నము చేయబడుట అభ్యాసముగ ఈ శ్లోకము తెలుపుచున్నది.

ఆ పుట్టు చోటును భ్రూమధ్యమున గాని, హృదయమున గాని దర్శించుటకు ప్రయత్నింప వచ్చును. ఇట్టి ప్రయత్నము చాలకాలము సాగవలెను. అపుడు సాధకుడు మనో నిశ్చలతను బట్టి అంతరంగ ప్రవేశము చేయును. బహిఃకరణముల నుండి అంతఃకరణముల లోనికి ప్రవేశించును.

భ్రూమధ్య కేంద్రము గాని, హృదయ కేంద్రము గాని అంతఃకరణము లోనిదే. అందు ప్రవేశించుట కొరకే అంతర్ముఖముగ మనస్సును లగ్నము చేసి స్థిరపరచుట. అట్లు ప్రవేశించు ప్రయత్నము యోగాభ్యాసము ('యుం' జ్యాత్ యోగం). పై విధమగు వివరములు తెలియక ధ్యానము చేయుట నిష్పయోజనము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


12 Mar 2021

No comments:

Post a Comment