శ్రీ శివ మహా పురాణము - 369


🌹 . శ్రీ శివ మహా పురాణము - 369 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 09

🌻. పార్వతి స్వప్నము - 1 🌻


నారదుడిట్లు పలికెను-

తండ్రీ! వీధీ! నీవు శివభక్తా గ్రేసురుడవు. ప్రాజ్ఞుడవు. అద్భుత మగు గాథను వర్ణించితవి. నా యందు దయను చూపితివి. నాకు అధికమగు ఆనందము వర్ధిల్లినది(1). హే విధీ! దివ్య దర్శుడనగు నేను నా స్థానమునకు మరలి పోయిన తరువాత ఏమయ్యెను? తండ్రీ! దయతో నాకా వృత్తాంతమును ఇప్పుడు చెప్పుము(2)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! నీవు స్వర్గమునకు వెళ్లిన పిదప, కొంతకాలము గడిచిన తరువాత, ఒకనాడు మేన హిమవంతుని సమీపమునకు వచ్చి నమస్కరించెను (3). ఆ హిమవంతుని ప్రియురాలు ప్రాణముల కంటె అధికమగు ప్రేమ కుమరై యందు కలిగి యున్నదై, తన భార్త యగు పర్వత రాజుతో వినయ పూర్వకముగా నిట్లనెను(4).

మేన ఇట్లు పలికెను-

స్త్రీస్వభావము వలన నాకు మహర్షి వాక్యము సరిగా తెలియలేదు. నీవు మన కుమారైకు సుందరుడగు వరునితో వివాహమును చేయుము(5). ఈ వివాహము అన్నివిధములుగా అపూర్వమగు సుఖమును కలిగించునది కావలెను. పార్వతికి మంచి లక్షణములు కలిగి మంచి కులములో పుట్టిన వాడు వరుడు కావలెను. (6). హే ప్రియా! నాకు ప్రాణములతో సమముగా ప్రియమగు నా కుమార్తె సుఖమును పొందవలెను. ఆమె మంచి భర్తను పొంది మిక్కిలి అనందమును పొందు విధముగా చేయుము. నీకు నమస్కారము(7).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు మేన ఇట్లు పలికి కన్నుల నీరు స్రవించుచుండగా భర్త పాదములపై పడెను. ప్రాజ్ఞలలో శ్రేష్ఠుడగు హిమవంతుడు ఆమెను పైకి లేవదీసి యోగ్యమగు తీరులో నిట్లుపలికెను (8).

హిమవంతుడిట్లనెను-

ఓ దేవీ ! మేనా! నేను విమర్శించి యథార్థమును చెప్పుచున్నాను. నీవు వినుము. భ్రమను విడిచి పెట్టుము. మహర్షి వాక్యము ఎన్నటికీ పొల్లు గాదు (9). నీకు అమ్మాయిపై ప్రేమ గలదు గాన, నీవామెకు శ్రద్ధగా శిక్షణ నిమ్ము. ఆమె స్థిరమగు మనస్సుతో భక్తితో శంకరుని అనుగ్రహము కొరకై తపమాచరించవలెను (10). ఓ మేనా! శివుడు ప్రసన్నుడైనచో, కాళికను వివాహమాడ గలడు. సర్వము సుసంపన్నమగును. నారదుడు చెప్పిన అమంగళము మటుమాయమగును (11). అమంగళములన్నియూ సదా శివుని యందు మంగళములుగా మారును. కావున నీవు వెంటనే అమ్మాయి తపస్సు చేసి శివుని పొందు విధముగా శిక్షణ నిమ్ము (12).

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ వాక్యమును విని మేన మిక్కిలి సంతసిల్లెను. అమె కుమారైకు ఉపదేశించి తపస్సు నందు అభిరుచి కలుగ జేయుట కొరకై ఆమె వద్దకు వెళ్లెను (13). సుకుమారమగు కమారై దేహమును చూచి మేన మిక్కిలి దుఃఖించెను. వెను వెంటనే ఆమె కన్నులు నీటితో నిండెను(14). హిమవంతుని ప్రియరాలగు మేన తన అభిప్రాయమును కుమారైతో చెప్పలేక పోయెను. కాని ఆ పార్వతి తల్లి యొక్క అభిప్రాయమును శీఘ్రముగా కనిపెట్ట గల్గెను (15). సర్వజ్ఞురాలు, పరమేశ్వరి యగు ఆ కాలికా దేవి అపుడు వెంటనే తల్లిని అనేక పర్యాయములు ఓదార్చి ఇట్లు పలికెను.(16).

పార్వతి ఇట్లు పలికెను-

తల్లీ! నా మాటను వినుము. నీవు మహాప్రాజ్ఞురాలవు. నిన్న తెల్లవారు జామున బ్రాహ్మ ముహూర్తమునుందు నేను స్వప్నమును గాంచితిని. దానిని చెప్పెదను. దయచేసి వినుము(17). తల్లీ! తపస్వి యగు ఒక విప్రుడు నా యందు దయ గలవాడై ప్రీతి పూర్వకముగా నన్ను శివుని గురించి మంచి తపస్సును చేయుమని ఉపదేశించెను. (18).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


12 Mar 2021

No comments:

Post a Comment