భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 249


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 249 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జడమహర్షి - 4 🌻


18. తల్లి కడుపున పడ్డదిమొదలు మనుష్యుడికి సుఖం లేదు. స్వర్గముకూడా దుఃఖకరమే. ఎందుకంటే, పుణ్యం ఉన్నంత కాలమే స్వర్గప్రాప్తి కలుగుతుంది. పుణ్యం క్షీణించిపోగానే తిరిగి భూలోకప్రాప్తి తప్పదు. భయానికికూడా అది హేతువౌతుంది.

19. అందువల్ల అది సుఖకరం కాదని పెద్దలు చెపుతూంటారు. నరకము ఘోరమైన, తీవ్రమైన, దుస్తరమైన యాతనాకరమైన విషయము. దానిని గురించి చెప్పవలసిన పనిలేదు. నరకం ఎట్లా ఉంటుందో దానిని గురించి చెప్పేదేముంది? చాలాబగా ఉన్నరోజులలోనే ఇన్ని కష్టాలు పడుతూకూడా, బాగా లేము అని అంటూంటాం.

20. ఇక నరకంమాట చెప్పేదేముంది? పశువు, పురుగు, క్రిమికీటకాదుల యాతనలు అనంతములైనవి. ఆ జీవితాలనుంచీ బయటకు వెళ్ళటం తప్పనిసరి. అందుచేతనే ఈ త్రయీమార్గమునుండి బుద్ధి మరల్చి నైష్కర్మభావం పూనాను” అని చెప్పాడు జడమహర్షి.

21. వైదికమార్గము ఈ లోకంలో సుఖాన్నిస్తుందని, అందులో సందేహం లేదని, పితృదేవతలు ఆర్య జనానికి సంతతి, ఆయుర్దాయం, భోజనం, సుఖం అన్నీ ఇస్తారు అని కూడా బోధించాడు జడమహర్షి. త్రయి(మూడు) అంటే వేదములు. వేదం చెప్పిన వైదికమార్గములు ఇక్కడ ఈ లోకంలో సుఖాన్నిస్తాయనటంలో సందేహం లేదు.

22. జీవుడికి ఏ జన్మలోనైనా సుఖం కలిగినా, మరణంలో అంతోఇంతో వేదన ఉన్నది. వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడు. ఇది చర్వితచరణం. ఇలాగే తిరుగుతాడు తప్ప ఎప్పటికీ ముందడుగు వెయ్యడు. గానుగ చుట్టూ తిరిగే ఎద్దు అక్కడే ఉంటుంది. పొద్దుట నుంచీ సాయంత్రం దాకా 10 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటుంది కానీ దూరం వెళ్ళదు. అక్కడే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది సాయంత్రం దాకా నడిచి, గమనశీలంగా ఉంటుంది కాని ప్రగతి లేదు. జీవుడు కూడా అంతే! అలాగే జన్మనుంచి మృత్యువు, మృత్యువు నుంచీ జన్మ – అలాగే ఉంటాడని జడమహర్షి భార్గవుడికి బోధచేసాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


12 Mar 2021

No comments:

Post a Comment