సాక్షిగా ఉండడం osho
Soubhagya
మనిషి
సాక్షిగా వుండడం అభ్యసించాలి. తన విషయంలోనైనా, యితరుల విషయాల్లోనైనా అది
సాధన చేసే జీవితం అపూర్వంగా వుంటుంది. ‘‘ఇది నేను చెయ్యడం లేదు. నేను
సాక్షిని మాత్రమే. అక్కడ నా నిమిత్తం లేదు. ఆ చర్యతో నాకు సంబంధం లేదు.
నేను దానికి బాహ్యంలో వున్నాను. కేవలం ప్రేక్షకుడిగా జరిగేది
చూస్తున్నాను’’ అన్న విషయాన్ని మనిషి గుర్తు పెట్టుకోవాలి. తామరాకుపై నీటి
బొట్టులా వుండడమంటే అదే.
మనిషి
దాన్ని చిన్నచిన్న విషయాల నించే ప్రారంభించాలి. వుదాహరణకి మనం భోంచేస్తూ
వుంటాం. భోజనం చేస్తున్నప్పుడు మననించే మనం వేరయి భోజనం చేస్తున్న
వ్యక్తిని పరిశీలించాలి. అదొక అపూర్వ అనుభవం. అట్లాగే నడుస్తున్నప్పుడు
నడుస్తున్న మన నుండి వేరయి మనల్ని పరిశీలించడం. ఈ క్రమంలో మెల్లమెల్లగా ఇతర
విషయాల్లోనూ ప్రయోగాలు చేయవచ్చు. సాధారణంగా మనకు సంతోషం కలిగితే సంతోషంలో
లీనమవుతాం. మనకు దుఃఖం కలగితే దుఃఖంలో మునిగిపోతాం. అంటే నువ్వు
సంతోషమయిపోతావు. నువ్వు దుఃఖమయిపోతావు. ఇవి రెండు శాశ్వతం కావు. ప్రతి
మనిషీ సంతోషం నించీ బయట పడతాడు. దుఃఖం నించీ బయట పడతాడు. అంటే అవి మనకు
సంబంధించినవి కావు. ఇవి అంటని ఒక చైతన్య స్థితి ప్రతి మనిషిలో ఉంది. ఆ
చైతన్య స్థితే మనమని గుర్తించినప్పుడు మనం వాటిని అంటే సంతోషాన్ని,
దుఃఖాన్ని దాటి వాటిని పరిశీలిస్తాం. అప్పుడు సుఖాన్ని, దుఃఖాన్ని దాటి ఒక
ఆనంద స్థితి అనుభవానికి వస్తుంది. నిజమైన మనిషితత్త్వం అదే. స్వామి
రామతీర్థ పందొమ్మిదో శతాబ్దం ఆరంభంలో భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి
చాటిన వాళ్ళల్లో ఒకడు. ఆయన వందేళ్ళ క్రితం అమెరికా వెళ్ళాడు. భారతీయ
తత్వచింతనను పాశ్చాత్యులకు పరిచయం చేశాడు. రామతీర్థ చిత్రమయిన వ్యక్తి.
మార్మికుడు. ఆయన ఎప్పుడూ ‘నేను’ అన్న మాటను వాడేవాడు కాడు. నేను
వస్తున్నాను. నేను తింటున్నాను. నేను చెబుతున్నాను’’ అనేవాడు కాదు. నేను
అన్న మాటలో ఎంతో అహం దాగి వుంటుంది. అధికారం వుంటుంది. ఆధిపత్యం వుంటుంది.
అందుకని ఆయన ‘నేను’ అన్నమాటని పరిహరించేవాడు. కానీ ‘నేను’ స్థానంలో ఏదో
వుండాలి కదా! అందుకని నేను ‘అన్న స్థానంలో’ ‘రాముడు’ అన్న మాటను
వుపయోగించేవాడు. ఆ చెప్పడంలోనే రాముడు నేను కాదన్న అర్థముంది.వుదాహరణకి ఆయనకు ఆకలి వేస్తోందనుకోండి ఆయన ‘‘నాకు ఆకలేస్తోంది అనేవాడు కాదు. రాముడికి ఆకలేస్తోంది’’ అనేవాడు. ఆయనకు తలనొప్పి వేసిందనుకోండి. రాముడికి తలనొప్పి వేస్తోంది అనేవాడు. రాముడు వేరు, తను వేరు అని ఆయన గుర్తించాడు. మనం ఇట్లాంటి సాధువుల్ని చూసే వుంటాం ఇట్లాంటి సన్యాసులు మనకు కేవలం భారతదేశంలోనే కనిపిస్తారు.
ఒకరోజు కొంతమంది ఆయన నటిస్తున్నాడని, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, జనాల్ని వంచిస్తున్నాడని ఆయన నిలదీసి అవమానించారు. దూషించారు. వాళ్ళు తిడుతున్న కొద్దీ ఆయన నవ్వుతున్నాడు. వాళ్ళందరూ ఆయన్ని అనరాని మాటలన్నా ఆయన చిరునవ్వు నవ్వుతూనే వున్నాడు. చివరికి యిక లాభం లేదనుకుని ఆ జనం వెళ్ళిపోయారు. ఆయన నవ్వడం మటకు ఆపలేదు. నవ్వుకుంటూనే తన శిష్యులున్న చోటికి వచ్చాడు. శిష్యుల్ని చూసి కూడా నవ్వాడు. గురువుగారి వింత ప్రవర్తన చూసి శిష్యులు విస్తుపోయారు. ‘‘గురువుగారూ! ఎందుకు నవ్వుతున్నారు! ఏమైంది’’ అన్నారు. రామతీర్థ శిష్యుల్ని చూసి ఈ రోజొక విషయం జరిగిందయ్యా! రాముడు దారంటే వెళుతూవుంటే ఎవరో నిలదీశారు. తిట్టారు. అవమానం పాలు చేశారు. ఆ చేసిన పనికి ఎంతో ఆనందించారు. కానీ పాపం రాముడు ఎంతో బాధ పడ్డాడు. రాముడికి ఎంతో యిబ్బంది కలిగింది. కానీ ఏం చెయ్యను. నేను రాముడికి బయట నిల్చున్నాను. అంతా చూస్తూనే వున్నాను’’ అన్నాడు.
మనిషి చైతన్యం మనిషి అహం నించీ బయటకు వచ్చి జరుగుతున్నదానికి సాక్షిగా వుండాలి. మనిషి సాధన చెయ్యాల్సింది అదే. సాధించాల్సింది అదే. సహజమైంది అదే.
No comments:
Post a Comment