భక్తి మార్గానికి భావోద్రేకాలు అడ్డంకులా?

భక్తి మార్గానికి భావోద్రేకాలు అడ్డంకులా?

పరుగులు తీసే ఆలోచనలు లేని వారిని మనుషులు అనలేం. ప్రతి ఒక్క మనిషికి ఎంతో కొంత భావోద్వేగం తప్పనిసరి. ఎవరైనా మీతో అలాంటి 'భావోద్రేకాలు అడ్డంకులు' అన్నట్లయితే, ఆ తరువాత వారు అనే పదం 'మీ బుద్ధి ఓ పెద్ద అడ్డంకి' అని. ఆ పైన, 'మీ శరీరమే ఒక పెద్ద అడ్డంకి' అంటారు. నిజమే ఒక విధంగా..! మీ శరీర సౌష్టవం, బుద్ధి వైవిధ్యం, ఆలోచనల తీవ్రత, మీలోని శక్తి మీ జీవిత గమనంలో తప్పించుకోలేని అడ్డంకులుగా నిలబడవచ్చు.

లేదా మీ పురోగతికి తోడ్పడే నిచ్చెనలుగా నిలబడవచ్చు. వాటిని మీరు ఎలా ఉపయోగించుకుంటారనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు మీ శరీరాన్ని, బుద్ధిని, ఆలోచనల పరంపరను తల బరువుగా మార్చుకుంటున్నారా? లేక ఉన్నత స్థాయికి చేరుకునేందుకు సోపానాలుగా ఉపయోగించుకుంటున్నారా? అది ముఖ్యమైన ప్రశ్న. ఈ మూడు ప్రధానంగా అడ్డంకులు అనుకుంటే అడ్డంకులు. కాని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే అవే అతి ముఖ్యమైన సాధనాలు.

ఆలోచనల ప్రతిరూపాలే...
మీలో రగిలే భావోద్రేకాలు మీ ఆలోచనలకు భిన్నమైనవి కావు. అవి వాటి ప్రతిరూపాలే. మీరు మీ ఆలోచనలను ఎలా నడిపిస్తే మీలో భావోద్రేకాలు అదే మార్గంలో నడుస్తాయి. మీరు ఎలా ఆలోచిస్తారో అందుకు తగినట్లే మనసులో భావిస్తారు కదా! ఆలోచన అన్నది ప్రాణం లేని రూపం అయితే భావన అన్నది దానికి ఒక అనుభవాన్ని జోడించే మానసిక స్పందన అని చెప్పాలి. ఆలోచన నిర్జీవం. భావన సజీవం. ఆలోచనల సారం. ఆలోచించకుండా మనోభావాలను వెల్లడించలేరు. ఉదాహరణకు ఒక వ్యక్తిని చూసి అతడో భయంకరుడు అని ఆలోచిస్తూ అతడో సుందరమైన వాడు అన్న భావాలను పెంపొందించగలమా? వెల్లడించగలమా? అది సాధ్యం కాదు. ఆలోచనలెలా ఉంటే భావాలు అలా ప్రబలమవుతాయి.

మేధస్సుదా లోపం?
అలాంటప్పుడు భావోద్రేకాలు అడ్డంకులు అన్నట్లయితే ఆలోచనలు కూడా అడ్డంకులు అనుకుని వాటిని తీసిపారేయాలి. మన బుద్ధిని, మెదడును ఇప్పుడు ఉన్న స్థితికి అభివృద్ధి చేయడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దాన్ని ఒక సమస్య అనుకుంటున్నావు. అది సరికాదు. మెదడు వల్ల కాదు సమస్య ఎదురవుతున్నది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియడం లేదు. అదే అసలు సమస్య. చాలా వేగంగా ప్రయాణించగల కారును మీకు ఇచ్చాము. కాని దాన్ని నడపడమే మీకు చేతకావడం లేదు.

అదే అసలైన సమస్య..కాదా? మీ జీవితాలకు సంబంధించి కాని, ప్రతి ఒక్కరి జీవితాలకు సంబంధించి కాని లోపం యంత్రానికి కాదు. దాన్ని నడిపే నేర్పు మీలో లేకపోవడమే. అంటే సమస్య ఆ సాధనంలో లేదు. అదొక అద్భుతమైన సాధనం. నిజంగా మహాద్భుతమైన పరికరం. మానవ మే«ధస్సు అంతటి అపూర్వమైన సంపత్తి. అంతటి సంపదను సమస్యగా భావిస్తున్నారు.

అందుకు కారణం - దాన్ని అర్థం చేసుకోవడంలోను, దాన్ని సరైన పద్ధతిలో నడిపించడంలోను మనం సక్రమంగా వ్యవహరించకపోవడమే. మేధస్సును సక్రమంగా ఉపయోగించడం చేతకాని మూర్ఖులు మాత్రమే తమ బుద్ధే తమకు సమస్యగా మారిందని అనుకుంటూ ఉంటారు. కచ్ఛితంగా వారికి వారి బుద్ధే సమస్యగా తయారైంది. వారి విషయంలో నా అభిప్రాయం కూడా అదే. వారి బుద్ధిగత ఆలోచనలు ప్రతి ఒక్కరికి సమస్యే. అంతమాత్రాన మన మేధస్సే సమస్య అనలేం.

అదుపు చేసుకోవాలి
మేధస్సు, భావోద్రేకాలు సమస్య కానే కావు. మానవ జీవితంలో భావజాలం అన్నది ఒక అందమైన ప్రక్రియ. అది లేకుంటే మానవుడు వికృతంగా మారిపోయి ఉండేవాడు. అవునా? సక్రమంగా అదుపు చేయకపోతే ఏదైనా అలాగే తయారవుతుంది. పిచ్చి పిచ్చిగా మారుతుంది. అదుపులేని ఆలోచనలు పిచ్చికి దారితీస్తాయి. అలాగే భావోద్రేకాలను సక్రమంగా నియంత్రించకపోతే, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు తయారవుతుంది.

మీరు ఎలా కావాలనుకుంటే అలా మీలో భావోద్రేకాలను ప్రేరేపించుకోవచ్చు. అలాంటప్పుడు వాటిని అందంగా కాని వికారంగా కాని ఎలా వాటిని నిలబెట్టుకోగలుగుతారు? మీరు ఆశించిన విధంగానే అంటే ఆలోచించిన తీరులోనే భావ స్పందన ఉంటే మీరు కచ్ఛితంగా వాటిని తియ్యగా ఉండాలనే అనుకుంటారు. వాటిని తియ్యగానే మార్చుకుంటారు. అవునా? అలాంటప్పుడు అందుకు తోడ్పడే బుద్ధి ఎలా ప్రతిబంధకం అవుతుంది? అది ఏ విధంగా మీ ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం అవుతుంది.

భావోద్రేకాలను ఆధ్యాత్మిక వైపు..
మొత్తం ప్రపంచంలో, దాదాపు 90 శాతం, భక్తి భావనలనే ప్రోత్సహించారు. భావోద్రేకాలను తియ్యగా మార్చుకునేందుకు భక్తి లేదా ఆధ్యాత్మికత ఒక మార్గం. అలా ఆలోచనలను, వాటి ద్వారా మన భావోద్రేకాలను తియ్యగా మార్చుకోవడమే భక్తి లేదా ఆధ్యాత్మికత. అలాంటి దాన్ని అడ్డంకి అని ఎవ్వరు చెప్పినా సరే..అది అడ్డంకి కాదు. దాని అర్థం ఒక్కటే. మీ వ్యక్తిగత ఆకాంక్ష వ్యతిరేక ప్రభావం చూపించే భావోద్రేకాలు కావచ్చు. అలాగేతై, నిజమే. అది పెద్ద అడ్డంకి అని ఒప్పుకోవాలి.

ఎవ్వరేమనుకున్నా నేను పట్టించుకోను...ఏవి సానుకూల ఆలోచనలో, ఏవి ప్రతికూల ఆలోచనలో వర్గీకరించక తప్పదు. మీ జీవితాన్ని పరిశీలించేటప్పుడు ఏది పని చేస్తుంది. ఏది పనిచేయదు అన్న కోణంలో నేను పరిశీలిస్తాను. మీకు ఉపయోగపడుతోందా? మీ కుటుంబానికి, మీ వృత్తి ప్రయోజనాలకు, మీ వ్యాపార ప్రయోజనాలకు, చివరికి మీ ఆంతరంగిక పురోగతికి తోడ్పడుతోందా? లేక, మీలో ఆవేశకావేషాలను రెచ్చగొడుతోందా, నిరాశా నిస్పృహలకు దారి తీస్తోందా. వైషమ్యాలను పెంచుతోందా. మీరు నివసిస్తున్న వాతావరణంలో మీకు తోడ్పడేలా ఉందా లేదా అన్న అంశాన్ని తప్పక పరిశీలిస్తాను.

అవి మీకు తోడ్పడేలా లేవా? తోడ్పడుతున్నాయా? అంటే, మీ ఆలోచనలు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నాయా? ప్రేమ భావాలను చిగురింపచేస్తున్నాయా? ఆదరాభిమానాలను ప్రతిఫలిస్తున్నాయా? మీకు ఉపయోగకరంగా ఉంటున్నాయా? అది చాలు. ఏది పని చేస్తున్నది అన్నదే నాకు ముఖ్యం. ఇప్పుడు ఇది సానుకూలం, ఇది ప్రతికూలం అని నేను చెప్పాలనుకోవడం లేదు. అది ఏదైనా, పని చేస్తున్నదా అన్నదే ప్రశ్న. పని చేయని దాన్ని పట్టుకు వేళ్లాడితే ఏం లాభం? దేవి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదో ఆ పని చేయడం ఎందుకు? ఈ భూమ్మీద ప్రతి ఒక్క ప్రాణి కూడా పని చేసే దాన్ని మాత్రమే ఆచరిస్తుంది. అవునా? అలాంటపుడు మనుషుల్లో ఎందుకు అది సమస్య కావాలి?
సద్గురు

No comments:

Post a Comment