నవగ్రహాల శక్తులు- మన అపోహలు.

నవగ్రహాల శక్తులు- మన అపోహలు.

గ్రహాలు అనగానే మన మనసులో దుష్టత్వం తో కూడుకున్నవి ,లేక దుష్టగ్రహాలు ,శనిగ్రహం ....ఇలా భావనలు సాగుతుంటాయి.ఈ మాటలను మనం ధూషణలలో కూడా వాడుతుండటం జరుగుతుంది.. ఏదన్నా పూజ శాంతి జరిపినా భయముతో తప్ప భక్తి తో కాదన్నది అంగీకరించాల్సిన విషయము.ఇది చాలా పొరపాటు. జీవులన్నియు గ్రహ శక్తులతోనే జీవించుచున్నవి .సృష్టి కర్త జీవరాసి వికాసము కొరకు ఆయా శక్తులను ఆయాగ్రహదేవతలకు ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిచేయమని. ఒక్కోగ్రహానికి ఒక్కొక్క శక్తి వుంటుంది. ముఖ్యంగా తొమ్మిది గ్రహాల శక్తుల ప్రభావం వలన జీవరాసి పుట్టుక, అంతము జరుగుతున్నవి. ఇందులో రెండు ఛాయా గ్రహాలు.
జీవరాశిలో మానవుడు అతి ముఖ్యమైన జీవి. అందువలననే గ్రహ శక్తులు మానవుని చు ట్టు ఆవరించుకొని ,మనిషి కదలికలపైన,ఆలోచనలపైన ప్రభావం చూపుతూ జీవితాన్ని ఆయాప్రభావాలు అనుభవించునట్లు చేయును.గ్రహబలం సరిగా లేనిచో స్త్రీ,పురుషులెవరైనా పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రహదేవతలను భక్తితో ధ్యానిస్తుంటే వారు శుభదృష్టిని ప్రసరింపజేసి మనకు కలగబోయే చెడును దూరం చేస్తుంటారు. మోసము ,కౄరము,ప్రతీకారము ,అసూయ ..ఈవిధమైన దుష్ట స్వభావాలు మనలో కలిగినప్పుడు గ్రహముల యొక్క వక్ర దృష్టి దానికి తోడైతే మనిషి పతనానికి అవి బలం చేకూర్చును. మంచి మనస్తత్వం తో ప్రవర్తించేవారిని గ్రహదేవతలు శుభదృష్టితో చూస్తారు.అలాగే పంచభూతాలు,అష్టదిక్పాలకులు కూడా . ప్రతిదినమూ ఉదయాన్నే నిదురలేవగానే ఒక్కపరి నవగ్రహాలను ,అష్టదిక్పాలకులను,పంచభూతాలను స్మరించుకుని మంచి మార్గం లో నడిపి సుఖశాంతులను ప్రసాదించమని వేడుకోవాలి.
అలాగే గ్రహముల అనుగ్రహానికి చిన్న తంత్రమున్నది. రోజూ యాభైగ్రాముల బియ్యం బెల్లం పొడితో కలిపి పక్షులకు వేయండి. పక్షులు తిన్నచో గ్రహశాంతి జరిగి మీకు మేలు కలుగుతుంది. వీలైతే ఈక్రింది శ్లోకం చదివి తర్పణమియ్యండి.

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:


పంచభూతాలంటే : భూమి ,వాయువు ,అగ్ని ,నీరు ,ఆకాశము .

అష్ట దిక్పాలకులు: ఇంద్రుడు [తూర్పు] అగ్ని [ఆగ్నేయం] యముడు[దక్షిణం] నిరృతి [నైరుతి] వరుణుడు [పశ్చిమం]
వాయువు [వాయువ్యం] కుబేరుడు [ఉత్తరం] ఈశ్వరుడు [ఈశాన్యం]

నిద్రలేవగనే గణేశుని ,గురువును ,పైదేవతలను మహాత్ములను ,మహర్షులను తలచుకోవటం సర్వదా శుభకరమని శాస్త్రాదులు సూచిస్తున్నాయి.

No comments:

Post a Comment